హాట్‌ టికెట్‌ | Special story to tollywood summer release movies | Sakshi
Sakshi News home page

హాట్‌ టికెట్‌

Published Tue, Mar 26 2019 12:39 AM | Last Updated on Tue, Mar 26 2019 12:45 AM

Special story to tollywood summer release movies - Sakshi

వస్తోంది సినిమా కాలం. సమ్మర్‌ కాలం.
ఈ కాలంలో రిలీజులన్నీ ప్రొడ్యూసర్లకు హాట్‌ టికెట్లే.
మిగిలిన కాలాల్లో ఒకటో రెండో టికెట్లు తెగుతాయి.
కాని ఈ కాలంలో ఫ్యామిలీ మొత్తం టికెట్లు తెగుతాయి.
హాలిడే మూడ్‌కి కూల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ హాట్‌ టికెట్‌.

ఇళ్లలో ఏసీలు సర్వీస్‌ చేయించుకోవడం పూర్తయ్యింది. డిష్‌కు కట్టాల్సిన డబ్బు కూడా కట్టేశాం. టీవీలో ఐపిఎల్‌ ఉంది. చెలరేగే బ్యాట్స్‌మన్‌లు, ఉత్సాహపరిచే చీర్‌గర్లులు... ఆ వేడుకే వేరు. కాని ఇంట్లో చూసే షోలో ఉండే కిక్‌ ఏ మాత్రం. హాల్లో చూసే షోలోనే అసలు కిక్కు. ఏదో సినిమాలో చెప్పినట్టు ‘ఎన్ని ఫ్యాన్లు కలిసి ఒక ఏసీ అవుతాయని’, ఎన్ని క్రికెట్‌ మ్యాచ్‌లు ఉన్నా ఒక్క వేసవి హిట్‌ సినిమాకు సమానం కాదు. ఈ సీజన్‌లో కూడా కుటుంబాలను, కుర్రాళ్లను, ఆటపాటల్లో పడినా సినిమా సినిమా.. అని వేధించే పిల్లలను థియేటర్లకు రప్పించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సినిమాలు రానున్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయి?

ఇది వర్మ మార్చి
గతంలో ఎవరో కవి ‘ఈ శతాబ్దం నాది’ అన్నాడట. దర్శకుడు వర్మ మాత్రం ఈ మార్చి నాది అంటున్నాడు. మార్చి నెలాఖరున తెర మీద బ్లాస్ట్‌ చూడమంటున్నాడు. అసలే ఎలక్షన్లు... ఆపై ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన కథనం... దాగిన రహస్యాలు బయటకు వచ్చే సమయం. అటు ఎండలతో ఇటు ఎలక్షన్లతో హాట్‌హాట్‌గా ఉండటం వల్ల అందరూ కుతూహలంగా వర్మవైపే చూస్తున్నారు.  అలాగే గయ్యాళి నటి సూర్యకాంతం పేరును టైటిల్‌గా చేసుకుని నాగబాబు కుమార్తె నిహారిక నటించిన ‘సూర్యకాంతం’ సినిమా కూడా ఈ మార్చి నెలాఖరులోనే రంగం మీదకు రానుంది. అల్లరి అమ్మాయిగా మొండి ఘటంగా ఎదుటివాళ్ల గాలి తీసేసే చమత్కారిగా నిహారిక ట్రైలర్‌లో మార్కులు కొట్టేసింది. స్క్రీన్‌ మీద కూడా కొట్టేస్తే ఈ వేసవిలో ఒక కొబ్బరితోటను కొనుక్కునేన్ని ఆఫర్లు రావడం ఖాయం. నయనతార ‘ఐరా’ కూడా ఒక కొసరు. ఇది డబ్బింగే అయినా నయనతార పేరు చెప్తే మన దగ్గర టికెట్‌ తెగుతుంది కదా. మార్చి సమాప్తం.

