ఈ తిక్కకి లెక్కుంది...!
ఈ తిక్కకి లెక్కుంది...!
Published Fri, Jan 10 2014 12:18 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ఈవిడగారికి కొంచెం తిక్క ఉన్నట్టుందని ప్రస్తుతం బాలీవుడ్‌లో కరీనాకపూర్ గురించి అనుకుంటున్నారు. దానికి కారణం తాజాగా ఆమె కుదుర్చుకున్న ఓ డీల్. ఓ గ్రీన్ టీ ఉత్పత్తికి ప్రచారకర్తగా వ్యవహరించడానికే ఆమె ఈ డీల్ కుదుర్చుకున్నారు. మామూలుగా ఇలాంటి వాటికి నాలుగు నుంచి ఐదు కోట్లు డిమాండ్ చేసే కరీనా ఈ ప్రచారానికి మాత్రం మూడు కోట్లే అడిగారు. కరీనాలాంటి క్రేజ్ ఉన్న తారలు పారితోషికం ఇంకా ఇంకా పెంచుతారు కానీ, ఇలా తగ్గిస్తారా ఏంటి? అని చెప్పుకుంటున్నారు. అందుకే కరీనాకి తిక్కుందని అనుకుంటున్నారు.
కానీ, ఈ సుందరాంగి తిక్కకి ఓ లెక్కుంది. ‘గబ్బర్‌సింగ్’ టైప్ అన్నమాట. గ్రీన్ టీ ఆర్యోగానికి మంచిది కాబట్టి, ఇలాంటి ఉత్పత్తులను ప్రచారం చేయాల్సిన బాధ్యత తన మీద ఉందని కరీనా భావించారట. అందుకే, తక్కువ పారితోషికం అడిగారు. ఇది తెలియక కొంతమంది ఆమెకు తిక్క ఉందని అంటే, మరికొంతమంది మాత్రం, తను ఎక్కువ డిమాండ్ చేస్తే ఈ అవకాశం వేరే నాయికకు వెళ్లిపోతుందని భావించే కరీనా ఓ మెట్టు దిగిందని చెప్పుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు కథలు అల్లుతుంటే, కరీనా మాత్రం గ్రీన్ టీ యాడ్‌కి సంబంధించిన షూట్‌లో పాల్గొనడానికి డైరీ చెక్ చేసుకుంటున్నారు. త్వరలో ఈ చిత్రీకరణ జరగనుంది.
Advertisement
Advertisement