అప్పుడే హీరోలు మనశ్శాంతిగా ఉంటారు!
‘‘శ్రీమంతుడు’ కంటే ముందు రాసిన కథ ఇది. అప్పుడు ‘రభస’ చేస్తూ, ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. నేను మహేశ్‌తో సినిమా అంగీకరించా. దాంతో తర్వాత చేయాలనుకున్నాం. అంతే కానీ, ‘శ్రీమంతుడు’ తర్వాత నాతో సినిమా చేయమని ఎన్టీఆర్ నాపై ఒత్తిడి తీసుకొచ్చారనే వార్తల్లో నిజం లేదు. ఆయన ఒక్క ఫోన్ చేస్తే చాలు. నేనెప్పుడూ రెడీ’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ హీరోగా ఆయన దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. కొరటాల శివ చెప్పిన విశేషాలు..
♦ ఈ భూమిని, ప్రకృతిని ఇష్టపడే ఓ యువకుడు, భూమ్మీద మనుషులను ప్రేమించే ఇంకో పెద్దాయన కలిస్తే ఏం జరిగిందనేది కథ. ట్రైలర్‌లోనే కథంతా చెప్పేశాను. స్టార్ హీరోలకు ట్రైలర్స్ అవసరం లేదు. ప్రేక్షకులు సినిమాకు వస్తారు. దాంతో కథ చెప్పడానికి ట్రైలర్‌ను వాడుకుంటా.
♦ మనకు బాగా దగ్గరైన వ్యక్తులతో సినిమా చేస్తే, రిజల్ట్ రిలేషన్‌షిప్‌పై ప్రభావం చూపుతుందేమో అనే భయం ఉంటుంది. కానీ, నా కథకు ఎన్టీఆరే బెస్ట్ చాయిస్. ఆయన కూడా క్యారెక్టర్‌ని బాగా నమ్మారు. డైలాగులతో కాకుండా నటనతో ఎమోషన్ తీసుకొచ్చారు. ఎక్కువ మాస్ సినిమాలు చేశారు గానీ, ఆయనకంటే స్టైలిష్ పర్సన్‌ని నేనింత వరకూ చూడలేదు.
♦ మోహన్‌లాల్‌గారు కథ విని, ఐదు నిమిషాల్లో ఓకే చెప్పారు. ఆయనతో తెలుగు డబ్బింగ్ చెప్పించాలనుకున్నాను. కానీ, పల్లెటూరి యాస సరిగా రాలేదు. డబ్బింగ్ వలన క్యారెక్టరైజేషన్ పాడవుతుందని ఆయనే వద్దన్నారు.
♦ అభిమానులు, ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత ఫస్ట్‌డే షేర్ ఎంత? అని అడుగుతున్నారు. సినిమా బాగుందో? లేదో? చెప్పకుండా.. ఇవి అవసరమా? మంచో.. చెడో.. ఈరోజు వసూళ్ల గురించి మాట్లాడే స్థాయికి సినిమా చేరుకుంది. ఫ్యాన్స్, మీడియా తప్ప.. హీరోలు, మేము వసూళ్లకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. కథేంటి? నా పాత్ర ఏంటి? నా లుక్ ఎలా ఉండాలి? అనే హీరోలందరూ ఆలోచిస్తున్నారు. ఈ వసూళ్ల గొడవ లేకుంటే హీరోలు మనశ్శాంతిగా ఉంటారు.
♦ ‘హీరోయిజమ్, కుటుంబ చరిత్రకు సంబంధించిన డైలాగులు రాస్తే ప్రేక్షకులు గోల చేస్తారు, తీసేయండి’ అని ఇప్పుడు స్టార్ హీరోలే చెబుతున్నారు. ప్రపంచం మారుతోంది. ప్రేక్షకుల దృక్పథం మారింది. స్టార్స్ కూడా మారుతున్నారు.
♦ హీరోలందరికీ కథలు రాశా. మంచి కథలున్నాయి. మళ్లీ ప్రభాస్‌తో ఎప్పుడు? చేస్తారంటే చెప్పలేను. రామ్‌చరణ్‌తో ఎప్పుడంటే చెప్పలేను. అన్నీ కుదరాలి. ‘జనతా గ్యారేజ్’ తర్వాత మహేశ్‌బాబుతో చేయబోయే సినిమా జనవరిలో ప్రారంభమవుతుంది. ప్రచారంలో ఉన్నట్టు అది ‘శ్రీమంతుడు’ సీక్వెల్ కాదు. ‘నో సీక్వెల్స్, నో రీమేక్స్’ నాకవి బోర్ కొడతాయి.
♦ కమర్షియల్ ఫార్మాట్‌లో సోషల్ ఇష్యూ తీసుకుని ఓ కథ చెప్పడం కష్టమే. కానీ, ప్రేక్షకులకు మంచి విషయాలు చెప్పాలనుకుంటాను. సినిమాల్లో సందేశాలు చెప్పడమే కాదు, నిజ జీవితంలోనూ ఆచరిస్తాను. నేను ప్లాస్టిక్ వాడను. మా అపార్ట్‌మెంట్ చుట్టూ మొక్కలు నాటాను. ఇవన్నీ పక్కన పెడితే.. నా సినిమాలు చూసి జనాల్లో మార్పొస్తుందని ఆశ.