తమిళసినిమా : నటి కుష్బూకు మేటూర్ కోర్టు ఈ నెల 12వ తేదీన తప్పక హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్లితే 2005లో తమిళ మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కుష్బూపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సంఘటన తీవ్ర దుమారాన్నే రేపింది. అంతే కాదు మురుగన్ అనే న్యాయవాది మెటూర్ మేజిస్ట్రేట్ నేర విభాగ కోర్టులో కుష్బూపై పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో కేసు విచారణకు కుష్బూ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. తరువాత కుష్బూ విచారణకు హాజరుకావడంతో అరెస్ట్ వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది.
కుష్బు న్యాయస్థానంలో హాజరవుతున్న సమయంలో కొందరు ఆమె కారుపై టామాటలు, కోడిగుడ్లు విసిరారు. దీనిపై మేటూర్ తాహసీల్దారు పయాస్ అహ్మద్‌ఖాన్, డీఎంకేకు చెందిన అరివళగన్ తదితర 41 మందిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో కుష్బూ, అప్పటి పోలీస్‌ఇన్‌స్పెక్టర్ దినకరన్‌లను విచారించాలని కోరుతూ ప్రభుత్వ న్యాయవాది జగన్నాథన్ మేటూర్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి రాజా సమక్షంలో విచారణలో ఉంది. నిందితుల తరఫున న్యాయవాది మురుగన్ వాదిస్తున్నారు. ఈ కేసు తాజాగా సోమవారం తుది విచారణకు వచ్చింది. న్యాయమూర్తి రాజా ఈ కేసు వ్యవహారంలో నటి కుష్బూ, ఇన్‌స్పెక్టర్ దినకరన్‌లు ఈ నెల 12వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment