బాబు ప్రొడ్యూసరు | Tollywood heroes turn to producers role | Sakshi
Sakshi News home page

బాబు ప్రొడ్యూసరు

Published Tue, Dec 11 2018 12:06 AM | Last Updated on Tue, Dec 11 2018 12:08 AM

Tollywood heroes turn to producers role - Sakshi

సెట్‌లోకి హీరో వస్తే ‘బాబొచ్చాడు’ అని ప్రొడ్యూసర్‌ అలర్ట్‌ అవుతాడు.ఇప్పుడు బాబే ప్రొడ్యూసరయ్యి, మరో హీరో వస్తే ‘బాబొచ్చాడు’ అనేసిట్యుయేషన్‌ ఉంది.యంగ్‌ హీరోలు స్క్రీన్‌ మీదే కాదు, స్క్రీన్‌ వెనుక కూడా సినిమా కోసం కష్టపడుతున్నారు.హీరో కెరీర్‌తోపాటు ప్రొడ్యూసర్‌ కెరీర్‌నుకూడా బిల్డ్‌ చేసుకుంటున్నారు. సొంత సినిమాల్లో నటించి,  డబుల్‌ ధమాకా చేస్తున్నారు.

ఇండస్ట్రీ నుంచి తీసుకున్న కొందరు తిరిగి ఇండస్ట్రీకి ఇవ్వడానికి ట్రై చేస్తారు. చేసిన సినిమాలకు రెమ్యూనరేషన్‌ తీసుకుని ఊరికే ఉండిపోయే హీరోల ధోరణి ఒకటైతే వచ్చిన డబ్బుతో ప్రొడక్షన్‌ హౌస్‌ స్థాపించి అదొక వ్యాపార వనరుగా చూసే హీరోల ధోరణి మరొకటి. గతంలో ఎన్టీఆర్‌కు రామకృష్ణ సినీస్టూడియోస్, ఏఎన్నార్‌కు అన్నపూర్ణ, కృష్ణకు పద్మాలయా బేనర్‌లు ఉండేవి. చిరంజీవి, నాగార్జున, మోహన్‌బాబు వంటి హీరోలు కూడా నిర్మాతలుగా సినిమాలు తీశారు. తాజాగా బాలకృష్ణ ఈ లిస్ట్‌లో చేరారు. మరి యంగ్‌ హీరోలు ఎవరు ఈ దారి పట్టారు? ఒకరికి అవకాశం ఇవ్వడానికే కాదు, తమను తాము నిలబెట్టుకోవడానికి కూడా చెక్‌లు సైన్‌ చేస్తున్న హీరోల పరిచయం ఇది.

నిలిచి గెలిచాడు
యంగ్‌ హీరోల్లో నిర్మాతగా ఎక్స్‌పరిమెంట్‌ చేయడానికి వెనుకాడని  హీరో నాని. ఐదేళ్ల క్రితమే ఆయన ‘డి ఫర్‌ దోపిడీ’ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించారు. అయితే అది అంతగా ఆడలేదు. కానీ నిర్మాణ రంగంౖపై నానికి మక్కువ తీరలేదు. ఏకంగా ‘వాల్‌పోస్టర్‌ సినిమా’ అనే బ్యానర్‌ను స్థాపించి ‘అ!’ అనే విభిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించి తనలో ఓ మంచి నిర్మాత ఉన్నాడని చెప్పారు. ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అయిన ప్రశాంత్‌ వర్మకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇదే ఊపులో మరికొన్ని కథలు వింటూ ప్రొడ్యూస్‌ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హీరోగా ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమాతో బిజీగా ఉన్న నాని వచ్చే ఏడాది విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోగా నటిస్తారు.

విజయోస్తు 
‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం’ సినిమాల విజయాలతో ప్రస్తుతం మంచి రైజింగ్‌లో ఉన్నారు హీరో విజయ్‌ దేవరకొండ. దాంతో ఆగకుండా ఇదే స్పీడ్‌లో  నిర్మాతగా కూడా గట్టిగా కొట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ‘కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌’ అనే బ్యానర్‌ను మొదలెట్టి ప్రతిభ వున్న దర్శకులకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. తను హీరోగా నటించిన తమిళ, తెలుగు బై లింగ్వల్‌ ‘నోటా’ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహించిన విజయ్‌ సినిమాను ప్రొడ్యూస్‌ చేయడానికి తల పండక్కర్లేదన్న ఊపు మీద ఉన్నారు. ఇటీవల వచ్చిన ‘టాక్సీవాలా’ హిట్‌తో మరింత స్పీడుగా దూసుకెళ్లనున్నారు ఈ యంగ్‌ హీరో.

సొంత గుర్తింపు
కెరీర్‌ తొలినాళ్లలో ఇండస్ట్రీలో హీరో సుధీర్‌బాబు అడ్రస్‌ కేరాఫ్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ అని అన్నారు ఫిల్మ్‌నగర్‌ వాసులు. ఆ తర్వాత ‘ప్రేమకథా చిత్రమ్, భలే మంచిరోజు, శమంతకమణి, సమ్మోహనం’ సినిమాలతో సొంత గుర్తింపును సంపాదించుకున్నారు. నచ్చిన కథలతో ఇతర నిర్మాతల డబ్బుపై ప్రయోగం చేయడం కంటే సొంత ప్రొడక్షన్‌లో సినిమాలు తీయడం మంచిదే అని భావిస్తున్నారు ఆయన. ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌’ అనే కొత్త బ్యానర్‌ను స్థాపించి ‘నన్ను దోచుకుందువటే’ సినిమాను నిర్మించడంతో పాటు హీరోగా కూడా నటించారు. ఆర్‌.ఎస్‌. నాయుడు అనే కొత్త డైరెక్ట ర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమాలో కథానాయికగా నటించిన నభా నటేష్‌ టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు.

కొత్త ప్రస్థానం!
‘ప్రస్థానం’ సినిమాలో అందరి దృష్టిలో పడి ఆ తర్వాత ఐదేళ్లకు ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ తో బాక్సాఫీస్‌ హిట్‌కొట్టిన హీరో సందీప్‌ కిషన్‌. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’ వంటి సినిమాలు చేసినా సరైన హిట్‌ పడలేదు. ఈ నేపథ్యంలో ‘వెంకటాద్రి టాకీస్‌’ అనే బ్యానర్‌ ప్రారంభించి తను నటిస్తున్న ‘నిను వీడని నీడను నేనే’ సినిమాలో భాగస్వామి అయ్యాడతడు. షూటింగ్‌ పూర్తి కావొస్తున్న ఈ సినిమా రిలీజ్‌ వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. 

నిర్మాత కార్తికేయ
నిర్మాత కుమారుడు నిర్మాత కావడం ఆనవాయితీ. కాని దర్శకుడి కుమారుడు నిర్మాత కావడం కొత్తే. రాజమౌళి కుమారుడు కార్తికేయ ‘షోయింగ్‌ బిజినెస్‌’అనే బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా మారాడు. ఐదేళ్లపాటు ‘బాహుబలి’ సినిమా నిర్మాణాన్ని దగ్గర్నుంచి గమనించిన కార్తికేయకు సినిమాను ప్రొడ్యూస్‌ చేయాలన్న కోరిక కలిగింది. నాగచైతన్య ‘యుద్ధం శరణం’ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌ వర్క్‌ చేసిన అనుభవంతో ‘ఆకాశవాణి’ అనే చిత్రానికి నిర్మాతగా మారారు. అశ్విన్‌ గంగరాజు దర్శకత్వం వహిస్తారు. సమ్మర్‌లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. అన్నట్లు... కార్తికేయ వివాహం కుదిరింది. వచ్చే ఏడాది ఆయన ఓ ఇంటివారు కాబోతున్నారు.

ఛలో..ఛలో..!
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నాగశౌర్య. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారారు. ఐరా క్రియేషన్స్‌ పేరుతో నాగశౌర్య తల్లిదండ్రులు ఉషా ముల్పూరి, శంకర్‌ ముల్పూరినే సొంత నిర్మాణసంస్థ ప్రారంభించినా అది నాగశౌర్య సంస్థ కిందే లెక్క. ఆ బ్యానర్‌ కింద ఆయన హీరోగా నటించిన ‘ఛలో’ సినిమా ఎంత సక్సెస్‌ సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఇదే బ్యానర్‌పై రూపొందిన ‘నర్తనశాల’ను ప్రేక్షకులు మెచ్చలేదు. దీంతో మళ్లీ సక్సెస్‌ సాధించాలని డిఫరెంట్‌ కథలను వినడంలో బిజీగా ఉన్నారు శౌర్య. 
ఇన్‌పుట్స్‌: ముసిమి శివాంజనేయులు

మరికొందరు
చిరంజీవి కమ్‌బ్యాక్‌ మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమాతో గతేడాది నిర్మాతగా మారారు హీరో రామ్‌చరణ్‌. ఇప్పుడు చిరంజీవి భారీ బడ్జెట్‌ చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రానికి రామ్‌చరణే నిర్మాత. పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ అనే బ్యానర్‌ను స్థాపించి నితిన్‌ హీరోగా ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రాన్ని నిర్మించారు పవన్‌ కల్యాణ్‌. హీరో బాలకృష్ణ ‘ఎన్‌బీకే ఫిల్మ్స్‌’ అనే బ్యానర్‌ను ఈ ఏడాదే స్థాపించి తండ్రి ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు హీరో రానా. వచ్చే ఏడాది ఆయన హీరోగా రూపొందనున్న ‘హిరణ్యకశ్యప’ సినిమాకు రానానే లీడ్‌ ప్రొడ్యూసర్‌. హీరో నారా రోహిత్‌ కూడా నిర్మాణ రంగంవైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రిలీజైన ‘కథలో రాజకుమారి’ సినిమాకు ఆయన ఒక నిర్మాతగా వ్యవహరించారు. ఇక కల్యాణ్‌ రామ్, మంచు విష్ణు ఇంతకు ముందే నిర్మాణం వైపు అడుగులు వేశారు.

వందమంది నిర్మాతలు!
కొత్త దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘మను’ చిత్రానికి దాదాపు వందమంది ప్రొడ్యూసర్స్‌. ఇందులో కన్‌ఫ్యూజన్‌ ఏమీ లేదు. ఈ సినిమా నిర్మాణానికి మొదట ఏ నిర్మాతా ఆసక్తి చూపించకపోవడంతో క్రౌడ్‌ ఫండింగ్‌వైపు అడుగులు వేశారు ఈ సినిమా టీమ్‌. దీనికి సినీప్రియుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ ప్రకారం ఈ ఏడాది మరో వందమంది ప్రొడ్యూసర్స్‌ ఇండస్ట్రీలోకి వచ్చినట్లేనని సరదాగా అనుకోవచ్చు.దర్శకులు కూడా వీలైనప్పుడు నిర్మాతలుగా మారుతున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై దర్శకుడు సుకుమార్‌ సినిమా నిర్మాణంలో తన పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 21న విడుదల కానున్న వరుణ్‌ తేజ్‌ ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పీహెచ్‌’ సినిమాకు దర్శకుడు క్రిష్‌ ఒక నిర్మాత. ‘ఛల్‌ మోహన్‌రంగ’ సినిమాతో నిర్మాతగా మారారు త్రివిక్రమ్‌. దర్శకులు మారుతి, సంపత్‌ నంది కూడా ఇదే కోవలోకి వస్తారు.

హీరో మహేశ్‌బాబు నిర్మాణరంగం వైపే మాత్రమే కాకుండా థియేటర్స్‌ బిజినెస్‌ వైపు కూడా దృష్టి పెట్టారు. ‘ఏఎమ్‌బి’ (ఏసియన్‌ అండ్‌ మహేశ్‌బాబు) మల్టీప్లెక్స్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్‌ చేశారు. దీని సక్సెస్‌రేట్‌ను గమనించి మరిన్ని బ్రాంచ్‌లను మొదలెట్టాలనే ఆలోచనలో ఉన్నారట మహేశ్‌. ఆయన హీరోగా నటిస్తున్న మహర్షి సినిమా విడుదల కోసం ముస్తాబవుతోంది. ఇక ఆయన జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్‌తో నిర్మాతగా కూడా ఉన్నారు. ‘శ్రీమంతుడు, బ్రహోత్సవం’ సినిమా లకు సహనిర్మాతగా బాధ్యతలు నిర్వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement