
బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి తనకు మంచి స్నేహితుడని.. దయచేసి ఆయనను విమర్శించవద్దని స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకుని.. నిందించడం సరికాదని పేర్కొన్నారు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, రణ్‌వీర్ సింగ్, కత్రినా కైఫ్ తదితరులు కీలక పాత్రల్లో రోహిత్ శెట్టి.. ‘‘సూర్యవంశీ’’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్‌లో భాగంగా రోహిత్.. కత్రినాను తక్కువ చేసి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో #ShameOnYouRohitShetty అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఈ విషయంపై స్పందించిన కత్రినా రోహిత్ శెట్టి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.(దర్శకుడి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్)
‘‘ప్రియమైన స్నేహితులు, శ్రేయోభిలాషులు... నేను సాధారణంగా ఇలాంటి వార్తలపై స్పందించను. కానీ రోహిత్ సర్ విషయంలో నేను మాట్లాడక తప్పని పరిస్థితి. ఎందుకంటే మీరంతా ఆయనను అపార్థం చేసుకున్నారు. ‘ ‘ బ్లాస్ట్ జరుగుతున్న సమయంలో ముగ్గురు హీరోలు ఉన్నపుడు నువ్వు ఫ్రేంలో కనిపించవు’’ అని రోహిత్ శెట్టి అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజం కాదు. ఆ సీన్‌లో నేను కళ్లు మూసినట్లుగా కనిపించడంతో మళ్లీ టేక్ చేద్దాం అన్నాను. అయితే రోహిత్ సర్ మాత్రం.. ‘‘ అది బ్లాస్ట్ సీన్ కాబట్టి ఎవరూ అంతగా ఈ విషయాన్ని పట్టించుకోరు’’ అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయనే మళ్లీ మరో టేక్ చేద్దామని నాతో అన్నారు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన సినిమాల్లో నటించడం ఎంతో ఎంజాయ్ చేస్తాను. ఆయన ఎల్లప్పుడూ నాకు స్నేహితుడే’’అని కత్రినా తన సోషల్ మీడియా అకౌంట్లో రాసుకొచ్చారు. కాగా రోహిత్ శెట్టి సైతం ఈ వార్తలపై స్పందించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment