భార్య సుమలతతో అంబరీశ్ (ఫైల్)
సాక్షి, బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి అంబరీశ్ (66) మరణించారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో శనివారం రాత్రి 10.45 గంటల సమయంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. అంబరీశ్‌కు గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేపట్టినా కోలుకోలేకపోవడంతో అంబరీశ్ ఇక లేరని వైద్యులు ప్రకటించారు. ప్రఖ్యాత నటుడిగా పేరుతెచ్చుకున్న అంబరీశ్ 200కు పైగా చిత్రాల్లో నటించారు.
పలుమార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, ఎంపీగానూ ఎన్నికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు కూడా చేపట్టారు. యూపీఏ–1 ప్రభుత్వ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కొన్ని నెలలపాటు సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కర్ణాటకలో సిద్ధరామయ్య మంత్రివర్గంలోనూ పనిచేసి ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నారు.
అంబరీశ్ మరణవార్త తెలుసుకున్న వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్, కన్నడ నటులు పునీత్ రాజ్‌కుమార్, యశ్‌లు ఆసుపత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మండ్య జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంలో 30 మంది దుర్మరణం పాలై కన్నడనాట విషాదం తాండవిస్తున్న సమయంలో అదే జిల్లాకు చెందిన కన్నడిగుల ఆరాధ్య నటుడు కూడా మృత్యు ఒడికి చేరడంతో విషాదం రెట్టింపయ్యింది. మండ్యకు చెందిన అంబరీశ్ సినిమా, రాజకీయ రంగాల్లో రాణించారు. శాండల్‌వుడ్‌లో రెబెల్‌స్టార్‌గా ప్రసిద్ధి చెందారు. అంబరీశ్‌కు భార్య సుమలత, కొడుకు అభిషేక్ ఉన్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి
1952 మే 29న మండ్య జిల్లా మద్దూరు తాలుకా దొడ్డరాసినకెరెలో అంబరీశ్ జన్మిం చారు. అసలు పేరు మలవల్లి హుచ్చేగౌడ అమర్‌నాథ్. తండ్రిపేరు హుచ్చేగౌడ, తల్లి పేరు పద్మమ్మ. వారికి అంబరీశ్ ఆరో సంతానంగా జన్మించారు. 1994లో రాజకీయాల్లో అడుగు పెట్టారు. 1998, 99, 2004లో మండ్య నుంచి ఎంపీగా గెలిచారు. 2012లో కేపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2005లో ఎన్టీఆర్ ఫిల్మ్ ఫేర్ అవార్డు పొందారు. 2009లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. కన్నడలో 205 చిత్రాల్లో నటించారు.
ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళంలో కలిపి మొత్తం 230 సినిమాల్లో నటించారు. 1972లో విడుదలైన తన తొలి చిత్రం నాగరహావు సినిమాకే అంబరీశ్ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. 1981లో రాజకీయ నాయకులు, పోలీసుల అవినీతిపై వచ్చిన ‘అంత’ అనే సినిమాలో నటించి ప్రశంసలందుకున్నారు. 1992లో ప్రముఖ తెలుగు నటి సుమలతను అంబరీశ్ వివాహం చేసుకున్నారు. ఆయన చివరి చిత్రం ‘అంబి నింగ్ వయసాయ్’. అంబరీశ్ ఇక లేరనే విషయం తెలియగానే కన్నడ చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీ స్థాయిలో తరలివచ్చారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆత్మీయున్ని కోల్పోయా..!
సూపర్ స్టార్ రజనీకాంత్ అంబరీష్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ‘మానవతావాది, నా ప్రాణ స్నేహితుడు అంబరీష్‌ను కోల్పోయాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని రజనీ ట్వీట్ చేశారు.
A wonderful human being ... my best friend ... I have lost you today and will miss you ... Rest In Peace #Ambrish
— Rajinikanth (@rajinikanth) November 24, 2018
Comments
Please login to add a commentAdd a comment