జీఎస్టీతో సినిమా టికెట్ ధరల మోత
తమిళసినిమా: తమిళనాట జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి రావడంతో సినిమా టికెట్ ధరలు మోతమోగుతున్నాయి. జీఎస్టీ పన్నును కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం, దానికి తోడు రాష్ట్రప్రభుత్వం అదనంగా మరో 30 శాతం వినోదపు పన్నును విధించడానికి సిద్ధం అవడంతో చిత్ర వర్గాలు బెంబేలెత్తిపోయారు. దీంతో రాష్ట్రప్రభుత్వం విధించే పన్నును రద్దు చేయాలంటూ తమిళనాడు థియేటర్ల యాజమాన్యం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో సోమవారం నుంచి థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
మొత్తం మీద ప్రభుత్వం చర్చలకు సిద్ధమవడంతో థియేటర్ల యాజమాన్యం గురువారం సమ్మెను విరమించుకుంది. శుక్రవారం నుంచి థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి.అయితే మధ్యతరగతి ప్రేక్షకుడు మాత్రం టికెట్ ధర చూసి భయపడిపోతున్నాడు. ఇప్పటి వరకూ రూ.120 టికెట్ ధర ఉండగా అది 28శాతం జీఎస్టీ పన్నుతో కలిపి రూ. 153కు పెరిగింది. ఇక 18 శాతం జీఎస్టీ పన్ను పరిధిలో ఉన్న రూ.100 టికెట్ ఇప్పుడు రూ.118కు పెరిగింది. అదే విధంగా రూ. 90 టికెట్ ధర 106కు, రూ.50 టికెట్ ధర రూ.59కు పెరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా వినోదపు పన్ను విధించడానికి సిద్ధం అయితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.