కథలు ఊహల్లో నుంచే కాదు.. వాస్తవ జీవితాల్లో నుంచి కూడా వస్తుంటాయి. ఇలా రియల్‌గా జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా కొందరు దర్శకులు రాసుకున్న కథలతో కొన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి. రియల్ టు రీల్‌గా రానున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.
► ‘డాన్ శీను (2010)’, ‘బలుపు (2013)’, ‘క్రాక్ (2021)’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో నాలుగో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కించనున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఇది కంప్లీట్ పీరియాడికల్ ఫిల్మ్ అని, ఆంధ్రప్రదేశ్‌లో 1991లో జరిగిన ఓ సంచలన ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. మరోవైపు రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘క్రాక్’ కూడా కొన్ని వాస్తవ ఘటనల ప్రేరణతో తెరకెక్కి, హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.
► హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లోని సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా కథనం ఉంటుంది. అయితే ఈ సినిమా కథలోని కొంతభాగం వాస్తవ ఘటనల ఆధారంగా ఉంటుందని ఈ చిత్ర రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ గత ఏడాది అక్టోబరులో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కథను బట్టి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా రాజమౌళి అండ్ కో ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు.
► శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన దాదాపు 25 మంది మత్స్యకారులు బతుకుతెరువు కోసం గుజరాత్ తీర ప్రాంతంలోని వీరవల్ వద్ద చేపల వేట కొనసాగిస్తూ, 2018 నవంబరులో పోరపాటున పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్ అధికారులకు బందీలుగా చిక్కారు. దాదాపు ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించిన వారి జీవితాల్లోని వాస్తవ ఘటనల సమాహారంగా ‘తండేల్’ సినిమా తెరకెక్కనుంది. ‘ప్రేమమ్ (2016)’, ‘సవ్యసాచి (2018)’ చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబి నేషన్‌లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఇది.
ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులోప్రారంభం కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా వివాహం జరిగిన కొద్ది కాలానికే, తాను తండ్రి కాబోతున్న సమయంలోనే పాకిస్తాన్‌లో ఖైదు కాబడిన శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నట్లుగా తెలిసింది. వచ్చే ఏడాది చివర్లో ‘తండేల్’ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త.
► ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్ నటించిన దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. హిందీ, తెలుగు భాషల్లో రూపోందిన ఈ ద్విభాషా చిత్రంతో శక్తీ ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంతో మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, వరుణ్ తేజ్ హిందీకి పరిచయం అవుతున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చోటు చేసుకున్న కొన్ని వైమానిక దాడుల వాస్తవ ఘటనల సమాహారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ్రపోడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించారు. తొలుత ఈ సినిమాను డిసెంబరు 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని, వచ్చే ఏడాదిప్రారంభంలో విడుదల చేసే ఆలోచన ఉందని యూనిట్ వెల్లడించింది.
► సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరోం హర: ది రివోల్ట్’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రధారి. కాస్త రివెంజ్ టచ్ ఉన్న ఈ సినిమా 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరు 22న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ తేదీకి ప్రభాస్ ‘సలార్’ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో ‘హరోం హర’ చిత్రం విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.
► శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా రూపోందిన హారర్ ఫిల్మ్ ‘పిండం’. ఖుషీ రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ఇతర ప్రధాన పాత్రలుపోషించారు. ఓ నిజజీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని, చిత్రీకరణ సమయంలో కొన్ని ఘటనలు జరగడంతో కాస్త భయంగానే ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఈ చిత్రదర్శకుడు సాయికిరణ్ దైదా చెబుతున్నారు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 15న విడుదల కానుంది. 1930, 1990.. ప్రస్తుతం.. ఇలా మూడు కాలాలతో ‘పిండం’ స్క్రీన్ ప్లే ఉంటుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఇలా వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుని, ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment