3 Times Our Tollywood Heroes, Directors Combination Repeat - Sakshi
Sakshi News home page

Hero-Director Combination: ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్‌ అవుతుందా?

Published Sat, May 14 2022 8:02 AM | Last Updated on Sat, May 14 2022 1:30 PM

3 Times Our Tollywood Heroes, Directors Combination Repeat - Sakshi

‘మీ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా ఎప్పుడు?’ సినిమా ఇండస్ట్రీలో కామన్‌గా వినిపించే ప్రశ్న ఇది. ‘అన్నీ కుదిరినప్పుడు...’ అనే సమాధానం కూడా కామన్‌. అలా అన్నీ కుదిరినప్పుడు కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుంది. ఇప్పుడు మూడోసారి రిపీట్‌ అవుతున్న హీరో–డైరెక్టర్‌ కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి.. అలా... మూడోసారి కుదిరిన కాంబినేషన్‌ విశేషాల్లోకి వెళదాం.

మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో:
మహేశ్‌బాబు మాసీ యాక్షన్‌ను ‘అతడు’ (2005)లో చూశాం. అలాగే మహేశ్‌ కామెడీ టైమింగ్‌ని ‘ఖలేజా’ (2010)లో చూశాం. ఈ రెండు చిత్రాల్లోనూ మహేశ్‌తో సెటిల్డ్‌ పర్ఫార్మెన్స్‌ చేయించారు దర్శకుడు త్రివిక్రమ్‌. దాదాపు పన్నెండేళ్ల తర్వాత హీరో మహేశ్‌.. దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా షూటింగ్‌ జూన్‌లో ప్రారంభం కానుంది. ఇందులో మహేశ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తారు. ‘మహర్షి’ తర్వాత మహేశ్, పూజా మళ్లీ జోడీ కడుతున్న సినిమా ఇదే. అలాగే ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘అల.. వైకుంఠపురములో..’ తర్వాత త్రివిక్రమ్‌తో పూజా హెగ్డే చేయనున్న మూడో చిత్రం కూడా ఇదే.

గోపిచంద్‌-శ్రీవాస్‌ కాంబినేషన్‌లో:
అలాగే గోపించంద్‌-శ్రీవాస్‌ కూడా మూడోసారి జతకట్టబోతున్నారు. గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ డైరెక్షన్‌లో తెరకెక్కే ఈ సినిమా ఆల్రెడీ సెట్స్‌లో ఉంది. ‘లక్ష్యం’ (2007) లాంటి మాస్‌ సినిమాతో ఈ ఇద్దరి కాంబినేషన్‌ తొలిసారి షురూ అయింది. ఆ తర్వాత ‘లౌక్యం’ (2015) చేశారు. ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ‘లక్ష్యం 2’ (వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతోంది. ‘లక్ష్యం 2’ అని వర్కింగ్‌ టైటిల్‌ పెట్టారు కానీ ఇది ‘లక్ష్యం’కి సీక్వెల్‌ అని మాత్రం యూనిట్‌ స్పష్టం చేయలేదు. ఇందులో డింపుల్‌ హయతి హీరోయిన్‌.

నాగ చైతన్య-విక్రమ్‌ కే కుమార్‌:
ఇక అక్కినేని ఫ్యామిలీ మూవీ అంటే ‘మనం’ (2014) అని ఈజీగా చెప్పేస్తారు ఆడియన్స్‌. ఈ చిత్రంలో ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ (అతిథి పాత్ర) నటించారు. ఈ సినిమాకు విక్రమ్‌ కె. కుమార్‌  దర్శకుడు. ‘మనం’ తర్వాత నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ చిత్రం రూపొందింది. ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్‌ హీరోయిన్లు. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. అయితే ‘థ్యాంక్యూ’ రిలీజ్‌ లోపే విక్రమ్‌ కె. కుమార్‌తో మరో ప్రాజెక్ట్‌కి సై అన్నారు నాగచైతన్య. కానీ ఇది ఓటీటీ ప్రాజెక్ట్‌. ‘దూత’ టైటిల్‌తో రానున్న ఈ సిరీస్‌లో నాగచైతన్య జర్నలిస్ట్‌.

సుధీర్‌ బాబు-ఇంద్రగంటి మోహన్‌కృష్ణ:
మరోవైపు హీరో సుధీర్‌బాబు.. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా మూడో సినిమా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే... ఇంద్రగంటి మోహనకృష్ణ తీసిన గత రెండు సినిమాల్లో హీరో సుధీర్‌బాబే. 2018లో రిలీజైన ‘సమ్మోహనం’, 2020లో ఓటీటీలో వచ్చిన ‘వి’ (ఇందులో హీరో నాని కూడా నటించారు) చిత్రాల తర్వాత ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే చిత్రం కోసం మూడోసారి కలిశారు సుధీర్‌బాబు – ఇంద్రగంటి ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్‌.

నిఖిల్‌-సుధీర్‌ వర్మ:
ఇటు నిఖిల్‌ హీరోగా దర్శకుడు సుధీర్‌ వర్మ తీసిన ఫస్ట్‌ సినిమా ‘స్వామి రారా’ (2013) మంచి హిట్‌ సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిఖిల్‌.. సుధీర్‌ వర్మ కాంబినేషన్లో 2017లో ‘కేశవ’ సినిమా వచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి మళ్లీ సినిమా చేస్తున్నారు. 

నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్‌:
ఇంకో వైపు ‘ఊహలు గుసగుసలాడే’ (2014), ‘జ్యో అచ్యుతా నంద’ (2016) తర్వాత అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ అనే సినిమా సెట్స్‌పై ఉంది. ఒక సినిమా చేస్తున్నప్పుడు హీరో.. డైరెక్టర్‌ మధ్య మంచి అవగాహన కుదిరితే.. కథ కుదిరినప్పుడు మళ్లీ కలిసి సినిమా చేయాలనుకుంటారు. ఇక్కడ చెప్పిన కాంబినేషన్స్‌ అన్నీ దాదాపు అలాంటివే. ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న ఈ కాంబినేషన్‌ మళ్లీ ‘హిట్‌’పై గురి పెట్టింది.  

ఇటీవల రిపీట్‌ అయిన ‘థర్డ్‌’ కాంబినేషన్‌ మంచి హిట్‌ని సొంతం చేసుకున్నాయి. అవేంటంటే.. ‘అఖండ’, ‘పుష్ప’,  ‘క్రాక్‌’. ‘సింహా’ (2010), ‘లెజండ్‌’ (2014) చిత్రాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ’ సూపర్‌ హిట్‌గా నిలిచింది. అలాగే ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) తర్వాత హీరో అల్లు అర్జున్‌.. దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలీజైన ‘పుష్ప’ సూపర్‌ హిట్‌. ‘డాన్‌ శీను (2010), ‘బలుపు (2013) చిత్రాల తర్వాత హీరో రవితేజ – దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘క్రాక్‌’ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇటు  ‘నేను..శైలజ’ (2016), ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ (2017) చిత్రాల తర్వాత హీరో రామ్‌ – దర్శకుడు కిశోర్‌ తిరుమల కలిసి చేసిన ‘రెడ్‌’ మూవీ కూడా ఫర్వాలేదనిపించింది. మరి.. ఇప్పుడు రిపీట్‌ అవుతున్న ఈ థర్డ్‌ కాంబినేషన్‌ కూడా హిట్‌ మ్యాజిక్‌ని రిపీట్‌ చేస్తుందనే అంచనాలున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement