శుభలేఖ+లు మన ఇంట్లో సినిమా | km radhakrishnan about shubhalekha+lu | Sakshi
Sakshi News home page

శుభలేఖ+లు మన ఇంట్లో సినిమా

Published Sun, Dec 2 2018 3:37 AM | Last Updated on Sun, Dec 2 2018 3:37 AM

km radhakrishnan about shubhalekha+lu - Sakshi

కె.ఎం. రాధాకృష్ణన్‌, ప్రియ, సాయి, దీక్ష

సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘శుభలేఖ+లు’. ప్రియా వడ్లమాని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రలు చేశారు. ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి శిష్యుడు శరత్‌ నర్వాడే ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. హనుమా తెలుగు మూవీస్‌ పతాకంపై సి. విద్యాసాగర్, జనార్థన్‌ ఆర్‌.ఆర్‌ నిర్మించిన ఈ సినిమాను నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్నారు. ‘ఆనంద్, గోదావరి, చందమామ’ వంటి హిట్‌ సినిమాలకు సంగీతం అందించిన కేఎమ్‌ రాధాకృష్ణన్‌ ఈ సినిమాకు సంగీత దర్శకునిగా వ్యవహరించారు. వివాహం పట్ల నేటి యువతరం ఆలోచనా ధోరణి ఎలా ఉంది? అనే కాన్సెప్ట్‌ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌ చెప్పిన విశేషాలు....

సందర్భానుసారంగానే పాటలు
నేను సంగీతం అందించిన మంచి సినిమాల్లో ‘శుభలేఖ+లు’ ఒకటి. ఈ సినిమాలో ఆరు పాటలు ఉన్నాయి. అన్నీ సందర్భానుసారంగానే వస్తాయి. ఇందులో ఉన్న ‘పద్మనాభ పాహి’ అనే పాట పాడింది నేనే. పెద్దాడ మూర్తిగారు రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ‘వేదవాసిని’ అనే పాట పాడారు. ఈ సాంగ్‌ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇందులోని ‘శృంగారలహరి’ సాంగ్‌ నా ఫేవరెట్‌. ‘చెప్పక తప్పదు’ అనే సంగీత్‌ సాంగ్‌ ఓ ఆకర్షణ. దాదాపు 23 రోజులు ఈ సినిమా బ్యాగ్రౌండ్‌ స్కోర్‌కి పట్టింది. అంత డీటైల్డ్‌గా చేశాను.

నాకా సంతోషం ఉంది
ఈ సినిమాలోని సాంగ్స్‌ కోసం మా టీమ్‌ జరిపిన సంభాషణలు నాకు మరింత మంచి పాటలు ఇచ్చే చాన్స్‌ కలిపించాయి. దర్శకుడు శరత్‌ కూల్‌గా ఉంటారు. నిర్మాత జనార్థన్‌ ఈ సినిమాకు కథ కూడా అందించారు. ఆయనతో నాకు ఉన్న స్నేహం నా బాధ్యతను మరింత పెంచింది. నా సినిమాలో ఆరు పాటలు హిట్‌ కావాలని నేను కోరుకుంటాను. అందుకే లిమిటెడ్‌ ప్రాజెక్ట్స్‌ చేస్తుంటాను. ఎక్కువ సినిమాలు చేస్తే మజ్జిగ పలచన అవుతుందనిపిస్తోంది. తక్కువ సినిమాలు చేయడం నాకు వ్యక్తిగతంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ సక్సెస్‌ రేట్‌ పెరిగిన సంతోషం ఉంది నాకు.

యువత ఆలోచనలకు దృశ్యరూపం
వివాహం పట్ల  యువతరం ఆలోచనా ధోరణి మారింది. అరేంజ్డ్‌ మ్యారేజేస్‌ విషయంలో వధూవరుల సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పెద్దలు చూసిన సంబంధాలకు అడ్జెస్ట్‌ అయ్యే ఒక ధోరణి ఉండేది. ఇప్పుడు అలా లేదు. పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండబోతుందనే ఇన్‌సెక్యూరిటీ అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దర్లోనూ ఉంది. కొత్త ఇంట్లో ఎలా సర్దుకుపోవాలనే ఆలోచనలతో అమ్మాయిలు సతమతం అవుతుంటారు. నేటి పరిస్థితులను ప్రతిబింబించేలా శుభలేఖ+లు చిత్రం ఉంటుంది. సినిమాలోని ప్రతి పాత్రలోనూ బాధ్యతాయుతమైన ప్రవర్తన కనిపిస్తుంది. సిస్టర్‌ పెళ్లి కోసం హీరో పడే తపన, హీరోయిన్‌ పెళ్లి గురించి ఆలోచించే విధానం ఇలా ప్రతిదీ ప్రేక్షకులకు ఆసక్తికరంగానే ఉంటుంది. యూత్‌ అభిప్రాయాలకు, మనస్తత్వాలకు, ఆలోచనలకు దృశ్యరూపం ఇచ్చారు దర్శకుడు శరత్‌.

రిలీజ్‌ ముందే సక్సెస్‌ అయ్యాం
రిలీజ్‌ చేసిన టీజర్, ట్రైలర్‌లకు మంచి స్పందన లభిస్తోంది. మార్కెట్‌లో మంచి మౌత్‌ టాక్‌ వస్తోంది. సోషల్‌ మీడియాలో మంచి బజ్‌ ఉంది. ఆల్రెడీ మా సినిమాను నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డిగారు తీసుకున్నారు. దీంతో రిలీజ్‌ ముందే సక్సెస్‌ అయ్యాం అనుకుంటున్నాం. ప్రేక్షకులకు బాగా రీచ్‌ అవుతుందనే నమ్మకం ఉంది. అందుకే మాతో పాటు ఇతర సినిమాలు కూడా రిలీజ్‌ అవుతున్నాయన్న టెన్షన్‌ లేదు. ఇది మన ఇంట్లో సినిమానే. మన ఇంట్లో జరుగుతున్న విధివిధానాలే ఈ సినిమా కథనం. వాటిని సిల్వర్‌స్క్రీన్‌పై చూపించాం.

ఎస్పీబీతో హరికథ
ప్రస్తుతం ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమా చేస్తున్నాను. ఎస్పీ బాలూగారితో ‘భీష్మ’ అనే హరికథ ప్లాన్‌ చేస్తున్నాను. ఇంకో రెండు సినిమాలు కమిట్‌ అవ్వబోతున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement