Telugu Movies Based On Sports Backdrop: Liger, Ghani Full Details Telugu - Sakshi
Sakshi News home page

Sports Backdrop Movies: స్క్రీన్‌ ప్లేలో 'ప్లే'.. మరింతగా ఆడనున్న సినిమాలు

Published Sat, Mar 12 2022 7:56 AM | Last Updated on Sat, Mar 12 2022 9:41 AM

Telugu Movies Based On Sports Backdrop - Sakshi

సినిమాకి ఓ కథ ఉంటుంది. ఆ కథకు ఒక స్క్రీన్‌ ప్లే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అదే స్క్రీన్‌ పై ఓ ‘ప్లే’ ఉంటే... స్క్రీన్‌ పై ఆట ఆడేవారికి ఓ కిక్కు.. చూసేవారికి మరింత కిక్కు. అలాంటి కిక్‌ ఇవ్వడానికి తెలుగు స్పోర్ట్స్‌ మూవీస్‌ కొన్ని రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాల విశేషాలేంటో ఓసారి చదివేద్దాం. 

ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా..  
ఇప్పటివరకూ లవర్‌ బాయ్‌గా కనిపించిన విజయ్‌ దేవరకొండ వెండితెరపై తన పంచ్‌ పవరేంటో చూపించేందుకు ‘లైగర్‌’లో బాక్సర్‌గా మారారు. హీరోలను తనదైన శైలిలో పవర్‌ఫుల్‌గా చూపించే పూరి జగన్నాథ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. అనన్య పాండే హీరోయిన్‌. ఈ సినిమాలో ప్రొఫెషనల్‌ బాక్సర్‌లా కనిపించేందుకు విజయ్‌ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ ప్రొఫెషనల్‌ బాక్సర్‌ మైక్‌ టైసన్‌తో ఈ సినిమాలో ఢీ కొట్టారు విజయ్‌. టైసన్‌ నటించిన తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. థాయిల్యాండ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ కెచ్చా యాక్షన్‌ సీక్వెన్స్‌లను కంపోజ్‌ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఇటు సినీ లవర్స్‌ అటు బాక్సింగ్‌ లవర్స్‌ ఈ స్క్రీన్‌ ప్లేని ఆగస్ట్‌ 25న చూడనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.  

ఏప్రిల్‌లో గని పంచ్‌ 
వేసవిలో తన పంచ్‌ పవర్‌ చూపించడానికి రెడీ అయ్యాడు గని. బాక్సర్‌ గని పాత్రలో వరుణ్‌ తేజ్‌ నటించిన చిత్రం ‘గని’. ఇప్పటివరకూ లవ్‌స్టోరీలు, ఫ్యామిలీ మూవీస్‌ చేసిన వరుణ్‌ ‘గని’లోని పాత్ర కోసం పూర్తిగా మేకోవర్‌ అయ్యారు. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సయీ  మంజ్రేకర్‌ హీరోయిన్‌. ‘గని’ పంచ్‌ పవర్‌ ఎలా ఉంటుందో చూడాలంటే ఏప్రిల్‌ 8 వరకూ ఆగాల్సిందే. అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమా  ఏప్రిల్‌ 8న విడుదల కానుంది. ఇందులో సునీల్‌ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రధారులు. 

ఈసారి గోల్‌పై గురి  
‘మజిలీ’లో క్రికెటర్‌గా కనిపించి, మంచి కలెక్షన్ల స్కోర్‌ తెచ్చుకున్న నాగచైతన్య తన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’లో గోల్‌పై గురి పెట్టారు. ఈ చిత్రంలో హాకీ ప్లేయర్‌ పాత్రలో కనిపించనున్నారు. ‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఇది. రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చైతూ మూడు విభిన్న పాత్రల్లో అలరించనున్నారని టాక్‌. వాటిల్లో ఒకటి హాకీ ప్లేయర్‌ అని తెలుస్తోంది. నాగచైతన్య హాకీ ఆడుతున్న సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్‌ అయింది కూడా. ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. 

మిల్కీ బ్యూటీ.. బబ్లీ బౌన్సర్‌ 
ఓ వైపు రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్నారు తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘బబ్లీ బౌన్సర్‌’ అనే లేడీ ఓరియంటెడ్‌ మూవీ ఒకటి. మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్‌ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో తమన్నా బౌన్సర్‌ పాత్రలో కనిపిస్తారు. అయితే బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందని టాక్‌. బౌన్సర్‌ నుంచి బాక్సర్‌గా మారే క్యారెక్టర్‌లో తమన్నా కనిపిస్తారని సమాచారం. తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది. 

బ్యాడ్మింటన్‌ నేపథ్యంలో.. 
సుధీర్‌బాబు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లలో ప్రముఖ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ ఒకటి. సుధీర్‌–గోపీచంద్‌ ఇద్దరూ కలిసి బ్యాడ్మింటన్‌ ఆడారనే విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్‌ నుంచి సినిమాల్లోకి వచ్చారు సుధీర్‌. ఇక పుల్లెల బయోపిక్‌ని ఎప్పుడో ప్రకటించినా ఇంకా పట్టాలెక్కలేదు. అయితే సుధీర్‌ బ్యాడ్మింటన్‌ రాకెట్‌తో షూటింగ్‌ లొకేషన్‌లోకి అడుగుపెట్టే సమయం దగ్గర్లోనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement