
అగ్ర దర్శకుడి పశ్చాత్తాపం
న్యూయార్క్: ఐపా అవార్డుల వేడుకలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల ప్రముఖ దర్శకుడు కరన్ జోహార్ విచారం వ్యక్తం చేశారు. బంధుప్రీతి, హీరోయిన్ కంగనా రౌనత్ గురించి కరణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన వివరణయిచ్చారు. బంధుప్రీతి గురించి తాను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో బంధుప్రీతి, కంగనా గురించి మాట్లాడబోనని ‘ఎన్డీటీవీ’తో చెప్పారు.
‘ఆశ్రిత పక్షపాతం పట్ల నాకు నమ్మకం లేదు. ప్రతిభతోనే సినిమా రంగంలో రాణించగలం. టాలెంట్, హార్డ్ వర్క్, దృఢవిశ్వాసంతోనే అందరి మన్ననలు పొందగలం. ఐపా అవార్డుల వేడుకలో బంధుప్రీతి గురించి నేను మాట్లాడింది జోక్ మాత్రమే. కాకపోతే అసందర్భంగా దీని గురించి ప్రస్తావించడంతో అందరూ అపార్థం చేసుకున్నారు. దీనికి విచారం వ్యక్తం చేస్తున్నా’నని కరణ్ పేర్కొన్నారు.
ఇదే వివాదంలో చిక్కుకున్న హీరో వరుణ్ ధావన్ నిన్న ట్విటర్ ద్వారా క్షమాపణ చెప్పారు. ఐఫా అవార్డుల వేడుకకు కంగనా రౌనత్ హాజరుకాకపోవడంతో ఆమెపై కరణ్ జోక్ పేల్చారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఎవరినీ బాధ పెట్టే ఉద్దేశం తనకులేదని, బ్యాడ్ జోక్ వేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన తెలిపారు.