సక్సెస్‌ కొట్టిన ఫెయిల్యూర్స్‌ | Larzar Din Life is Accustomed to the film Industry | Sakshi
Sakshi News home page

సక్సెస్‌ కొట్టిన ఫెయిల్యూర్స్‌

Published Wed, May 15 2019 3:14 AM | Last Updated on Wed, May 15 2019 4:17 AM

Larzar Din Life is Accustomed to the film Industry - Sakshi

ఫెయిల్యూర్‌ సక్సెస్‌కు ఫస్ట్‌ స్టెప్‌ కాదు... బెస్ట్‌ స్టెప్‌.ముగ్గురు మధ్యతరగతి యువకులు సక్సెస్‌ కాలేక, ప్రపంచం అంతా ఫెయిల్యూర్‌ అంటున్నప్పుడు ఎలా గెలిచారన్నదే ఈ మూడు సినిమాల థర్డ్‌ డైమన్షన్‌.ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి.మూడూ అందరికీ దగ్గరయ్యాయి. సమ్మర్‌ స్టార్టింగ్‌ బావుంది. ఫిల్మ్‌నగర్‌ కొండల్లో మూడు ఫెయిల్యూర్‌ స్టోరీస్‌ ఉదయించాయి... ప్రకాశించాయి...

సక్సెస్‌లో ఉండేవాణ్ణి, సక్సెస్‌ కొట్టేవాణ్ణి హీరో అంటారు. ఓటమి ఎరగనివాడే హీరో. విమానం టికెట్టు దొరక్క పోతే రైలు మీద నిలబడి అనుకున్న చోటుకు వెళ్లిపోయేవాడే హీరో. ఇద్దర్ని తన్ని వాళ్లు గాల్లో ఎగిరాక వాళ్లను అలాగే ఉండనిచ్చి మరో ఇద్దర్ని తన్ని అందరూ గాల్లోకి ఎగిరాక ఒకేసారి కిందపడేలా చేసేవాడే హీరో. ఈ లార్జర్‌ దేన్‌ లైఫ్‌కు సినిమా రంగం అలవాటు పడింది. నిజానికి నిజ జీవితంలో ఎన్నో ఓటములు చూసే సగటు ప్రేక్షకుడికి అన్నీ సక్సెస్‌లు చూసేవాణ్ణి తెర మీద చూసి, వాడిలో తనని చూసుకుని సంతృప్తి పడేలా చేసేదే సినిమా.కానీ అన్ని సినిమాలూ అందరు హీరోలూ ఒకేలా ఉండరు. ఏది పట్టుకున్నా బంగారం అయ్యేవాడితో పాటు ఏది ముట్టుకున్నా మట్టయ్యేవాడు కూడా హీరోగా ఉంటాడు.

అలాంటి హీరోలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అసలు నాటి ‘మిస్సమ్మ’లోనే హీరో ఫెయిల్యూర్‌ హీరో. ఏ ఉద్యోగమూ లేని ఎన్‌.టి.ఆర్‌ లైఫ్‌లో ఎలా తిప్పలు పడ్డాడన్నది కథ. ఏ.ఎన్‌.ఆర్‌ కూడా ‘దేవదాసు’లో ఫెయిల్యూర్‌ హీరోనే. అతని ప్రేమ పండలేదు. కృశించి మరణించాడు. కానీ జనానికి నచ్చాడు. చిరంజీవి కూడా ‘మగ మహారాజు’ సినిమాలో ఏ ఉద్యోగం లేని ఇంటికి ఏ సాయం రాని మనిషిగా ఉంటాడు. కానీ క్లయిమాక్స్‌లో వారం రోజుల పాటు ఆపకుండా సైకిల్‌ తొక్కి తానేమిటో ప్రూవ్‌ చేసుకుంటాడు. కె.బాలచందర్‌ ‘ఆకలి రాజ్యం’లో చివరి వరకూ కూడా హీరో సక్సెస్‌ చూడడు. సాధారణంగా హీరో పట్నం వెళితే ఒక పాట డ్యూరేషన్‌లో కోటీశ్వరుడు అయిపోతాడు.

