మిస్ టు మిసెస్
ఈ ఇద్దరి పెళ్లి జరుగుతుందా? లేదా? అంటూ గత కొంత కాలంగా నటి బిపాసా బసు, కరణ్‌సింగ్ గ్రోవర్ గురించి బాలీవుడ్‌లో చర్చలు జరిగాయి. ‘అలోన్’ చిత్రంలో నటించి నప్పుడు ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. బాలీవుడ్‌లో ఇలా ప్రేమలో పడే నటీనటులు చాలామందే ఉంటారు. దాదాపు మధ్యలోనే విడిపోతారు. ఈ జంట కూడా అంతే అనుకున్నారు. కానీ, బిపాసా, కరణ్ తమ ప్రేమను వివాహ బంధంతో కొనసాగించాలనుకున్నారు. ఈ నెల 30న వీరిద్దరూ బెంగాలీ సంప్రదాయంలో పెళ్లి చేసుకోనున్నారు.
పెళ్లికి ఇంకొన్ని రోజులే ఉంది కాబట్టి, దానికి సంబంధించిన వేడుకలు మొదలుపెట్టేశారు. ఆదివారం బిపాసా ఇంట్లో ‘బ్రైడల్ షవర్’ జరిగింది. దీనికి చాలామంది అతిథులును ఆహ్వానిస్తారు. కాబోయే పెళ్లి కూతురికి బహుమతులిస్తారు. పట్టుచీర కట్టి, మంగళ స్నానం చేయించి ఉంటారేమో అనుకునేరు. అదేం లేదు.. చాలా మోడర్న్‌గా ఈ తతంగాన్ని జరుపుతారు. బిప్స్ పాశ్చాత్య దుస్తుల్లో మెరిశారు. విందు, మందుతో ఈ పార్టీ చాలా గ్రాండ్‌గా జరిగింది. మరోవైపు... కరణ్‌సింగ్ గ్రోవర్ తన స్నేహితులతో గోవాలో బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ‘బ్రైడల్ షవర్’ సందర్భంగా బిప్స్ ‘మిస్ టు మిసెస్’ అనే ప్లకార్డ్‌తో ఆనందం వ్యక్తపరిచారు.