ఏప్రిల్‌ థ్రిల్‌
 సమంత చైతూతో చైతూ అంది. చైతూ సమంతను శామ్‌ అన్నాడు. ఇద్దరూ కలిసి వైజాగ్‌లో మకాం వేసి అదే మంచి మజిలీగా ‘మజలీ’ సినిమా పూర్తి చేశారు. ఏప్రిల్‌లో ఆ హిట్టువార్తను ఏ చల్లటి దేశానికో విహారానికి వెళ్లి వినాలనుకుంటున్నారు. ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన సినిమా ఇది. దివ్యాన్షా కౌశిక్‌ మరో కథానాయిక.  ఏప్రిల్‌ 5న  రిలీజ్‌.

►ఉగాది పచ్చడిలో కామెడీ హారర్‌ కలుపుతానంటున్నాడు దర్శకుడు హరికిష . అతడి సారథలో ‘ప్రేమకథా చిత్రం 2’ తయారైంది. ఈ ఏప్రిల్‌లోనే భయం చమటలు పట్టించనుంది. సుమంత్‌అశ్విన్, సిద్ధీ ఇద్నానీ, నందితా శ్వేత హీరోయిన్లు. ఏప్రిల్‌ 6 ఈ చిత్రం విడుదల.

►హిట్స్‌లేక అవస్థ పడుతున్న సాయిధరమ్‌ తేజ్‌ రోజూ వేస్తున్న సూర్య నమస్కారాలకు ఈ సూర్యుడి సీజన్‌లో ఫలితం దొరుకుతుందనే అనిపిస్తోంది. ఒకప్పుడు దూరదర్శన్‌లో ‘చిత్రలహరి’ అనంటే ఆబాలగోపాల భూపాలాలన్నీ టీవీముందు చేరిపోయేవి. అదే టైటిల్‌తో సాయిధరమ్‌ తాజా చిత్రం రానుంది. ట్రైలర్‌ను చూసి జనం మంచి హిట్స్‌తో మెచ్చారు. ‘నేను శైలజ’ ఫేమ్‌ కిషోర్‌ తిరుమల ‘ఉన్నది ఒకటే జిందగీ’తో కొంచెం తొట్రుపడ్డా ‘చిత్రలహరి’ని పుచ్చకాయలో కత్తి దింపిన గురితో పూర్తి చేశాడని టాక్‌.  ఏప్రిల్‌ 12 రిలీజ్‌. కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లు. 

►నాని ఏ ఐపిఎల్‌ జట్టుకు సెలెక్ట్‌ కాకపోయినా ‘జెర్సీ’ అనే సినిమాకు సెలెక్ట్‌ అయ్యాడు. నిర్మాతలు మంచి పారితోషికం ఇచ్చి ఈ సినిమాకు అతడి డేట్స్‌ను పాడుకున్నారు. ఇక కలెక్షన్ల రన్స్‌ కొట్టడం అతడి వంతు. ఇంతకు ముందు ‘భీమిలీ కబడ్డీ జట్టు’ను చేసిన నాని ఈ సినిమాలో 36 ఏళ్ల వయసు పాత్రలో బ్యాట్‌ పట్టుకుంటాడు. ‘మళ్లీ రావా’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు.  కన్నడ కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్‌ ఈ సినిమాతో  తెలుగుకు పరిచయం కానున్నారు. ఏప్రిల్‌ 19న విడుదల.

►ఎన్టీఆర్‌ బయోపిక్‌ నుంచి తప్పుకున్న దర్శకుడు తేజ  బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘సీత’ సినిమా చేశాడు. కాజల్‌ ఇందులో నెగెటివ్‌ రోల్‌. ‘సీత’ టైటిల్‌తో గతంలో వచ్చిన ‘సీతారామయ్య మనవరాలు’, ‘సీతయ్య’, ‘ఓ సీత కథ’, ‘సీతమ్మ పెళ్లి’, ‘సీతామాలక్ష్మి’ జనరంజకం అయ్యాయి. ఈ సీత వీరి దోసిట్లో చాలా రూకలు పోస్తుందని ఆశిద్దాం.

