Krishna Gaadi Veera Prema Gaadha
-
మరో ‘గాథ’కు రెడీ
నేచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఈ సినిమా మంచి విజయం సాధించటంతో ఇదే కాంబినేషన్లో మరో సినిమా ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. హను కూడా నాని సినిమా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే నితిన్ హీరోగా హను దర్శకత్వంలో తెరకెక్కిన లై నిరాశపరచటంతో నాని సినిమా వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం హను రాఘవపూడి, శర్వానంద్ హీరోగా పడి పడి లేచే మనసు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే నాని, హనుల సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. పడి పడి లేచే మనసు సినిమాను నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లోనే నాని, హనుల సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
పిల్లగ్యాంగ్తో కృష్ణగాడు
కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తనకు మంచి హిట్ అందించిన దర్శకుడు హను రాఘవపూడికి హీరో నాని డిఫరెంట్ స్టైల్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా షూటింగ్ సమయంలో చైల్డ్ ఆర్టిస్ట్ లతో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసిన నాని, 'కృష్ణ, పిల్ల గ్యాంగ్ తరుపున హను రాఘవపూడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు, లై అద్భుతంగా ఉంటుంది' అంటూ ట్వీట్ చేశాడు. నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా హను రాఘవపూడి నితిన్ హీరోగా లై సినిమాను తెరకెక్కిస్తున్నాడు. Wishing u very happy birthday @hanurpudi from Krishna and the pilla gang .. #LIE will be awesome .. I know it .. Rock on :) pic.twitter.com/cvvjejkYqd — Nani (@NameisNani) 19 April 2017 -
అఖిల్ రెండో సినిమా ప్రకటించేశాడు..!
దాదాపు పది నెలల తరువాత అఖిల్ తన రెండో సినిమాను కన్ఫామ్ చేశాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ వారసుడు తొలి సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. తొలి సినిమాలోనే తన వయసుకు మించిన మాస్ యాక్షన్లను తలకెత్తుకున్న అక్కినేని అందగాడు అభిమానులను నిరాశపరిచాడు. దీంతో రెండో సినిమా విషయంలో చాలా కసరత్తులు చేశాడు అఖిల్. వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను... ఇలా స్టార్ డైరెక్టర్లందరి పేర్లు వినిపించినా.. ఫైలన్గా ఓ యువ దర్శకుడితో పనిచేసేందుకు ఓకె చెప్పాడు. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హను రాఘవపూడి, తరువాత కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిపించుకున్నాడు. ఈ క్లాస్ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు అఖిల్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపాడు. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. Hi guys ! Been working on a script with @hanurpudi almost done with pre production work. Very excited to finally start shoot soon. Cont. — Akhil Akkineni (@AkhilAkkineni8) 27 July 2016 More details soon just wanted to update you it's been way too long but I hope worth the wait :) will connect soon again! Love to all — Akhil Akkineni (@AkhilAkkineni8) 27 July 2016 -
రూట్ మార్చిన ఎన్టీఆర్..
ఒకప్పుడు మాస్ మూసలో వరుస సినిమాలు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇప్పుడు రూటు మార్చాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలతో ఆకట్టుకున్న జూనియర్, రాబోయే సినిమాల విషయంలో కూడా కొత్త తరహా పాత్రల మీదే దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, ఈ సినిమాలో ఐఐటి స్టూడెంట్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినిమాకు అంగీకరించిన బుడ్డోడు, ఆ తరువాత పొయటిక్ టచ్ ఉన్న సినిమాలను తెరకెక్కించే హనూ రాఘవపూడి దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హనూ రాఘవపూడి, ఆ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా.., కమర్షియల్ సక్సెస్‌ను మాత్రం సాధించలేకపోయాడు. తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్, నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ హీరోగా రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు హను. ఇప్పటికే బుడ్డోడికి కథ కూడా వినిపించిన ఈ యంగ్ డైరెక్టర్, ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. -
ఆ హీరో 16 సినిమాలు కాదన్నాడా..?
