ఈ దీపావళి ప్రత్యేకం
తనకు ఈ దీపావళి ప్రత్యేకం అంటున్నారు యువ నటుడు కార్తీ. ఆయన హీరోగా నటించిన ఆల్ ఇన్ ఆల్ అళగురాజా దీపావళికి తెరపైకి రానుంది. కార్తీ ఇప్పటికి ఎనిమిది చిత్రాలు చేసినా దీపావళి పర్వదినాన విడుదలవుతున్న తొలి చిత్రం ఆల్ ఇన్ ఆల్ అళగురాజానే. కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రం విశేషాల గురించి చిత్ర కార్తీ ఏమన్నారంటే..
ఆల్ ఇన్ ఆల్ అళగురాజా గురించి చెప్పండి?
ఇది నా కెరియర్‌లో మరచిపోలేని జాయ్‌ఫుల్ చిత్రంగా మిగిలిపోతుంది. నేను దర్శకుడు రాజేష్ కూలంకషంగా చర్చించుకుని గ్రామీణకథకు వెళదామని నిర్ణయించుకుని చేసిన చిత్రమిది. చిత్ర కథ ఎక్కువభాగం అంతా సముద్ర ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ ఆల్ ఇన్ ఆల్ అనే కేబుల్ టీవీ నడిపే అళగురాజానే హీరో. హీరోకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. తన కేబుల్‌ను సన్‌టీవీకి పోటీగా భావిస్తుంటాడంటే అతని విశ్వాసం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నాకు తల్లిదండ్రులుగా ప్రభు, శరణ్యా పొన్‌వన్నన్ నటించారు. స్నేహితుడిగా సంతానం నటించారు.
హీరోయిన్ కాజల్ పాత్ర ఎలా ఉంటుంది?
చిత్ర దేవిప్రియ చిత్రంలో కాజల్ అగర్వాల్ పేరు ఇది. ఆమె పాత్ర చాలా చలాకీగా వైవిధ్యభరితంగా ఉంటుంది. నటనకూ ఆస్కారం ఉన్న పాత్ర. ఇంతకముందు మేమిద్దరం కలసి ఓ చిత్రంలో నటించాం. అప్పుడు మేమిద్దరం నటనకు కొత్త. నాకది మూడవ చిత్రం. ఆల్ ఇన్ ఆల్ అళగురాజా ఎనిమిదవ చిత్రం. కాజల్ 30 చిత్రాలకుపైగా నటించింది. ఆ అనుభవం ఆమె నటనలో స్పష్టంగా తెలుస్తోంది. సన్నివేశాల్లో ముందు ఇద్దరం చర్చించుకుని నటించాం.
ప్రభుతో నటించడం ఎలాంటి అనుభూతి ఇచ్చింది?
ప్రభు గురించి ఏమి చెప్పినా తక్కు వే. ఈ చిత్రంలో నేను ఆయనలా నటించడానికి ఎంత కష్టపడ్డానో. మరొక నటుడితో నటించడం ఎంత కష్టమో నాకిప్పుడు అర్థమైంది. నేను చిన్నతనంలోనే ప్రభు నటన చూశాను. ఈ చిత్రంలో ఆయనతో కలసి నటించడం మరచిపోలేని అనుభవం.
చిత్రంలో పాటల చిత్రీకరణకు పచ్చని గ్రామీణ ప్రాంతాలను ఎంచుకున్నారట?
నిజమే. ఈ చిత్రానికి పాటల కోసం ఫారిన్ వెళ్లకూడదని ముందే నిర్ణయించుకున్నాం. మన ఊళ్లలో లేని అందాలా! పొల్లాచ్చి, కుంభకోణం, అం బాసముద్రం ప్రాంతాలను అందంగా తెరపై ఆవిష్కరించాం. సంగీత దర్శకుడు తమన్ చాలా చక్కని బాణీలందించారు.
రాజేష్ దర్శకత్వం గురించి వివరించండి?
చిత్రాన్ని వినోదభరితంగా తీర్చిదిద్దడంలో రాజేష్ దిట్ట. ఆల్ ఇన్ ఆల్ అళగురాజా మొత్తం ఎనిమిది పాత్రల చుట్టూ తిరుగుతుంది. కోటా శ్రీనివాసరావు తనదైన బాణీలో హాస్యాన్ని పండించారు.
ఇన్నేళ్లుగా ఎనిమిది చిత్రాలే చేశారేంటి?
హీరోగా నేను ఎనిమిది చిత్రాలే చేశాను. ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రం కోసం నాకు మూడేళ్లు పట్టింది. ఇలా కొన్నిసార్లు అనుకోకుండా ఆలస్యం జరుగుతుంది. నా చిత్రాల సంఖ్య తగ్గడానికి ఇదీ ఒక కారణం. మొత్తం మీద ఈ దీపావళి ప్రత్యేకమని చెప్పవచ్చు. దీపావళికి తొలిసారిగా నా చిత్రం విడుదలవుతోంది.