కొంత చరిత్రశోధన... కొంత కల్పితం!
‘‘కొన్ని కథలకు కొంతమంది మాత్రమే నప్పుతారు. శాతకర్ణి కథకు బాలకృష్ణగారు మాత్రమే కరెక్ట్. ఆయన కోసమే పుట్టిన కథ ఇది. శాతకర్ణి పాత్రను బాలయ్య తప్ప ఎవరూ చేయలేరని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. నన్ను నమ్మి వందో చిత్రానికి అవకాశం ఇచ్చారాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అని క్రిష్ అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన బాలకృష్ణ నూరో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. ‘‘ఈ చిత్రాన్ని ఆదరించడం ద్వారా కథాబలం ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు అంగీకరిస్తారనే విషయం మరోసారి నిరూపితమైంది’’ అని పాత్రికేయులతో క్రిష్ అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘శాతవాహనుల గురించి కొన్ని పుస్తకాల ద్వారా తెలుసుకున్నాను. కొంత చరిత్ర పరిశోధన చేసి, దానికి కొంత కల్పిత కథతో ఈ సినిమా తీశా. అసలు శాతవాహనులు తెలుగువాళ్లే కాదని కొందరు అంటున్నారు. ఆ విషయం గురించి నేను వాదించదల్చుకోలేదు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘ఆంధ్రప్రశస్తి’లో శాతవాహనుల గురించి చెప్పారు. ఆయన కన్నా ఎక్కువ తెలుసా?’’ అని అన్నారు. ‘‘తెరపై కనిపించిన బాలకృష్ణ, శ్రియ తదితర నటీనటులు, తెర వెనక పని చేసిన సాయిమాధవ్ బుర్రా, చిరంతన్ భట్, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి.. ఇలా ఈ చిత్ర విజయానికి టీమ్ మొత్తం కారణం’’ అని క్రిష్ అన్నారు. వెంకటేశ్ 75వ చిత్రానికి తానే దర్శకుణ్ణి అనీ, అశ్వనీదత్ నిర్మించే ఓ చిత్రానికి దర్శక త్వం వహించనున్నాననీ ఆయన తెలిపారు.