భలే భలే మగాడివోయ్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన నాని, ప్రస్తుతం సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటున్నాడు. స్టార్ డైరెక్టర్ల నుంచి కొత్త దర్శకుల వరకు అందరూ నానితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నా.. అతడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మంచి విజయం సాధించినా, ఆ సినిమా బ్లాక్ బస్లర్స్ లిస్ట్ లో చేరకపోవటంతో నెక్ట్స్ సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు నాని. ఆ తరువాత ఉయ్యాల జంపాల దర్శకుడు విరించి వర్మతో ఓ సినిమా చేస్తాన్న టాక్ వినిపిస్తున్నా, అఫీషియల్ గా మాత్రం ఎనౌన్స చేయలేదు. దీంతో తరువాత నాని చేయబోయే సినిమాపై ఇంత వరకు ఎలాంటి క్లారటీ రాలేదు. ఇప్పటికే 16 కథలు విన్న నాని వాటిలో ఏ ఒక్క కథకు ఓకె చెప్పలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇలా నాని కాదన్న కథల్లో స్టార్ డైరెక్టర్లు తెచ్చినవి కూడా ఉండటంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. -
మహాలక్ష్మీ బాలీవుడ్ ఎంట్రీ
తొలి సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మెహరీన్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుంది. నాని హీరోగా తెరకెక్కిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో మహాలక్ష్మీగా వెండితెరకు పరిచయం అయిన ఈ భామ, తన నటనతో ఆకట్టుకుంది. తెర మీద కాస్త బొద్దుగా కనిపించినా.., గ్లామర్‌తో పాటు పర్ఫామెన్స్లోనూ మంచి మార్కులు సాధించింది. దీంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో కళ్యాణ్ రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు సాయిధరమ్ తేజ్, బీవీయస్ రవి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాల్లో హీరోయిన్గా ఫైనల్ అయ్యింది. వీటితో బాలీవుడ్‌లోనూ ఓ సినిమాను అంగీకరించింది మెహరీన్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో పంజాబీ అమ్మాయిగా నటించనుంది మెహరీన్. పలు ప్రకటనల్లో నార్త్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్గా అలరించడానికి రెడీ అవుతోంది. -
నాని డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా
కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు హను రాఘవపూడి మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. రెండో సినిమాతోనే ఘన విజయం సాధించిన ఈ డైరెక్టర్‌తో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంతో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, ఆ సినిమా పూర్తయిన తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించాడట. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హను, ఆ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించినా, కమర్షియల్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని తన మార్క్ చూపిస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్న కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. -
నచ్చే ప్రేమగాథ
చిత్రం: ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, తారాగణం: నాని, మెహరీన్, ‘మిర్చి’ సంపత్, మాటలు: జై కృష్ణ, పాటలు: కృష్ణకాంత్, కెమేరా: యువరాజ్,యాక్షన్: విజయ్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: హను రాఘవపూడి ఈ మధ్య చూసిన సినిమాల్లో కథ గురించి, టేకింగ్ గురించి, ప్లాట్ గురించి, కెమెరా వర్క్ గురించి మాట్లాడడం సహజంగా జరుగుతోంది. ఈ ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ దర్శకుడు హను.. మంతుడు... అంటే పనిమంతుడు అని చెప్పాలనిపిస్తుంది. దర్శ కత్వ ప్రతిభ ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. కృష్ణగాడి (నాని) వీర ప్రేమగాథ చిన్నప్పుడే మొదలైంది. పదేళ్ల వయసులో మహాలక్ష్మిని (మెహరీన్) ప్రేమిస్తాడు. కానీ చెప్పుకోలేడు. చెబితే వాళ్ల అన్న రామరాజు కుళ్లబొడుస్తాడేమోనని భ యం. కాదు ప్యాంటు తడుపుకునేంత భయం. ఎందుకంటే మహాలక్ష్మి అన్న రాయలసీమలోని ముఠా నాయకుడు రాజన్నకు నమ్మినబంటు. చాలా పరాక్రమశాలి. ఓ ఇరవైమందిని ఒంటి చేతితో మట్టి కరిపించగల శక్తిమంతుడు. ఇతని ప్రత్యర్థి అప్పిరెడ్డి... రాజన్నను చంపాలనే ప్రయత్నంలో తన ఐదుగురు కొడుకులను పొగొట్టుకుంటాడు. అతణ్ణి ఎప్పుడె ప్పుడు చంపుదామని చూస్తూ ఉంటాడు. ఇక హీరోయిన్‌కి కూడా అన్నకు తగ్గట్టు కాస్త తెగువ ఎక్కువే. దాని వల్ల హీరో నానికి కష్టాలు కావాల్సినన్ని. చిన్నతనం నుంచి పెకై ప్పుడూ దెబ్బలాడు కునే హీరో, హీరోయిన్లు ఎవరికీ తెలియకుండా ప్రేమించేసుకుం టారు. ‘మా అన్నకు చెప్పి ముహూర్తం పెట్టమ’ని హీరోయిన్ ఒత్తిడి చేస్తుంది. కానీ ‘మీ అన్నే వచ్చి నన్ను అడగాలి’ అని తప్పించుకునే పిరికివాడు హీరో. రాజన్నకు ఓ తమ్ముడు. పేరు శ్రీకాంత్ (‘మిర్చి’ సంపత్). హైదరాబాద్‌లో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్. ఎవరికీ భయపడని నీతిమంతుడు. అరెస్ట్ చేస్తే జాబ్ చేస్తున్నట్టు ఉంటుందని, ఎన్కౌంటర్ చేస్తే జాబ్ ‘బాగా’ చేస్తు న్నట్టుంటుందని అతని నమ్మకం. క్రిమినల్స్‌ని అతను అరెస్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్నట్టు, వదిలేస్తే మిస్సింగ్ న్యూస్‌లో ఉంటారు. ఎంతటి మూర్ఖుడంటే డీఎస్పీని కూడా ఎన్కౌంటర్ చేసే టైప్. ఇంతలో దుబాయ్ నుంచి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ డాన్ సింగపూర్ నుంచి డేవిడ్ ఇబ్రహీం(మురళీశర్మ) హైదరాబాద్‌లోకి ఎంటరవుతాడు. వాళ్ల అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో చాదర్ సమర్పించుకోవడానికి వస్తాడు. ఆ సమయం లోనే ర్యాష్ డ్రైవింగ్ కేసులో మురళీశర్మను ‘మిర్చి’ సంపత్ అరెస్ట్ చేస్తాడు. ఇక ‘మిర్చి’ సంపత్కున్న ఎన్కౌంటర్ ఇమేజ్‌కు భయ పడి, తమ భాయ్‌ని విడిపించుకోవడం కోసం రాజన్న దగ్గరకొ చ్చిన అతని పిల్లల్ని కిడ్నాప్ చేయాలని యత్నిస్తారు భాయ్ అను చరులు. ఈ ప్రయత్నాన్ని హీరోయిన్ అన్న విఫలం చేసి పిల్లల్ని హీరో నానికి అప్పగిస్తాడు. ఈ పిల్లల్ని జాగ్రత్తగా హైదరాబాద్‌కు తీసుకువెళితే తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. చావడానికి కాదు బ్రతకడానికి ఓ ధైర్యం కావాలి అన్న ఫిలాసఫీ వెనక దాక్కునే పరమ పిరికి క్యాండిడేట్ మన హీరో. శుద్ధ పిరికివాడైన హీరోగారి నాన్న ఎవరి పిల్లవాడినో కాపాడ బోయి తన ప్రాణాల్ని పోగొట్టుకుంటాడు. అందుకే తండ్రిని మూర్ఖుడనుకుంటాడు హీరో. ఇంతలో హీరోయిన్ అన్న ఇచ్చిన ఆఫర్‌కి ఉబ్బిత బ్బిబై, పిల్లల్ని హైదరాబాద్ చేర్చే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో సెకండాఫ్‌లో కావాల్సినంత కామెడీ, అంతకంటే ఎక్కువ ట్విస్టులతో కథ సుఖాంతమవుతుంది. పిరికి హీరో- వాళ్ల నాన్న చేసిన త్యాగాన్ని గౌరవించడమే కాక ధైర్యవంతుడిగా ఎలా మారతాడనేది డెరైక్టర్ తెరపై క్రియేట్ చేసిన రెండున్నర గంటల ప్రయాణం. ప్రేమ హీరోతో ఏమైనా చేయిస్తుందనేది మనందరికీ తెలిసిన విషయం. సినిమా మీద ప్రేమతో ఈ టీమ్ చేసిన ప్రయత్నం మంచి ప్రయత్నమే అనుకోవచ్చు. సినిమా సెకండ్ హాఫ్ అంతా ప్రధానంగా ముగ్గురు చిన్నపిల్లల చుట్టూరా నడపడం తెలివైన ఎత్తు. సినిమాను ఫ్యామిలీలకు సన్నిహితం చేసి, ఆడి యన్స మార్కెట్ సైజ్ పెంచడానికి ఉపకరించే బాక్సాఫీస్ వ్యూహం. పాత్రలకు నటుల ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. హీరో ఫ్రెండ్‌గా ‘సత్యం’ రాజేశ్, అలాగే మురళీశర్మ, బ్రహ్మాజీ, ‘థర్టీ ఇయర్స్’ పృథ్వి, ‘ప్రభాస్’ శ్రీను నవ్విస్తారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సీజీ, డీఐ, విజయ్ యాక్షన్ కొరియోగ్రఫీ అన్నీ తీయగా ఉన్నాయి ఏదీ అతిగా లేదు. కెమేరామన్ యువరాజ్ విజువల్స్, ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే ‘నువ్వంటే నా నవ్వు...’ పాట, ఆ లొకేషన్లు, చిత్రీకరణ తాజా అనుభూతినిస్తాయి. సాహిత్యమూ బాగుంది. నానీని పట్టుకోలేము అన్నంత బాగా పెర్ఫార్మ్ చేశాడు. స్ప్లిట్ సెకండ్లో హావభావాల్ని మార్చాల్సిన సన్నివేశాలు ఎన్నో స్క్రిప్ట్‌లో ఉన్నాయి. అన్నీ పట్టువిడుపులతో ఆడుకున్నాడు. హను రాఘవపూడి, నాని - ఇద్దరూ ఇద్దరే. ఇది వీళ్లిద్దరి వీరగాథ. - ప్రియదర్శిని రామ్ -
రానా హీరోగా కవచం
అందాల రాక్షసి సినిమాతో టేస్ట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో కమర్షియల్గానూ ఆకట్టుకున్నాడు. దీంతో ఇప్పుడు యంగ్ హీరోల దృష్టి హను రాఘవపూడి మీద పడింది. గతంలో ఇతని కాంబినేషన్లో సినిమా అనుకొని ఆగిపోయిన హీరోలు కూడా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్‌ను బయటకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. అందాల రాక్షసి తరువాత రానా హీరోగా కవచం పేరుతో సినిమా చేయాలనుకున్నాడు హను రాఘవపూడి. ఈ సినిమాను సురేష్ బాబు, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తారన్న టాక్ వినిపించింది. హను కూడా పక్కా ప్లానింగ్‌తో దాదాపు ఏడాదిన్నర పాటు కవచం స్క్రీప్ట్ మీద వర్క్ చేశాడు. కానీ అదే సమయంలో రానా బాహుబలితో బిజీ కావటంతో కవచం సినిమా ఆగిపోయింది. తాజాగా కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథను కూడా డీల్ చేయగలడని ప్రూవ్ చేసుకున్న హనుతో కవచం సినిమాను తిరిగి ప్రారంభించడానికి రానా ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. అయితే ఈ సారి కూడా బాహుబలి-2 సినిమాతో బిజీగా ఉన్న రానా, ఈ గ్యాప్ లోనే డేట్స్ అడ్జస్ట్ చేస్తాడా..? లేక బాహుబలి-2 పూర్తయ్యాక హను రాఘవపూడితో సినిమా చేస్తాడా చూడాలి. -
'కృష్ణగాడి వీర ప్రేమగాథ' మూవీ రివ్యూ
టైటిల్ : కృష్ణగాడి వీర ప్రేమగాథ జానర్ : రొమాంటిక్ యాక్షన్ డ్రామా తారాగణం : నాని, మెహరీన్, సంపత్ రాజ్, మురళి శర్మ, సత్యం రాజేష్, రామకృష్ణ సంగీతం : విశాల్ చంద్రశేఖర్ దర్శకత్వం : హను రాఘవపూడి నిర్మాత : 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఎవడే సుబ్రమణ్యం, భలే భలేమొగాడివోయ్ లాంటి వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న నాని, అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఇప్పటి వరకు భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే అందించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ తొలిసారిగా మీడియం బడ్జెట్‌తో అందించిన ఈ సినిమా, రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా అందాల రాక్షసి సినిమాతో పొయటిక్ లవ్ స్టోరీని అందించిన హను రాఘవపూడి, కృష్ణగాడి వీరప్రేమగాథను ఎలా తెరకెక్కించాడన్న ఆసక్తి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ కనిపించింది. మరి కృష్ణగాడి వీర ప్రేమగాథ, నాని విజయ పరంపరను కొనసాగించిందా..? కథ : ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న అనంతపురం జిల్లా హిందూపురంలో కథ మొదలవుతోంది. ఆ ప్రాంతాన్ని తన కనుసైగలతో శాసించే ఫ్యాక్షన్ లీడర్ రాజన్న(మహదేవన్), అతని కుడిభుజం రామరాజు(రామకృష్ణ). రామరాజు చెల్లెలు మహాలక్ష్మీ(మెహరీన్). అదే ఊళ్లో బోర్ వెల్స్ వేస్తూ ఉంటాడు కృష్ణగాడు(నాని). చిన్నప్పుడు స్కూల్ లో చదువుకునే రోజుల్లోనే మహాలక్ష్మీ ప్రేమ గెలుచుకున్న కృష్ణ, ఆ విషయం ఆమె అన్న రామరాజుకు చెప్పలేక పదిహేనేళ్లుగా ఆ విషయాన్ని నానుస్తుంటాడు. మహాలక్ష్మీ తనకు ఇంట్లో వాళ్లు పెళ్లి చేయకుండా ఉండటం కోసం కావాలనే డిగ్రీ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో పండగ సెలవులకు రాజన్న తమ్ముడు(సంపత్ రాజ్) పిల్లలు రాజన్న దగ్గరకు వస్తారు. వాళ్లంతా ఇంట్లో ఉన్న సమయంలో రాజన్న మీద ఎటాక్ జరుగుతోంది. ఆ ఎటాక్ నుంచి పిల్లలను తప్పించిన రామరాజు, వాళ్లను హైదరాబాద్‌లోని రాజన్న తమ్ముడికి అప్పగించమని కృష్ణకు చెప్తాడు. అలా చేస్తే తన చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. తన ప్రేమ కోసం పిల్లలను హైదరాబాద్ తీసుకెళ్లడానికి అంగీకరించిన నాని ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. అసలు రాజన్న మీద దాడి చేసింది ఎవరు..? కృష్ణగాడి ప్రేమకథకు దుబాయ్ డాన్ డేవిడ్ భాయ్‌కి సంబంధం ఏంటి..? చివరకు కృష్ణగాడు తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : నాని మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేమికుడిగా, పిరికివాడిగా అద్భుతమైన నటనతో అలరించాడు. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌తో నాచురల్ స్టార్‌గా తనకు ఇచ్చిన టైటిల్‌ను జస్టిఫై చేసుకున్నాడు. ఈ సినిమాతో పరిచయం అయిన మెహరీన్ తన పరిధి మేరకు ఆకట్టుకుంది. ముఖ్యంగా లవ్ సీన్స్‌లో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించింది. రాజన్నగా మహదేవన్, రామరాజుగా రామకృష్ణల నటన బాగుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సంపత్ మరోసారి తన మార్క్ చూపించగా. దుబాయ్ డాన్ డేవిడ్ భాయ్ పాత్రలో మురళిశర్మ నటన సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సత్యం రాజేష్, 30 ఇయర్స్ పృథ్వీల కామెడీ టైమింగ్ బాగుంది. సాంకేతిక నిపుణులు : తొలి సినిమాతో లవ్ స్టోరిని మాత్రమే డీల్ చేసిన హనురాఘవపూడి ఈ సినిమాతో ఎమోషనల్ డ్రామా, యాక్షన్‌ను కూడా అదే స్థాయిలో మెప్పించగలనని నిరూపించుకున్నాడు. తొలి భాగం అందమైన ప్రేమకథగా చూపించిన దర్శకుడు సెకండాఫ్‌ను అడ్వంచరస్ ట్రావెల్ డ్రామాగా మలిచాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం బాగుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ మెప్పించాడు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి బాగుంది. 14 రీల్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : స్టోరీ, స్క్రీన్ ప్లే నాని క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : సెకండాఫ్ లో వచ్చే పాటలు ఓవరాల్‌గా కృష్ణగాడి వీర ప్రేమగాథ నాని కెరీర్‌కు మరో భారీ హిట్‌ను అందించటం ఖాయంగానే కనిపిస్తోంది. - సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్ -
అందాల రాక్షసి నానితో చేద్దామనుకున్నా!
‘‘జనరల్‌గా నేను ఏ కథ రాసుకున్నా కామన్ మ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటాను. నాలుగు గోడల మధ్య కూర్చుని కథ రాసే అలవాటు లేదు. నలుగురితో డిస్కస్ చేస్తాను’’ అని హను రాఘవపూడి అన్నారు. ‘అందాల రాక్షసి’ చిత్రం ద్వారా దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్నారాయన. ఇప్పుడు నాని హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ నేడు తెరపైకి వస్తోంది. ఈ సందర్భంగా హను రాఘవపూడి పలు విశేషాలు చెప్పారు. దర్శకునిగా నా మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ 2012లో విడుదలైంది. ఆ తరువాత యాక్షన్ లవ్‌స్టోరీ తెరకెక్కించాలని కథ రాసుకున్నా. ఆ కథతోనే తీయాలని ఓ ఏడాదిన్నర ట్రావెల్ చేశాను. కానీ, కుదరలేదు. వాస్తవానికి ‘అందాల రాక్షసి’ కథను ముందుగా నానీకే చెప్పాను. కానీ, తనకు సూట్ కాదనుకున్నాడు. ఆ తర్వాత చెప్పిన రెండు కథలకు కూడా నాని పెద్దగా ఎగ్జయిట్ కాలేదు. చివరకు ఈ కథ నచ్చింది. ఈ కథలో ఓ వైవిధ్యమైన పాయింట్ ఉంది. గడచిన 20 ఏళ్లల్లో ఆ పాయింట్‌ని ఎవరూ టచ్ చేయలేదు. బలమైన ప్రేమకథతో సాగే ఈ చిత్రం వినోద ప్రధానంగా సాగుతుంది. ఇందులో నాని ఎక్కడా కనిపించడు. కృష్ణ పాత్రే కనిపిస్తుంది. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాలో బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడు కాబట్టి ‘జై బాలయ్య’ టైటిల్ వినపడింది కానీ, మేం ముందు నుంచీ ఆ టైటిల్ అనుకోలేదు. ఈ సినిమాకి సంగీత దర్శకునిగా ముందు రథన్నే అనుకున్నాం. కానీ, ఆ తర్వాత విశాల్ చంద్రశేఖర్‌తో చేయించాం. రథన్కీ, నాకూ మధ్య ఎలాంటి గొడవలూ లేవు. భవిష్యత్తులో తనతో సినిమా చేస్తాను. నిర్మాతలు అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సహకారం మర్చిపోలేనిది. రాజీపడకుండా నిర్మించారు. నేనే పని చేసినా ముందు ఆత్మసంతృప్తి లభించాలనుకుంటా. ఆ తర్వాత ప్రతిఫలం గురించి ఆలోచిస్తా. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ పూర్తి సంతృప్తినిచ్చింది. త్వరలో ‘కవచం’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నా. దానికి ఇంకా హీరోని నిర్ణయించలేదు. -
నాని.. బాలకృష్ణ అభిమాని కాదా..?
ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మొగాడివోయ్ సినిమాలతో మంచి ఫాంలో ఉన్న నాని హీరోగా తెరకుక్కుతున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నాని హీరో బాలకృష్ణ అభిమానిగా నటిస్తున్నాడన్న వార్త నందమూరి అభిమానుల్లో కూడా అంచనాలను పెంచేసింది. సినిమా పోస్టర్స్, టీజర్లో నాని చేతి మీద జై బాలయ్య అనే టాటూ కనిపించటం కూడా ఈ టాక్‌కు మరింత బలం ఇచ్చింది. అంతేకాదు ఈసినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను కన్ఫామ్ చేశారన్న టాక్ కూడా బలంగా వినిపించింది. అయితే తాజాగా ఈ విషయం పై నాని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో తాను బాలయ్య అభిమానిగా నటిస్తున్నాడా లేదా అన్న విషయం చెప్పకుండానే, జై బాలయ్య అన్న టైటిల్ ఎప్పుడు పరిశీలించలేదని, ఈ సినిమా 15 ఏళ్ల టైం ఫ్రేం లో జరిగే ప్రేమకథ అని, అలాంటి సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ అసలు సూట్ అవ్వదని వివరణ ఇచ్చాడు. అసలు ఈ సినిమాలో నాని క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కృష్ణగాడి వీర ప్రేమగాథ ప్రమోషన్లో భాగంగా నాని ఈ కామెంట్స్ చేశాడు. అందాలరాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మెహరీన్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. -
నాకిదో తియ్యని అనుభూతి!
‘‘నేను పుట్టింది పంజాబ్‌లో.. పెరిగింది ఢిల్లీలో. న్యూయార్క్‌లోనూ చదువుకున్నాను. ఏడాదిన్నర క్రితం ముంబై వచ్చాను. ఇప్పటివరకూ చాలా యాడ్స్‌లో నటించాను’’ అని చెప్పారు మెహరిన్. నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ చిత్రం ద్వారా ఆమె కథనాయికగా పరిచయమవుతున్నారు. ఈ నెల 12న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా మెహరీన్ చెప్పిన ముచ్చట్లు... ♦ న్యూయార్క్‌లో తెలుగు సినిమాలు చూసేవాళ్లు చాలామందే ఉన్నారు. నేను కూడా చాలా చూశాను. వాటిలో ‘దూకుడు’ ఒకటి. అంత పెద్ద సినిమా నిర్మించిన 14 రీల్స్ సంస్థలో సినిమా చేసే అవకాశం వస్తుందని నేను ఊహించలేదు. అందుకే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’కు అవకాశం వచ్చినప్పుడు స్వీట్ షాక్ తగిలినట్లుగా అనిపించింది. నేను యాక్ట్ చేసిన యాడ్స్ చూసి, దర్శకుడు హను రాఘవపూడి కాల్ చేసి, మేకప్ లేకుండా ఫొటోలు పంపించమని అడిగారు. పంపించాను. రెండు రోజుల పాటు ఆడిషన్స్ చేసి, చివరకు ఎంపిక చేశారు. ♦ ఈ చిత్రంలో నా పాత్ర పేరు మహాలక్ష్మి. నానీకి ప్రేయసిని. నాని న్యాచురల్ ఆర్టిస్ట్. నేను చూసిన తెలుగు సినిమాల్లో తను నటించిన ఈగ, ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్ చిత్రాలు ఉన్నాయి. నాకిది తొలి సినిమా కాబట్టి, పాత్ర కోసం సెట్లో డైలాగ్స్‌ను బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని. షూటింగ్ ప్రారంభించక ముందే హను రాఘవపూడిగారు నన్ను మహాలక్ష్మీలానే డ్రెస్ చేసుకోమనేవారు. నా కాస్ట్యూమ్స్‌ని ఆయనతో కలిసి నేనే షాపింగ్ చేశాను. షూటింగ్ మొదలుపెట్టేసరికి మహాలక్ష్మిలానే మారిపోయాను. ♦ ఈ చిత్రం షూటింగ్ సమయంలో కాలికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయ్యింది. బ్యాండేజ్ వేసుకుని అలాగే షూటింగ్ పాల్గొన్నాను. దాంతో సమస్య పెద్దదైంది. దానివల్ల కొన్ని రోజులు షూటింగ్ ఆపాల్సి వచ్చింది. అది మినహా ఈ షూటింగ్ మొత్తం నాకో తియ్యని అనుభూతిలా మిగిలిపోయింది. ♦ నా నిజజీవితంలో కృష్ణ లేడు. ప్రస్తుతం నేను కెమేరాని మాత్రమే ప్రేమిస్తున్నాను. నాకు అనుష్క అంటే ఇష్టం. ఆమె యాక్ట్ చేసిన అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, సైజ్ జీరో చిత్రాలు చూశాను. ఆమెకు నేను వీరాభిమానిని. హిందీలోవచ్చిన ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘క్వీన్’ వంటివి చేయాలని ఉంది. నటనను ఫుల్ టైమ్ కెరీర్‌గా ఫిక్స్ అయ్యాను కాబట్టి, మంచి పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళతాను. -
అంచనాలు పెంచేస్తోన్న నాని
2012లో రిలీజ్ అయిన ఈగ సినిమా తరువాత సక్సెస్ వేటలో వెనుక పడిన నాని ఇప్పుడు మళ్లీ ఫాంలోకి వచ్చాడు. గత ఏడాది రిలీజ్ అయిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన నాని... తరువాత భలే భలే మొగాడివోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి మంచి కలెక్షన్ స్టామినా ఉన్న యంగ్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు అదే జోరులో 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన కృష్ణగాడి వీర ప్రేమగాథ, ఆడియో, టీజర్స్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గత సినిమాల సక్సెస్‌తో నాని మీద ఏర్పడ్డ అంచనాలకు తగ్గట్టుగా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. ముఖ్యంగా అందాల రాక్షసి సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కటం, కూడా సినిమా మీద అంచనాలు పెరగటానికి మరో కారణం. నాని బాలకృష్ణ అభిమానిగా నటిస్తున్న ఈ సినిమాతో మెహరీన్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. మహేష్ బాబు, బాలకృష్ణ లాంటి టాప్ స్టార్స్‌తో సినిమాలు నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ తొలిసారిగా ఓ చిన్న సినిమాను తెరకెక్కిస్తుండటం కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతున్న కృష్ణగాడి వీర ప్రేమగాథ. నాని విజయగాథను కొనసాగుతుందన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్. -
నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది !
‘‘ ‘భలే భలే మగాడివోయ్’ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రం తర్వాత నాని నటించిన చిత్రమిది. నాని తన నటనతో సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు. ఏడాదిన్నరగా ఈ చిత్రం కోసం పని చేశాం. టెక్నీషియన్స్ కొత్తవారైనా ప్రతి ఒక్కరూ ఎంతో సపోర్ట్ చే శారు. విశాల్ చంద్రశేఖర్ మంచి పాట లిచ్చాడు. యువరాజ్ ప్రతి ఫ్రేమ్‌ను చాలా డిఫరెంట్‌గా చూపించాడు’’ అని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు. నాని, మెహరీన్ జంటగా 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడింది. ‘‘ఈ చిత్రం ప్రేక్షకులకు విజువల్, ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్ అవుతుంది. కొత్త సాంకేతిక నిపుణులైనా ఎంతో హార్డ్ వర్క్ చేశారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. విశాల్ చంద్రశేఖర్, యువరాజ్, కృష్ణకాంత్ తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు. -
ఇలాంటి నిర్మాతలు మనకు అవసరం : మహేశ్‌బాబు
‘‘ఈ చిత్రంలో నటించిన చిన్నారులు బాగున్నారు. బాగా నచ్చారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నా సొంత సంస్థ లాంటిది. ఈ చిత్ర నిర్మాతలు డెడికేషన్ ఉన్నవారు. ఇలాంటి నిర్మాతలు మనకు అవసరం’’ అని హీరో మహేశ్ బాబు అన్నారు. నాని, మెహరీన్ జంటగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. విశాల్ చంద్రశేఖర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను మహేశ్‌బాబు విడుదల చేశారు. మహేశ్ మాట్లాడుతూ - ‘‘నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’ చూశాను. అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చేశాడు’’ అని అభినందించారు. ‘‘ఏడాది క్రితం మేము తెలిసీ, తెలియక చేసిన తప్పుల వల్ల మా సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంది. మాతో వర్క్ చేసిన హీరోలు, నటీనటులు, టెక్నీషియన్స్ మేం చిరునవ్వుతో ఉండాలని కోరుకున్నారు. నాని ఈ సినిమా విషయంలో మాకు మంచి సపోర్ట్ అందించాడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నాం’’ అని నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర చెప్పారు. ‘‘హను రాఘవపూడి సినిమా పిచ్చోడు. ఈ చిత్రం జర్నీలో నాకో బ్రదర్‌లా మారాడు. నిర్మాతలు అసిస్టెంట్ డెరైక్టర్స్లా పనిచేశారు’’ అని హీరో నాని పేర్కొన్నారు. దర్శకుడు సుకుమార్, హీరోయిన్ మెహరీన్, హీరోలు ‘అల్లరి’ నరేశ్, అవసరాల శ్రీనివాస్, ఛాయాగ్రాహకులు రత్నవేలు, యువరాజ్, నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
'కృష్ణగాడి వీరప్రేమ గాథ' పాటలు విడుదల!