
అబద్ధం ఇవాళ్టి జీవన విధానం!
‘‘మహాత్మా గాంధీ అనగానే నాకు ఒకటి కాదు, ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. ‘సత్యశోధన’లో ఆయన జీవితంలో చేసిన ప్రయోగాలు, ఆ సంఘటనలు, ఆయన జీవితం ఇచ్చిన సందేశం... ఇలా ఎన్నెన్నో! సత్య శోధనలో, నిజాయతీగా బతకాలనే ప్రయత్నంలో ప్రతి రోజూ కనీసం పాతికసార్లయినా మన వ్యక్తిత్వం పరీక్షకు గురవుతూ ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, సినిమా - ఇలా ఏ రంగమైనా, ఏం చేస్తున్నా ఇది తప్పదు. నేనూ అందుకు మినహాయింపేమీ కాదు. అలాంటి సంద ర్భంలో మన ప్రవర్తన చూసి కొందరు ఎదురై, నాలుగు అక్షింతలు వేయడమూ ఉంటుంది. అందుకే, సత్యశోధనలో ఒక సంఘటన, సందర్భం అని కాదు. కొన్ని గంటలు మాట్లాడగల అంశాలున్నాయి.
మహాత్ముడి జీవితం ఇవాళ్టికీ రిలవెంటా అంటే, కచ్చితంగా! కాకపోతే, అది మనుషులకే రిలవెంట్! నేనీ మాట అంటే చాలామందికి కోపం రావచ్చు కానీ... ఇవాళ మన దేశంలో, మన మధ్య ఇవాళ అసలు సిసలు మనుషులు ఎంతమంది ఉన్నారంటారు! ఎటు చూసినా నాకు జంతువులే ఎక్కువ కనబడుతున్నాయి. ఇవాళ మనలో నీతి, నిజాయతీ, చదువు, విజ్ఞానం, పని చేసే నైపుణ్యం, దేశభక్తి, క్రమశిక్షణ లాంటివి ఉన్నా, లేకపోయినా - మనందరికీ పుష్కలంగా ఉన్నవి మాత్రం మనోభావాలు! మనకున్న పెద్ద ఆస్తి అది! ఎవరు ఏమన్నా, ఏం చేసినా అవి ఎప్పటికప్పుడు దెబ్బ తినేస్తుంటాయి.
అదేమిటంటూ మనం మాట్లాడితే, ఎంత ఎక్కువ మాట్లాడితే, అంత ఎక్కువ మంది శత్రువులు తయారవుతారు. అందుకే, మనందరికీ ఇవాళ అబద్ధమే ఒక వ్యక్తిత్వం అయిపోయింది. హిందూ ధర్మం లాగా అది ఒక జీవన విధానంగా మారిపోయింది. ఇలాంటి పెయిన్‌తోనే, నాలో ఉన్న ఈ భావాలన్నీ చెప్పడం కోసమే ‘మహాత్మ’ సినిమా తీశాను. ఆ సినిమా చూసి ఎంతమంది ఆలోచనలో పడ్డారో కానీ, నేను, నా నిర్మాత అయితే ఆర్థికంగా మాత్రం నష్టపడ్డాం! కాకపోతే, మళ్ళీ మహాత్ముడి భావాలు కనీసం కొందరికైనా తెలుస్తోంది కదా అన్నదే సంతృప్తి!’’
- కృష్ణవంశీ, ప్రముఖ సినీ దర్శకుడు