'కృష్ణాష్టమి' మూవీ రివ్యూ
టైటిల్ : కృష్ణాష్టమి
జానర్ : రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
తారాగణం : సునీల్, డింపుల్ చొపడే, నిక్కి గల్రాని, ముఖేష్ రుషి, అశుతోష్ రాణా
సంగీతం : దినేష్ కనకరత్నం
దర్శకత్వం : వాసువర్మ
నిర్మాత : దిల్ రాజు
రెండేళ్ల విరామం తరువాత వెండితెర మీద మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కృష్ణాష్టమి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సునీల్. సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాత దిల్రాజు ఈ సినిమాను నిర్మించగా, జోష్ ఫేం వాసువర్మ తొలి సినిమా తరువాత ఏడేళ్లకు ఈ సినిమాతో మరోసారి సక్సెస్ కోసం ప్రయత్నించాడు. కమెడియన్ నుంచి హీరోగా మారిన తరువాత పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సునీల్ కెరీర్కు ఈ చిత్రం సక్సెస్ కీలకంగా మారింది. మరి కృష్ణాష్టమి సునీల్ కెరీర్కి బూస్ట్ ఇచ్చిందా..? ఈ సినిమాతో అయినా వాసువర్మ దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడా..?
కథ :
చిన్నప్పుడే అమ్మానాన్నను పోగొట్టుకున్న కృష్ణవర ప్రసాద్ ( సునీల్ )ను పెదనాన్న రామచంద్ర ప్రసాద్ ఫారిన్లో చదివిస్తుంటాడు. అక్కడే పెరిగి పెద్దవాడైన కృష్ణవర ప్రసాద్ వీడియో గేమ్ డిజైనర్గా ఉద్యోగం చేస్తుంటాడు. 18 ఏళ్లుగా తన వాళ్లకు దూరంగా ఉన్న కృష్ణ ఎలాగైన ఇండియా రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ పెదనాన్న మాత్రం కృష్ణ ఇండియాకు రాకుండా అడ్డు పడుతుంటాడు. అంతేకాదు అక్కడే సెటిల్ అయిన ఓ ఎన్నారై అమ్మాయితో కృష్ణకు పెళ్లి కూడా కుదురుస్తాడు. దీంతో ఎలాగైనా ఇండియా రావాలనుకున్న కృష్ణ పెదనాన్నకు తెలియకుండా ఫ్రెండ్ గిరి (సప్తగిరి)తో కలిసి ఇండియా ఫ్లైట్ ఎక్కేస్తాడు.
కనెక్టింగ్ ఫ్లైట్ కోసం యూరోప్లో దిగిన కృష్ణ, అక్కడ పల్లవి(నిక్కి గల్రానీ)ని తొలి చూపులోనే ప్రేమించి, తిరిగి ఫ్లైట్ ఎక్కేలోపు తనని కూడా ప్రేమలో పడేస్తాడు. ఇక కృష్ణ వరప్రసాద్ ఇండియాలో దిగాక అసలు కథ మొదలవుతుంది. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో కృష్ణకు పరిచయం అయిన డాక్టర్ అజయ్ కుమార్(అజయ్) ఎయిర్ పోర్ట్లో ఓ హత్య చూసి భయపడిపోతాడు. దాంతో అతనిని ఇంటికి చేర్చే బాధ్యత కృష్ణ తీసుకుంటాడు. కృష్ణ, అజయ్లు ఇంటికి వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్లో హత్య చేసిన వాళ్లే వీరి మీద మరోసారి దాడి చేస్తారు. ఈ దాడిలో అజయ్ గాయపడతాడు. ఈ విషయాన్ని అజయ్ కుటుంబానికి తెలియజేయడానికి వెళ్లిన కృష్ణ, అక్కడి పరిస్థితుల కారణంగా నిజం చెప్పలేక తానే అజయ్గా ఉండిపోవాల్సి వస్తుంది.
ఇంతలో ఆ ఇంటి పెద్ద తన కూతురి(డింపుల్ చోపడే)ని అజయ్కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడని తెలుసుకున్న కృష్ణ, అజయ్గా తాను చెపుతున్న అబద్దానికి ముగింపు పలకాలనుకుంటాడు. ఉత్తరం రాసిపెట్టి ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో కొంతమంది మళ్లీ కృష్ణను చంపడానికి ప్రయత్నిస్తారు. అసలు కృష్ణను చంపాలనుకుంటుంది ఎవరు..? అజయ్ కుటుంబానికి కృష్ణకు ఉన్న సంబందం ఏంటి..? కృష్ణను అతడి పెదనాన్న ఇండియా రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నాడు..? ఈ సమస్య లన్నింటికి కృష్ణ ఎలా ముగింపు పలికాడు అన్నదే మిగతా కథ.
నటీనటులు :
కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా మారిన సునీల్ ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్లు, బిల్డప్ షాట్లతో మాస్ హీరో ఇమేజ్ కోసం బాగానే కష్టపడ్డాడు. చాలా వరకు బాగానే అనిపించినా సునీల్ ఇమేజ్ కారణంగా కొన్ని చోట్ల అంతగా వర్క్ అవుట్ కాలేదు. తన మార్క్ కామెడీ, డ్యాన్స్లతో మాత్రం మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక పేరుకు ఇద్దరు హీరోయిన్లు ఉన్న ఎవరికీ నటన పరంగా పెద్దగా అవకాశం లేదు.
అయితే ఉన్నంతలో గ్లామర్ షోతో మాత్రం బాగానే ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో పల్లవిజం కాన్సెప్ట్తో నిక్కి గల్రానీ నవ్వించే ప్రయత్నం చేసినా అది బాద్షా సినిమాలో కాజల్ పాత్రకు స్పూఫ్లా అనిపించింది. ఎప్పుడు నెగెటివ్ పాత్రలో కనిపించే ముఖేష్ రుషి, పాజిటివ్ పాత్రలోనూ మెప్పించాడు. అషుతోష్ రాణా విలన్గా ఆకట్టుకున్నాడు. సప్తగిరి, పోసాని కృష్ణమురళిల కామెడీ బాగానే వర్క్ అవుట్ అయింది. సెల్పీ పిచ్చి ఉన్న క్యారెక్టర్లో కనిపించిన బ్రహ్మనందం మరోసారి నిరాశపరిచాడు.
సాంకేతిక నిపుణులు :
జోష్ సినిమాతో ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయినా దర్శకుడు వాసు వర్మ మీద ఎంతో నమ్మకంతో దిల్ రాజు మరో అవకాశం ఇచ్చాడు. అయితే రెండో అవకాశాన్ని కూడా వాసు వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నట్టుగా కనిపించలేదు. హీరో విలన్ ఇంట్లో ఉండి వాళ్లను మార్చటం అనే రొటీన్ కాన్సెప్ట్నే మరోసారి ఎంచుకున్న వాసువర్మ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త సోలోగా నడించినా సెకండాఫ్లో మాత్రం వేగంగా కథ నడిపించాడు.
ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరో(అల్లు అర్జున్) కోసం రాసుకున్న కథను కామెడీ ఇమేజ్ ఉన్న హీరోతో తెరకెక్కించడం అంతగా వర్క్ అవుట్ అయినట్టుగా లేదు. ఇక సినిమాటోగ్రాఫీ చాలా బాగుంది. యూరప్ అందాలతో పాటు ఇండియాలోని లోకేషన్స్ను కూడా చాలా బాగా చూపించారు. దినేష్ కనకరత్నం సంగీతం పరవాలేదనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సాంగ్స్, ఫైట్స్, ఫారిన్ లొకేషన్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.
ప్లస్ పాయింట్స్ :
కామెడీ
సినిమాటోగ్రఫి
సినిమా నిడివి
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
ఫస్ట్ హాఫ్
పాటలు
ఓవరాల్గా కృష్ణాష్టమి, రొటీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్
- సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్