షోలే మాదిరి చేస్తానన్నారు
అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ చిత్రం షోలే. ఆ చిత్రం మాదిరి మరో చిత్రాన్ని ఊహించగలమా? అయితే ఆ విధంగా కరుప్పురాజా వెళ్‌లైరాజా చిత్రాన్ని చేస్తానని ఐసరి గణేశ్ విశాల్, కార్తీలకు మాట ఇచ్చారట. ఈ ఇద్దరు కథానాయకులతో రూపొందనున్న తాజా చిత్రం కరుప్పురాజా వెళ్‌లైరాజా. ఈయన భాగస్వామ్యంతో ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై ప్రభుదేవా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది.
ఈ సంస్థలో నిర్మించిన తొలి చిత్రం దేవి, మలి చిత్రం బోగన్ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. వినోదన్, సిల సమయంగళ్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కాగా కరుప్పురాజా, వెళ్‌లైరాజా ఐదవ చిత్రంగా తెరకెక్కనుంది. హారీష్ జయరాజ్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సాయేషా కథానాయకిగా నటించనుంది. ఈ చిత్ర లోగో, టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఒక నక్షత్ర హోటల్‌లో జరిగింది.
కార్యక్రమంలో పాల్గొన్న నటి సయేషా సైగల్ మాట్లాడుతూ తాను ప్రస్తుతం నటిస్తున్న వనమగన్ చిత్రంలో ఒక పాటకు ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో డ్యాన్స్ చేయడంతో కల నిజమైనట్లు భావించానన్నారు. అలాంటిది తన రెండవ చిత్రాన్నే ఆయన దర్శకత్వంలో విశాల్, కార్తీలాంటి స్టార్ హీరోలతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్తీ మాట్లాడుతూ ఇద్దరు స్టార్ హీరోలతో ఒక చిత్రం చేయడం ఎలాంటి గందరగోళానికి దారి తీస్తుందో అందరికీ తెలిసిందేనన్నారు.
ఆ హీరోలు మంచి స్నేహితులైతేనే సినిమా సాధ్యం అవుతుందన్నారు. ఇక నటుడు విశాల్ తన గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారన్నారు. యూనిక్ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని ఆయనతో కలిసి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో తన పాత్ర హ్యూమరస్‌గా ఉంటుందని, విశాల్ పాత్ర వేరే లెవల్‌లో ఉంటుందని, అది ఆయన ఇంత వరకూ చేయనటువంటిదిగా ఉంటుందని అన్నారు. పూర్తి కాంట్సస్ట్ పాత్రల్లో తామిద్దరం నటించనున్నట్లు చెప్పారు.
షోలే మాదిరి చేస్తానన్నారు
నటుడు విశాల్ మాట్లాడుతూ ఇటీవల కన్నుమూసిన దర్శకుడు సుభాశ్ రాసిన కథ ఇదని అన్నారు. చాలా కాలం క్రితమే ఆయన ఈ కథను చెప్పారని, తనకు, కార్తీకి బాగా నచ్చడంతో చిత్రం చేయాలనుకున్నామని, నిర్మాత ఎవరన్న చర్చ వచ్చినప్పుడు ఐసరి గణేశ్ ఈ చిత్రాన్ని షోలే మాదిరి చేస్తాను ఆ విషయాన్ని తనకు వదిలేయండి అన్నారు. ఇక పోతే మల్టీటాలెంటెడ్ వ్యక్తి ప్రభుదేవా దర్శకత్వంలో ఈ చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. తాను, కార్తీ కలిసి నడిగర్‌సంఘ భవన నిర్మాణానికి రూ.10 కోట్ల నిధి అందిస్తామని చెప్పామన్నారు. అది ఈ చిత్రం నుంచే మొదలవుతుందని విశాల్ చెప్పారు.
హింస, అహింసకు మధ్య పోరాటం
చిత్ర దర్శక, నిర్మాత ప్రభుదేవా మాట్లాడుతూ హింస, అహింసకు మధ్య జరిగే పోరాటమే ఈ కరుప్పురాజా వెళ్‌లైరాజా చిత్రం అని తెలిపారు. విశాల్, కార్తీ నటించడానికి ముందుకు రావడంతో ఈ చిత్రం సెట్‌కు వెళ్లనుందని పేర్కొన్నారు.