
బాహుబలి రికార్డ్ చెరిగిపోయిందా..?
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన భారీ చిత్రం బాహుబలి. నిర్మాణం పరంగానే కాదు.., బిజినెస్, కలెక్షన్ల పరంగా కూడా బాహుబలి సాధించిన రికార్డ్ లు ఇప్పట్లో చెరిగిపోయే అవకాశమే లేదని భావించారు. కానీ అంచనాలను దాటుతున్న స్టార్ వాల్యూ., పెరిగిన తెలుగు సినిమా మార్కెట్, నిర్మాణం, ప్రమోషన్ పరంగా వస్తున్న మార్పులతో బాహుబలి రికార్డ్లు ఎక్కువ కాలం నిలిచేలా కనిపించటం లేదు.
తాజాగా బాహుబలి సినిమాకు సంబందించిన ప్రీ బిజినెస్ రికార్డ్ బద్దలయ్యిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150, బాహుబలి.. ఆంధ్రా రైట్స్ రికార్డ్ను చెరిపేసిందట. ఇప్పటికే ఆంధ్ర రైట్స్ విషయంలో బాహుబలి సినిమాకు చెల్లించిన 30 కోట్లే హైయస్ట్ కాగా, ఖైదీ నంబర్ 150 సినిమాకు 32 కోట్లు చెల్లించి రైట్స్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒక్క వైజాగ్కే 7.7 కోట్లు చెల్లించారట.
అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన లేకపోయినా మెగాఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలతో పండగ చేసుకుంటున్నారు. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడు. ప్రస్తుతం సాంగ్ షూట్ జరుపుకుంటున్న చిరు రీ ఎంట్రీ మూవీ 2017 సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అవుతోంది.