కోచడయాన్ ఓ సవాల్
కోచడయాన్ ఓ సవాల్
Published Wed, Sep 25 2013 1:20 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
ఇరవైఆరేళ్ల కెరీర్.. మూడువందల సినిమాలు. బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా ట్రాక్ రికార్డ్ ఇది. ఉత్తమ డిజైనర్‌గా నాలుగు జాతీయ అవార్డులు, పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్నారామె. పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో ఎంతోమంది స్టార్స్‌కు కాస్ట్యూమ్స్ డిజైన్స్ చేశారు. ఎంతమందికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినా ‘కోచడయాన్’లో రజనీకాంత్‌కి డిజైన్ చేయడం ఓ సవాల్‌గా తీసుకున్నానని నీతా పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ప్రధాన తారాగణానికి ఆమే డిజైన్ చేశారు.
రాజుల కాలం నాటి సినిమా కావడంతో దుస్తుల పరంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి రావడం సహజం. అందుకే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే ముందు స్కెచ్ గీసుకున్నారు నీతు. ఒక్కో పాత్రకు 150 రకాల స్కెచ్‌లు గీసి, వాటిలోంచి 20 నుంచి 25 కాస్ట్యూమ్స్‌ని సెలక్ట్ చేసుకుని, వాటిని డిజైన్ చేశారు. కేవలం స్కెచ్ వర్క్‌కే ఎనిమిది నెలలు పట్టిందని సమాచారం. ముఖ్యంగా పోరాట యోధుడిగా రజనీ గెటప్‌కి మాత్రమే 25 స్కెచ్‌లు వేశారట.
ఈ చిత్రానికి పని చేయడం పట్ల నీతూ తన మనోభావాలను చెబుతూ -‘‘ఈ చిత్రం నా కెరీర్‌కి ఓ మైలు రాయి అని చెప్పొచ్చు. దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి... ఈ సినిమా మోషన్ కాప్చర్ టెక్నాలజీ విధానంతో రూపొందినది కావడం. మరొకటి.. రజనీకాంత్‌కి డిజైన్ చేయడం. ఈ స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాత కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం అంత సులువు కాదనిపించింది. నా కెరీర్‌లో ఈ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అన్నారు. రజనీ తనయ సౌందర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
Advertisement