సమస్యలున్నాయని పారిపోతామా...
‘డాటరాఫ్ అశ్వినీదత్’ అనే ట్యాగ్ నా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీకి మంచి బాట అయ్యింది. కానీ, నాదైన ప్రత్యేకతను చాటుకోకపోతే నిలదొక్కుకోవడం కష్టం. అందుకే, నా పని నేను శ్రద్ధగా చేసుకుంటాను. నిర్మాణ రంగంలో ఆడవాళ్లు తక్కువ ఉన్నారన్నది వాస్తవమే. కానీ, గత పదేళ్లతో పోల్చితే ఇప్పుడు మంచి మార్పు వస్తోంది. తెర వెనుక ఉన్న శాఖల్లో చాలామంది ఆడవాళ్లు ఉన్నారు. నేను తీసిన ‘ఎవడే సుబ్రమణ్యం’కి పని చేసిన టెక్నీషియన్స్‌లో నలభై శాతం మంది ఆడవాళ్లే ఉన్నారు. ఆడవాళ్లు కారు డ్రైవ్ చేసినా, స్కూటర్ నడిపినా ‘ఆ... ఏం చేస్తుందిలే’ అనే రోజులు పోయాయి. ఇప్పుడు మగవాళ్లు కూడా ఆడవాళ్లను ఎంకరేజ్ చేస్తున్నారు. అఫ్‌కోర్స్... మేల్ డామినేషన్ ఉంది. అందుకే, ఆడవాళ్లు కొంచెం ఎగ్రెసివ్‌గా ఉండాలి. నేనంతే! నా పని మీద నాకు పట్టు ఉంది. వృత్తి మీద గౌరవం ఉంది.
అందులో సక్సెస్ అవ్వాలంటే స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే... నేను కంటిన్యూస్‌గా సినిమాలు నిర్మించడం లేదు కాబట్టి, ‘లేడీ ప్రొడ్యూసర్ కదా... ఇబ్బందిగా ఉందేమో’ అనుకునే అవకాశం ఉంది. నాకెలాంటి ఇబ్బందీ లేదు. మంచి సినిమాలు మాత్రమే తీయాలన్నది నా లక్ష్యం. అందుకే ఈ గ్యాప్. ఇక... మహిళల సమస్యల గురించి చెప్పాలంటే - సినిమా ఇండస్ట్రీ అనే కాదు... కార్పొరేట్ కార్యాలయాల్లో, పాఠశాలల్లో, హాస్పటల్స్‌లో అన్ని చోట్లా ఇబ్బందులుంటాయి. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి, ఇక్కడ ఎక్కువ ఉంటాయనుకుంటారు. కానీ, సమస్యలు ఉన్నాయి కదా అని పారిపోతే ఏమీ సాధించలేం! - స్వప్నాదత్, సినీ నిర్మాత (‘ఓం శాంతి’, ‘బాణం’ చిత్రాల ఫేమ్)