చితకబాదుడే | Special story on sports based movies | Sakshi
Sakshi News home page

చితకబాదుడే

Published Tue, Jan 29 2019 12:11 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

Special story on sports based movies - Sakshi

ఒక ఏటు ఏస్తే మనిషి పోయి జీపు మీద పడితే.. జీపు పోయి కారు మీద పడితే..కారు పోయి బస్సు మీద పడితే..బస్సు పోయి విలన్‌ దగ్గర ఆగుతుంది.అదే టైమ్‌లో స్టంట్‌ మాస్టర్‌ కంప్రెషర్‌ పెట్టి విలన్‌ ముఖం మీద జివ్వున గాలి వదులుతాడు.సినిమాటోగ్రాఫర్‌ స్లో మోషన్‌లో విలన్‌ ముఖం అంతా సాగిపోయినట్లు చూపిస్తాడు.అవును.. అక్కడెక్కడో పంచ్‌ కొడితే బస్సు వెనకాల దాక్కున్న విలన్‌ షేక్‌ అవుతాడు.చితకబాదుడు మన హీరోలకు కొత్త కాదు.కానీ ఈసారి హీరోలు, హీరోయిన్లు గేమ్స్‌ ఆడుతున్నారు. దాంట్లో కూడా చితకబాదుడే.

యాక్షన్‌ సినిమాల్లో డిష్యుం డిష్యుం అంటూ ఫైట్స్‌ చేస్తారు మన హీరోలు. రొమాంటిక్‌ మూవీస్‌లో ప్రేమిస్తారు. కుటుంబకథా చిత్రాల్లో ఎమోషన్స్‌ను పండిస్తారు. స్టోరీ లైన్‌కి తగ్గట్టుగా అల్లుకుపోతారు. ఇప్పుడు ఆట ఆడడానికి రెడీ అయ్యారు. ఒకరు బ్యాటు పడితే...ఇంకొకరు బ్యాడ్మింటన్‌ రాకెట్‌ పట్టారు. ఒకరు కుస్తీకి సై అన్నారు. మరొకరు బాక్సింగ్‌లో తేల్చుకుందాం అంటున్నారు. ఇలా క్రీడాకారులుగా నటించబోయే ‘స్టార్స్‌’  గురించి తెలుసుకుందాం.

నేచురల్‌ బ్యాటింగ్‌
సినిమాల్లాంటి మ్యాచ్‌లలో టాలీవుడ్‌ గ్రౌండ్‌పై నాని మంచి స్కోర్లే కొట్టారు. అంపైర్స్‌లాంటి ఆడియన్స్‌ నానీని నేచురల్‌ బ్యాట్స్‌మెన్‌లా గుర్తించారు. మొన్నా మధ్య ‘కృష్ణార్జున యుద్ధం’ మ్యాచ్‌లో అవుటయ్యా (సినిమా రిజల్ట్‌) నని నానీనే స్వయంగా ఒప్పుకుని తనలోని నిజాయతీతో అంపైర్స్‌ మనసును మరింత గెల్చుకున్నారు. ఇలా కెరీర్లో ఇప్పటివరకు 22 మ్యాచ్‌లను కంప్లీట్‌ చేశారు నాని. ఇప్పుడు కొత్త మ్యాచ్‌ ‘జెర్సీ’ కోసం అర్జునుడిలా గ్రౌండ్లోకి దిగారు. ఆ మ్యాచ్‌లో 36 ఏళ్ల వయసు ఉన్న అర్జునుడన్నమాట నాని. ‘మళ్ళీరావా’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి అర్జునుడికి డైరెక్షన్‌ ఇస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన అర్జున్‌ ఆహార్యం బాగానే ఉందని ఆడియన్స్‌ అన్నారు. ప్రస్తుతం నాని ఆడుతున్న ఈ మ్యాచ్‌ ఏప్రిల్‌లో వెండితెరపైకి వస్తుంది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ‘భీమిలి.. కబడ్డీ జట్టు’ సినిమాలో కబడ్డీ ప్లేయర్‌గా కోర్టులో కూత పెట్టిన నాని ఇన్నేళ్ల తర్వాత స్టోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ చేస్తున్నారు. క్రికెటర్‌ అర్జున్‌గా ‘జెర్సీ’లో నాని ఆడే ఆటను వేసవిలో చూద్దాం.

కోచింగ్‌ ఇస్తున్నారు
రావడంతోనే ‘జోష్‌’ గా వచ్చి మాస్‌ బ్యాట్స్‌మెన్‌ పేరు తెచ్చుకుందామని ట్రై చేశారు నాగచైతన్య.  ఆ వెంటనే అక్కినేని ట్యాగ్‌కి తగ్గట్టుగా ‘ఏ మాయ చేశావె’ అంటూ లవ్‌స్టోరీ చేశారు. అంపైర్స్‌ శభాష్‌ అన్నారు. కొన్ని మంచి మ్యాచ్‌లలో క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌లా నిరూపించుకున్న నాగచైతన్య మాస్‌ బ్యాట్స్‌మెన్‌ పేరు కోసం వీలున్నప్పుడల్లా ట్రై చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ‘మజలీ’ అనే ఎమోషనల్‌ మ్యాచ్‌ కోసం రెడీ అయ్యారు. ఈ మ్యాచ్‌లో కేవలం బ్యాట్స్‌మెన్‌లా మాత్రమే కాదు. బ్యాట్స్‌మెన్‌కు ట్రైనింగ్‌ ఇచ్చే కోచ్‌గా కూడా కనిపిస్తారు నాగచైతన్య. ఈ మ్యాచ్‌కి శివ నిర్వాణ డైరెక్షన్‌ ఇస్తున్నారు. ఏప్రిల్‌లో వెండితెరపై ఈ మ్యాచ్‌ ప్లే అవుతుంది. 

బస్తీ మే సవాల్‌
మల్లయోధునిగా రానా బరిలోకి దిగితే ప్రత్యర్థులను ఇట్టే మట్టికరిపిస్తారు. అవును.. వెండితెరపై రానాను మల్లయోధునిగా చూసే అవకాశం ఉంది. ప్రముఖ మల్లయోధుడు కోడిరామ్మూర్తి బయోపిక్‌లో రానా నటించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘బస్తీ మే సవాల్‌’ అంటూ రానా ఆడే కుస్తీని ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేయవచ్చు.

పంచ్‌ ఇస్తే...! 
బాక్సింగ్‌ బరిలో దిగడానికి శిక్షణ కోసం అమెరికా వెళ్లడానికి వరుణ్‌ తేజ్‌ సిద్ధమవుతున్నారని తెలిసింది. ‘ఫిదా, ఎఫ్‌ 2’ చిత్రాల కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌కి బాగానే పంచ్‌లు ఇచ్చారు వరుణ్‌. న్యాయ నిర్ణేతలు లాంటి ప్రేక్షకులు వరుణ్‌కు మంచి స్కోరే వేశారు. వరుణ్‌ తేజ్‌కు కిరణ్‌ కొర్రపాటి అనే కొత్త వ్యక్తి డైరెక్షన్స్‌ ఇవ్వనున్నారు. సమ్మర్‌లో వరుణ్‌ బాక్సింగ్‌ రింగ్‌లోకి దూకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రావడంతోనే ‘ఆర్‌ఎక్స్‌ 100’తో బాక్సాఫీస్‌కి స్ట్రాంగ్‌ పంచ్‌ ఇచ్చారు కార్తికేయ. ఇప్పుడు ఆయన ‘హిప్పీ’ అనే సినిమాతో బాక్సర్‌గా రింగ్‌లోకి దిగారని సమాచారం.. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలలో కార్తికేయ చేతికి గ్లౌజ్‌లు వేసుకుని బాక్సర్‌గా కనిపించారు. దీంతో ‘హిప్పీ’ బాక్సర్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ అనే టాక్‌ మొదలైంది. అలాగే తమిళ హీరో విజయ్‌ నెక్ట్స్‌ మూవీ ఫుట్‌బాల్‌ నేపథ్యంలో తెరకెక్కనుందని కోలీవుడ్‌ టాక్‌. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తారు. దీపావళికి రిలీజ్‌ అవుతుందీ చిత్రం.

మళ్లీ కోర్టులో!
రాకెట్‌ పట్టి బ్యాడ్మింటన్‌ కోర్టులో ఎడాపెడా కాక్‌ను బాదటం సుధీర్‌ బాబు చిన్నప్పుడు నేర్చుకున్న విద్యే. కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే ఆయన స్కూలింVŠ  టైమ్‌లోనే జూనియర్‌ బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌ వరకూ వెళ్లొచ్చారు. ఆ తర్వాత ప్రముఖ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పుల్లెల గోపీచంద్‌తో కలిసి డబుల్స్‌ కూడా ఆడారు. ఇప్పుడు సుధీర్‌ బాబు మళ్లీ రాకెట్‌ పట్టారు. బ్యాడ్మింటన్‌ కెరీర్‌కు మళ్లీ శ్రీకారం చుట్టడానికి కాదు. వెండితెరపై పుల్లెల గోపీచంద్‌లా ఆడటానికి రెడీ అవుతున్నారు. సెట్‌లో త్వరలో ఆయన మ్యాచ్‌లు స్టార్ట్‌ కానున్నాయి. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో సుధీర్‌బాబు ఆడతారు.
– ముసిమి

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ స్కోర్‌ బోర్డ్‌పై మహేశ్‌బాబు స్కోర్ల డిజిట్స్‌ చాలా పెద్దవి. ‘మహర్షి’ మూవీ కోసం మహేశ్‌బాబు బ్యాట్‌ పట్టి గ్రౌండ్‌లోకి దిగారు. అయితే ఇందులో పార్ట్‌టైమ్‌ ప్లేయర్‌గానే కనిపిస్తారు మహేశ్‌. ‘మహర్షి’లో ఆయన స్టూడెంట్‌గా ఉన్నప్పుడు హైదరాబాద్‌ గ్రౌండ్‌లో మహేశ్‌బాబు క్రికెట్‌ ఆడారని సమాచారం. ఏప్రిల్‌ 25న మహేశ్‌ ఆట వెండితెరపై ప్రత్యక్షం అవుతుంది. దాదాపు పదిహేనేళ్ల క్రితం ‘ఒక్కడు’లో మహేశ్‌ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. క్రీడానేపథ్యంలో సినిమా అంతా సాగకపోయినప్పటికీ ‘అర్జున్‌ రెడ్డి’లో విజయ్‌ దేవరకొండ ఫుట్‌బాల్‌ గోల్‌ కీపర్‌లా, ‘పడిపడి లేచె మనసు’ సినిమాలో శర్వానంద్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ కెప్టెన్‌లా కనిపించారన్న విషయం తెలిసిందే.

ఫామ్‌లోకి వచ్చేందుకు!
తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు సందీప్‌ కిషన్‌. అందుకే కొత్త ట్రాక్‌ ఎంచుకున్నారు. ఇప్పటికే ఆయన ‘నిను వీడని నీడను నేనే’ అంటూ తొలిసారి హారర్‌ నేపథ్యంలో ఉన్న సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు ఓ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సంతోష్‌ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. మరి.. ఈ సినిమా ఏ స్పోర్ట్‌ ఆధారంగా తెరకెక్కనుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైనా’. సైనాగా శ్రద్ధాకపూర్‌ నటిస్తున్నారు. కోర్టులో రాకెట్‌ని ఝళిపించడం కోసం శ్రద్ధా శిక్షణ తీసుకున్నారు. అమోల్‌ గుప్తా ఈ చిత్రానికి దర్శకుడు. 

నార్త్‌ గ్రౌండ్‌లో...!
మాలీవుడ్‌ బ్యాట్స్‌మెన్‌ దుల్కర్‌ సల్మాన్‌ నార్త్‌ గ్రౌండ్‌లోకి అడుగు పెట్టారు. ఆల్రెడీ ఆయన నార్త్‌లో ఆడిన తొలి మ్యాచ్‌ ‘కర్వాన్‌’కు అక్కడి అంపైర్లు మంచి మార్కులే వేశారు. ఇప్పుడు అక్కడ ఆడుతున్న రెండో మ్యాచ్‌ ‘జోయా ఫ్యాక్టర్‌’తో మంచి స్కోర్‌ కొట్టాలని ఆయన డిసైడ్‌ అయ్యారు. అందుకోసం బాగానే నెట్‌ ప్రాక్టీస్‌ చేశారాయన. మరి క్రికెటర్‌లా కనిపించి, బాలీవుడ్‌ స్కోర్‌ బోర్డ్‌పై  నటుడిగా దుల్కర్‌ ఎంత స్కోర్‌ చేస్తారో చూడాలి. అలాగే తమిళ హీరో జీవా.. అదేనండీ ‘రంగం’ ఫేమ్‌ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు ఆయన కూడా నార్త్‌ గ్రౌండ్‌పై అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. ప్రముఖ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా రణ్‌వీర్‌సింగ్‌ కెప్టెన్‌గా చేస్తున్న చిత్రం ‘1983’. ఈ సినిమాలో జీవా బంతి పట్టుకుని కీలక బౌలర్‌గా గ్రౌండ్‌లోకి దిగుతారని తెలిసింది.

రీప్లే!
గడచిన పాతికేళ్లలో తెలుగు తెరపై వచ్చిన క్రీడా నేపథ్య సినిమాలను రీ ప్లే చేస్తే... టైక్వాండో నేపథ్యంలో శ్రీహరి ‘భద్రాచలం’, బాక్సింగ్‌ నేపథ్యంలో వెంకటే‹శ్‌ కోచ్‌గా ‘గురు’, బాక్సర్‌గా పవన్‌కల్యాణ్‌ ‘తమ్ముడు’, రవితేజ ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలు బాగానే సక్సెస్‌ సాధించాయి. ‘సై’ అంటూ వెండితెరపై నితిన్‌ ఆడిన రగ్బీ గేమ్‌ ఆడియన్స్‌కు బాగానే నచ్చింది. ‘గోల్కొండ హైస్కూల్‌’ సినిమాలో క్రికెటర్‌ కమ్‌ క్రికెట్‌ కోచ్‌గా సుమంత్‌ ఫామ్‌ను పర్లేదనే అన్నారు ఆడియన్స్‌. ఇలా స్పోర్ట్స్‌ నేపథ్యం ఉన్న సినిమాలన్నింటికీ ఓకే చెప్పారు ఆడియన్స్‌. సో.. రాబోయే ఆటలను కూడా ఆదరిస్తారని ఊహించవచ్చు. అయినా ఆటలో కిక్కు ఉంటే డౌటేముంది? బాక్సాఫీస్‌ స్కోర్‌ పీక్స్‌లో ఉంటుంది.

తెలుగు గ్రౌండ్‌లోకి అడుగు పెట్టిన కన్నడ తార రష్మికా మండన్నాకు ప్రస్తుతం తిరుగులేదని తెలుగు అంపైర్స్‌ నిర్ణయించేశారు. మరి.. రష్మిక ఆడిన మ్యాచ్‌ తాలూకు బాక్సాఫీస్‌ రికార్డులు అలాంటివి. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండతో కలిసి రష్మిక ‘డియర్‌ కామ్రేడ్‌’ అనే మ్యాచ్‌ ఆడుతున్నారు. ఇందులోనే బ్యాట్‌ పట్టుకుని గ్రౌండ్‌లోకి దిగారామె. ఆల్రెడీ వీరిద్దరూ జంటగా వచ్చిన ‘గీతగీవిందం’ మ్యాచ్‌ బాక్సాఫీస్‌ వద్ద సెంచరీ కొట్టింది. దీంతో ఈ ‘డియర్‌ కామ్రేడ్‌’ కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి స్కోర్‌ కొట్టాలని కోరుకుంటున్నారు రష్మిక అండ్‌ ఫ్యాన్స్‌. ఈ సినిమాలో రష్మిక బ్యాట్‌ పట్టుకుని గ్రౌండ్‌లోకి దిగారు. భరత్‌ కమ్మ అనే కొత్త వ్యక్తి డైరెక్షన్‌ ఇస్తున్నారు. ఇలా వరస హిట్‌ మ్యాచ్‌లతో ప్రస్తుతానికి సూపర్‌ ట్రాక్‌ రికార్డ్‌తో ముందుకు వెళ్తున్నారు రష్మిక. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement