ఆ నలుగురూ నాకెంతో ముఖ్యం!
‘‘జీవితంలో ఎన్ని ఉన్నా ఒక్క మంచి ఫ్రెండ్ లేకపోతే నా దృష్టిలో ఏమీ లేనట్లే. ఎంతటి కోటీశ్వరులకైనా మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక్క ఫ్రెండ్ అయినా ఉండాలి. లేకపోతే నిరుపేద కింద లెక్క. ఫ్రెండ్స్ విషయంలో నేను ఐశ్వర్యవంతురాల్ని’’ అని దీపికా పదుకొనె అంటున్నారు. చిన్నప్పట్నుంచీ తనతో పాటు ట్రావెల్ చేస్తున్న నలుగురు స్నేహితుల గురించి దీపికా చెబుతూ -‘‘శ్రీల, హితేషి, దివ్య, స్నేహ.. ఈ నలుగురూ నా చిన్నప్పటి ఫ్రెండ్స్. మేం నలుగురం ఒకే స్కూల్లో చదువుకోలేదు. పక్క పక్క ఇళ్లల్లో ఉండేవాళ్లం. స్కూల్ అయిపోయి ఇంటికి రాగానే కలిసి హోమ్‌వర్క్ చేసుకునేవాళ్లం.
ఆ తర్వాత ఆడుకునేవాళ్లం. సెలవు రోజుల్లో మా అల్లరికి అంతు ఉండేది కాదు. ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్లే. వీలు కుదిరినప్పుడల్లా మా ఊరు బెంగళూరు వెళతాను. అప్పుడు తప్పనిసరిగా వాళ్లను కలుస్తాను. నలుగురిలో ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. ఇద్దరు బెంగళూరులో ఉన్నారు. నేను సినిమాలతో, వాళ్లు వాళ్ల పనులతో బిజీగా ఉంటారు. దాంతో రోజుల తరబడి ఫోన్ చేసుకునే తీరిక కూడా చిక్కదు. అయినప్పటికీ మా మధ్య ఉన్న స్నేహం చెక్కు చెదరలేదు. ఎప్పటికీ మేం ఇలానే మంచి స్నేహితుల్లా ఉంటాం’’ అని చెప్పారు.