మహా మే
►సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌వారు తమిళంలో హిట్‌ అయిన సినిమాని తెలుగులో నలభై నుంచి అరవై రోజుల్లో తీసేసేవారు. కాని ఇవాళ్టి రోజుల్లో క్వాలిటీ కోసం రీమేక్‌లకు కూడా ఎక్కువ రోజులు కేటాయిస్తున్నారు. తమిళ చిత్రం ‘కణిద’కు రీమేక్‌గా నిఖిల్‌ ‘అర్జున్‌ సురవరం’ దాదాపు రెండేళ్లు మేకింగ్‌ కోసం తీసుకుంది. ఒరిజనల్‌ తీసిన టీఎ సంతోష్‌ తెరకెక్కించారు. లావణ్యాత్రిపాఠి కథానాయిక.  మేడే రిలీజ్‌ డే. 

►మహేశ్‌బాబుకు ఒక వేసవి ‘పోకిరి’ ఇచ్చింది. ఈ వేసని ‘మహర్షి’ ఇస్తోంది. రెండూ మూడక్షరాల టైటిల్సే. పైగా ఇది మహేష్‌కు 25వ సినిమా. దీని కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. నిర్మాతలు అశ్వనీదత్, దిల్‌ రాజు, పీవీపీ,  దర్శకుడు వంశీ పైడిపల్లి ఎక్కడా రాజీ పడదల్చుకోకపోవడం వల్ల డిలే అయి మే 9న విడుదల కానుంది.  పూజా హెగ్డే కథానాయిక.

►ఇవి కాకుండా స్మార్ట్‌బాయ్‌ రామ్‌తో ఫస్ట్‌ టైమ్‌ పూరి జగన్నాథ్‌ చేస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. డేట్‌ ఫిక్స్‌ చేయకపోయినా సమ్మర్‌ రిలీజ్‌ అని అనౌన్స్‌ చేశారు. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో మంచు విష్ణు చేసిన ‘ఓటర్‌’ కూడా సమ్మర్‌ రిలీజ్‌ అని చెప్పారు. నందినీ రెడ్డి దర్శకత్వలో సమంతా చేస్తున్న ‘ఓ బేబి’ సినిమా కూడా వేసవి అంతానికి రావచ్చు. ఇక ఫైనల్‌గా వేసవికి ఓట్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌ విజయ్‌ దేవరకొండ   చెప్పనున్నారు.‘డియర్‌ కామ్రేడ్‌’ మే 31న రిలీజ్‌. 

►ఈ వేసవిలో ఉష్ణోగ్రత 40 దాటుతుందంటున్నారు విశ్లేషకులు. టెరిటరీలవారీగా కలెక్షన్స్‌ కూడా ఈ లెవల్‌లో దాటితే బావుండని కోరుకుంటున్నారు ఎగ్జిబిటర్స్‌. ఈ  సమ్మర్‌లో మనం రిలీజ్‌ల హడావిడితో, బాక్సాఫీస్‌ కనకవర్షంతో తడిసి ముదై్దపోవాలని కోరుకుందాం. హ్యాపీ సమ్మర్‌.

అనువాద చిత్రాలు 
ఈ సమ్మర్‌కు తమిళ పంచెకట్టులోని చల్లదనం కూడా తోడు కానుంది. సూర్య చేసిన  పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘య జీకే’ మే 31న రానుంది. సాయి పల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికలు. లారెన్స్‌ ‘కాంచన 3’ మరో సినిమా. ముందు భాగాల కంటే కూడా మరింత భయపెడతాం అని ధైర్యం ఇస్తున్నారు లారె. దేశ ప్రధాని జీవితం ఆధారంగా పీయం మోది చిత్రం తెరకెక్కింది. ఒమంగ్‌ కుమార్‌ దీని దర్శకుడు. మోదీ పాత్రలో వివేక్‌ ఒబెరాయ్‌ నటించారు. జై, కేథరీన్‌ వరలక్ష్మీ, రాయ్‌లక్ష్మీ నటించిన ‘నాగకన్య’ ఏప్రిల్‌ 5 రిలీజ్‌ కానుంది.  
– ఇన్‌పుట్స్‌: గౌతమ్‌ మల్లాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement