'కృష్ణగాడి వీర ప్రేమగాథ' మూవీ రివ్యూ
టైటిల్ : కృష్ణగాడి వీర ప్రేమగాథ
జానర్ : రొమాంటిక్ యాక్షన్ డ్రామా
తారాగణం : నాని, మెహరీన్, సంపత్ రాజ్, మురళి శర్మ, సత్యం రాజేష్, రామకృష్ణ
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
దర్శకత్వం : హను రాఘవపూడి
నిర్మాత : 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్
ఎవడే సుబ్రమణ్యం, భలే భలేమొగాడివోయ్ లాంటి వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న నాని, అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఇప్పటి వరకు భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే అందించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ తొలిసారిగా మీడియం బడ్జెట్తో అందించిన ఈ సినిమా, రిలీజ్కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా అందాల రాక్షసి సినిమాతో పొయటిక్ లవ్ స్టోరీని అందించిన హను రాఘవపూడి, కృష్ణగాడి వీరప్రేమగాథను ఎలా తెరకెక్కించాడన్న ఆసక్తి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ కనిపించింది. మరి కృష్ణగాడి వీర ప్రేమగాథ, నాని విజయ పరంపరను కొనసాగించిందా..?
కథ :
ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న అనంతపురం జిల్లా హిందూపురంలో కథ మొదలవుతోంది. ఆ ప్రాంతాన్ని తన కనుసైగలతో శాసించే ఫ్యాక్షన్ లీడర్ రాజన్న(మహదేవన్), అతని కుడిభుజం రామరాజు(రామకృష్ణ). రామరాజు చెల్లెలు మహాలక్ష్మీ(మెహరీన్). అదే ఊళ్లో బోర్ వెల్స్ వేస్తూ ఉంటాడు కృష్ణగాడు(నాని). చిన్నప్పుడు స్కూల్ లో చదువుకునే రోజుల్లోనే మహాలక్ష్మీ ప్రేమ గెలుచుకున్న కృష్ణ, ఆ విషయం ఆమె అన్న రామరాజుకు చెప్పలేక పదిహేనేళ్లుగా ఆ విషయాన్ని నానుస్తుంటాడు. మహాలక్ష్మీ తనకు ఇంట్లో వాళ్లు పెళ్లి చేయకుండా ఉండటం కోసం కావాలనే డిగ్రీ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో పండగ సెలవులకు రాజన్న తమ్ముడు(సంపత్ రాజ్) పిల్లలు రాజన్న దగ్గరకు వస్తారు. వాళ్లంతా ఇంట్లో ఉన్న సమయంలో రాజన్న మీద ఎటాక్ జరుగుతోంది. ఆ ఎటాక్ నుంచి పిల్లలను తప్పించిన రామరాజు, వాళ్లను హైదరాబాద్లోని రాజన్న తమ్ముడికి అప్పగించమని కృష్ణకు చెప్తాడు. అలా చేస్తే తన చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. తన ప్రేమ కోసం పిల్లలను హైదరాబాద్ తీసుకెళ్లడానికి అంగీకరించిన నాని ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. అసలు రాజన్న మీద దాడి చేసింది ఎవరు..? కృష్ణగాడి ప్రేమకథకు దుబాయ్ డాన్ డేవిడ్ భాయ్కి సంబంధం ఏంటి..? చివరకు కృష్ణగాడు తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అన్నదే మిగతా కథ.
నటీనటులు :
నాని మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేమికుడిగా, పిరికివాడిగా అద్భుతమైన నటనతో అలరించాడు. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్తో నాచురల్ స్టార్గా తనకు ఇచ్చిన టైటిల్ను జస్టిఫై చేసుకున్నాడు. ఈ సినిమాతో పరిచయం అయిన మెహరీన్ తన పరిధి మేరకు ఆకట్టుకుంది. ముఖ్యంగా లవ్ సీన్స్లో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో మెప్పించింది. రాజన్నగా మహదేవన్, రామరాజుగా రామకృష్ణల నటన బాగుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సంపత్ మరోసారి తన మార్క్ చూపించగా. దుబాయ్ డాన్ డేవిడ్ భాయ్ పాత్రలో మురళిశర్మ నటన సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సత్యం రాజేష్, 30 ఇయర్స్ పృథ్వీల కామెడీ టైమింగ్ బాగుంది.
సాంకేతిక నిపుణులు :
తొలి సినిమాతో లవ్ స్టోరిని మాత్రమే డీల్ చేసిన హనురాఘవపూడి ఈ సినిమాతో ఎమోషనల్ డ్రామా, యాక్షన్ను కూడా అదే స్థాయిలో మెప్పించగలనని నిరూపించుకున్నాడు. తొలి భాగం అందమైన ప్రేమకథగా చూపించిన దర్శకుడు సెకండాఫ్ను అడ్వంచరస్ ట్రావెల్ డ్రామాగా మలిచాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం బాగుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ మెప్పించాడు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి బాగుంది. 14 రీల్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
స్టోరీ, స్క్రీన్ ప్లే
నాని
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ లో వచ్చే పాటలు
ఓవరాల్గా కృష్ణగాడి వీర ప్రేమగాథ నాని కెరీర్కు మరో భారీ హిట్ను అందించటం ఖాయంగానే కనిపిస్తోంది.
- సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్