నానీని చూస్తే... అసూయగా ఉంది! - నాగచైతన్య
‘నాని ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు చేస్తుంటాడు. ఇలాంటి గొప్ప సినిమాలో నటించినందుకు నానీని చూస్తే అసూయగా ఉంది. నాకు ఇలాంటి పాత్ర ఎందుకు రాలేదా? అనిపించింది. ఇలాంటి సినిమా నిర్మించా లంటే, నిర్మాతలకు దమ్ము కావాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నాని, మాళవికా నాయర్, విజయ్ దేవరకొండ, రీతూ వర్మ ముఖ్య తారలుగా వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ కుమార్తె ప్రియాంకా దత్ స్వప్న సినిమా పతాకంపై నిర్మించిన చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం విజయోత్సవాన్ని గురువారం హైదరాబాద్‌లో జరిపారు.
ఈ వేడుకలో నాగచైతన్య ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. నాని మాట్లాడుతూ ‘‘ఈ స్థాయిలో ప్రశంసలు లభిస్తాయని ఊహించలేదు’’ అన్నారు. స్వప్నా దత్ మాట్లాడుతూ - ‘‘మంచి సినిమా తీస్తే అందరూ ప్రోత్సహిస్తారని మరోసారి నిరూపితమైంది. కమర్షియల్ పంథాలో తీసినా విభిన్నంగా ప్రయత్నించాం’’ అన్నారు. మంచి చిత్రంలో నటించినందుకు విజయ్ దేవరకొండ ఆనందం వ్యక్తం చేశారు.