గ్లామర్ ఫీల్డ్ అంటే చిన్నప్పట్నుంచీ క్రేజ్ - ఇషా
సడన్‌గా చూస్తే... ‘మావిచిగురు’ ఫేం రంజితలా అనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు ఇషా. అసలు సిసలైన తెలుగమ్మాయి. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో కె. దామోదరప్రసాద్ నిర్మించిన ‘అంతకు ముందు-ఆ తరువాత’ చిత్రం ద్వారా కథనాయికగా పరిచయం అవుతున్నారీ ముద్దుగుమ్మ. ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు ఈ హైదరాబాదీ భామ.
ఫేస్‌బుక్‌లో నన్ను చూశారు
పుట్టిందీ పెరిగిందీ అంతా హైదరాబాద్‌లోనే. ఎంబీఏ పూర్తి చేశాను. గ్లామర్ ఫీల్డ్ అంటే చిన్నప్పట్నుంచీ క్రేజే. అందుకే చదువు పూర్తవ్వగానే మోడలింగ్‌లోకి వెళ్లా. పలు ప్రముఖ సంస్థలకు సంబంధించిన యాడ్స్‌లో కూడా నటించాను. సినిమాల్లో అవకాశం వస్తే బావుణ్ణు అనుకుంటున్న టైమ్‌లో ఇంద్రగంటి మోహన్‌కృష్ణగారు నా ఫొటోని ఫేస్‌బుక్‌లో చూశారట. వెంటనే ఆడిషన్స్‌కి పిలిపించారు. రెండు వారాలు టెస్ట్ షూట్ చేశారు కూడా. రెండు నెలలు వర్క్‌షాప్ కూడా నిర్వహించారు. తర్వాతే నన్ను ఈ సినిమాకు హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు.
అదే నా ఆకాంక్ష
మోహన్‌కృష్ణ ఏం చెబితే అది చేశాను. సెట్‌లో సుమంత్ అశ్విన్ కూడా ఎంతో కోపరేట్ చేశాడు. మధుబాల, రవిబాబు, రోహిణి, రావురమేష్ వంటి సీనియర్ ఆర్టిస్టులతో నటించడం వల్ల వారి నుంచి చాలా నేర్చుకున్నాను. తొలి సినిమాలో నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించింది. అందరి సహకారంతో ఎమోషనల్ సీన్స్‌లో రక్తి కట్టించాను. తెలుగమ్మాయిగా మరిన్ని మంచి పాత్రలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనేదే నా ఆకాంక్ష.