కానీ ఆకలి రాజ్యంలో క్లయిమాక్స్‌ సమయానికి కమల్‌హాసన్‌ కేవలం ఒక బార్బర్‌ షాపులో పనివాడు అవుతాడు. అయినప్పటికీ ఆ వాస్తవాన్ని జనం ఎంతో ఇష్టపడ్డారు. కాలం మారినా కొత్త తరాలు వస్తున్నా సినిమాల్లో ఇటువంటి అంశ ఒకటి సరిగ్గా ప్లాన్‌ చేస్తే హిట్‌ అవుతుందనడానికి దాఖలాలు ఉన్నాయి. ‘అర్జున్‌ రెడ్డి’లో హీరో తన చేతులారా తన జీవితాన్ని ఫెయిల్యూర్‌లోకి నెట్టుకుంటాడు. అతడు ప్రేమలో విఫలం, కెరీర్‌లోనూ విఫలం. కానీ విజయం కోసం నకిలీ వేషాలు వేయకుండా నిజాయితీగా ఉండే అతణ్ణి జనం నెత్తిన పెట్టుకున్నారు.ఇటీవల వచ్చిన మరో మూడు సినిమాలు కూడా ఫెయిల్యూర్‌లో ఉన్న హీరో పాత్ర చుట్టే అల్లుకుని విజయం సాధించాయి. మొన్నటి ఏప్రిల్‌లో మూడు శుక్రవారాలు విడుదలైన ఆ మూడు సినిమాల గురించి ఆలోచిస్తే  చాలా దగ్గర పోలికలు కనిపిస్తాయి.  ‘మజిలీ’, ‘చిత్రలహరి’, ‘జెర్సీ’.... మూడు కథల్లోనూ జీవితంలో ఓడిపోయిన మనుషులే హీరోలు.

ఒక హీరో ప్రేమకోసం ఓడిపోతే మరో కథలో హీరోను అతడి ఆరోగ్యమే ఓడిస్తుంది. ఇంకో కథలో  ఫేట్‌ బాగా లేకపోతే ఎంత టాలెంట్‌ ఉన్నా పరిస్థితులు మన చేతుల్లో ఉండవు అని నిరూపిస్తుంది. ఏ కథలో అయినా కామన్‌ పాయింట్‌ మనిషి చుట్టూ ఉన్న పరిస్థితులు. ఈ మూడు సినిమాల్లోని మరో ముఖ్య అంశం హీరోయిన్‌ పాత్ర రక్తమాంసాలతో ఉండటం. ఏ పాటల కోసమో గ్లామర్‌ కోసమో మరబొమ్మలా ఉండకపోవడం. ‘మజిలీ’ చిత్రంలోని ఇద్దరు హీరోయిన్లు దివ్యాంశా కౌశిక్, సమంత, ‘చిత్రలహరి’ సినిమాలోని కళ్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్, ‘జెర్సీ’ చిత్రంలోని హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ వీళ్లంతా బలమైన పాత్రలతో సినిమాను నడిపించారు. ఈ ఫెయిల్యూర్‌ స్టోరీస్‌ సక్సెస్‌ అయ్యేందుకు కారణమయ్యారు.

జెర్సీ
నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన సినిమా ‘జెర్సీ’. ఈ సినిమాలో తన నటన చాలా గొప్పగా ఉంటుందని, కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచిపోయే సినిమా అని విడుదలకు ముందే చెప్పాడు నాని. ‘నాకొచ్చిన 100 శాతం నటన నటించేశాను’ అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.  ఏప్రిల్‌ 19న  సినిమా విడుదలయ్యాక నాని చెప్పింది అక్షరాలా నిజం అని సినిమా చూసినవాళ్లు అన్నారు. ఏ గ్రేట్‌ ఫెయిల్యూర్‌ స్టోరీ ఆఫ్‌ ఏ గ్రేట్‌ క్రికెటర్‌ అనిపించింది. నూటికి నూరు మార్కులు సంపాదించింది ఈ సినిమా. 1990లనాటి రంజీ ప్లేయర్‌గా కనిపిస్తాడు నాని ఈ సినిమాలో. కానీ ఆరోగ్యపరంగా ఒక సమస్య ఉందని తెలుసుకొని బ్యాట్‌ అటక మీద పడేస్తాడు.

ఆ సంగతి ఇంట్లో చెప్పడు. చాలా బ్రైట్‌ ఫ్యూచర్‌ ఉన్నప్పటికీ నిరర్ధకంగా ఉండే ఈ పాత్ర తన కొడుకు దృష్టిలో అల్పంగా ఉండటం ఇష్టం లేక ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా బ్యాట్‌ పట్టుకుంటుంది. ఆయుష్షులో విఫలమైనా జీవితంలో గెలుస్తుంది. నాని ప్రియురాలిగా, భార్యగా శ్రద్ధా శ్రీనాథ్‌ రెండు బాధ్యతలను అద్భుతంగా పండించింది.  గతేడాది సుమంత్‌కు ‘మళ్ళీరావా’ చిత్రంతో మంచి విజయాన్ని అందించిన గౌతమ్‌ తిన్ననూరి తన రెండో సినిమాగా ‘జెర్సీ’ని తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు అనిరుద్‌ అందించిన సంగీతం కథతో పాటు హాయిగా ప్రయాణం చేసింది అనటంలో ఏ మాత్రం డౌట్‌ లేదు. చిత్రంలోని ప్రతి పాత్రలోను సహజత్వం కనిపిస్తుంది.

ఉదాహరణకు కట్టప్ప పాత్రధారి సత్యరాజ్‌ ‘జెర్సీ’ సినిమాలో కోచ్‌గా చెలరేగిపోయాడు. నాని కొడుకుగా ఢిల్లీ కుర్రాడు రోనిత్‌ పాత్ర కూడా హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని డైలాగ్స్‌ ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఉదాహరణకు నాని చెప్పే డైలాగ్స్‌ కొన్ని.. ‘మూడు రోజులు తిరిగితే పదేళ్లలో నేను కోల్పోయింది ఏంటో తెలిసింది...’, ‘ఇంత పెద్ద ప్రపంచంలో నన్ను జడ్జ్‌ చేయంది నా కొడుకొక్కడే, వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను..’, ‘ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు ఒక్కడూ లేడు...’ ఇలాంటి ఎన్నో డైలాగ్స్‌తో ప్రే„ కుడిని ఆలోచనల్లోకి తీసుకెళ్లాడు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబ ట్టింది ‘జెర్సీ’.

                                                                                                   
మజిలీ
‘దేర్‌ ఈజ్‌ ఏ లవ్, దేర్‌ ఈజ్‌ ఏ పెయిన్‌’ అనేది ‘మజిలీ’ సినిమాకి ట్యాగ్‌లైన్‌. ఈ ట్యాగ్‌లైన్‌కి కనెక్ట్‌ అవ్వనివారు ఉండరేమో. అందుకే సినిమా లవర్స్‌ అంతా ‘మజిలీ’ని హిట్‌ చేశారు. ‘నిన్ను కోరి’ చిత్రంతో దర్శకునిగా మంచి మార్కులు సంపాదించిన శివ నిర్వాణ ద్వితీయ విఘ్నాన్ని ఫెయిల్యూర్‌ స్టోరీతో దాటేశాడు. కథగా చెప్పాలంటే చాలా చిన్న పాయింట్‌. కానీ కథనం కత్తి మీద సాము అనే చెప్పాలి. హీరో క్యారెక్టర్‌ మన వీధిలోనో, పక్క వీధిలోనో చూసే కుర్రాడి పాత్ర. అల్లరి చిల్లరిగా తిరిగే బాధ్యత లేని పెళ్లయిన యువకుని కథ. ఓ మనిషి జీవితంలోని పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అని రెండు భాగాలుంటాయి. ఆ రెండు భాగాలు మాత్రమే నా సినిమా ‘మజిలీ’ అని చెప్పాడు దర్శకుడు. కథగా చెప్పాలంటే.. ప్రేమలో విఫలమైన హీరో జీవించడమే విఫలం అన్నట్లుగా ఉంటుంటాడు. తండ్రి కోసం పెళ్లి చేసుకుని, భార్యతో బతకలేక, ప్రేయసిని మరచిపోలేకపోతుంటాడు.

ప్రేయసి చనిపోయిన విషయం తెలుసుకుని, షాక్‌కి గురైన అతడు ఆమె కుమార్తెకు క్రికెట్‌లో కోచింగ్‌ ఇస్తుంటాడు. ఆ తర్వాత అతడి జీవితంలో కొత్త చిగురు వస్తుంది. ఫైనల్‌గా భార్యే ప్రేయసిగా అతని మజిలీ బతుకు మీద ఆశతో సాగుతుంది. ఈ సినిమాలోని డైలాగుల్ని చాలా చోట్ల ప్రేక్షకులు ఓన్‌ చేసుకున్నారు. ముఖ్యంగా కొన్ని డైలాగులు విపరీతంగా పేలాయి. హీరోతో హీరో ఫ్రెండ్‌ మాట్లాడుతూ– మనం లవ్‌ లెటర్‌ మీద రాసుకొన్న అమ్మాయి పేరు వెడ్డింగ్‌ కార్డ్‌ మీద ఉండదు రా అంటాడు. హీరో తండ్రి పాత్ర చేసిన రావు రమేశ్‌ తాగొచ్చిన కొడుకు నాగచైతన్య నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు– చిన్నప్పుడు నీకు నడక రాక పడిపోతే పట్టుకున్నాను. 30 ఏళ్లకు తాగొచ్చి నడవలేక పడిపోతుంటే పట్టుకున్నాను. తండ్రిని కదా నువ్వు పడిపోతున్నప్పుడల్లా పట్టుకుంటూనే ఉంటాను అంటాడు.

ఆర్టిస్టుల విషయానికొస్తే ఫస్ట్‌ హాఫ్‌లో హీరోయిన్‌ దివ్యాంశా కౌశిక్‌ చైతన్య లవర్‌గా, ఇంట్రవెల్‌ బ్యాంగ్‌ నుండి నాగచైతన్య భార్యగా సమంత ఇద్దరి హీరోయిన్ల టాలెంట్‌ను చక్కగా చూపించారు దర్శకుడు. నాగచైతన్య లవర్‌బాయ్‌గా, ఫెయిల్యూర్‌ యువకునిగా రెండు షేడ్స్‌ను చక్కగా చేశాడు. నాగచైతన్య తండ్రి పాత్రలో రావు రమేశ్, సమంత తండ్రి పాత్రలో పోసాని ఒదిగిపోయారు. పెళ్లయిన తర్వాత  నాగచైతన్య, సమంత కలిసి నటించిన మొదటి సినిమా కావటంతో ఈ సినిమా మొదటినుంచి క్రేజ్‌ను సొంతం చేసుకొంది. సమంత ఎంటర్‌ అయినప్పటి నుండి కథను మరో స్థాయికి తీసుకెళ్లింది. సమంత పెర్ఫార్మెన్స్‌ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాకు గోపీ సుందర్‌ సంగీతాన్ని అందించగా, యస్‌.యస్‌. తమన్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ను అందించారు. ఏప్రిల్‌ 5న విడుదలైన ఈ సినిమా క్లీన్‌హిట్‌గా నిలిచింది. 

చిత్రలహరి
‘చిత్రలహరి’ సినిమా విషయానికొస్తే ఇదొక చదువుకొన్న కుర్రాడి కథ. అమ్మలేని ఇంట్లో నాన్నతో పాటు ఉండే పాత్రలో సాయిధరమ్‌ తేజ్‌ నటించాడు. చదువులో ఎంతో టాలెంట్‌  ఉన్నప్పటికీ సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడే పాత్ర ఇది. యూత్‌ ఆ పాత్రకు బాగా కనెక్ట్‌ అయ్యారు. ఏప్రిల్‌ 12న విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ను సొంతం చేసుకొంది. దర్శకుడు కిషోర్‌ తిరుమల తన స్టైల్‌ను మిస్‌ కాకుండా  తీసి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేయించుకున్నారు.  కథ విషయానికొస్తే హీరో ఏ ఉద్యోగం రాని ఇంజనీర్‌. తన టాలెంట్‌తో సొంతంగా తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌తో ఏదైనా యాక్సిడెంట్‌ జరిగితే దగ్గరలోని హాస్పిటల్‌కి గాని, పోలీస్‌ స్టేషన్‌కి గాని సమాచారం అందించే విధంగా ఉండే ఓ యాప్‌ను తయారు చేస్తాడు. ఆ యాప్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు, ప్రియురాలు అతని నుంచి దూరంగా వెళ్లిపోవటం, అన్ని అవరోధాలను అధిగమించి ఎలా జయించాడు? అనేది సినిమా.

 హీరోయిన్‌గా ‘హలో’ అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కళ్యాణీ ప్రియదర్శన్‌ నటించారు. ఈ చిత్రంలో హీరోతో పాటు హీరో తండ్రి పాత్ర కూడా చాలా కీలకం. ఎందుకంటే హీరో నిస్సహాయ స్థితిలో ఉన్న  ప్రతి సందర్భంలోనూ నీకు నేనున్నాను అని కొడుకుకు అండగా నిలిచే తండ్రి పాత్ర అది. ఈ పాత్రలో జీవించారు పోసాని. ఈ సీజన్‌లో పోసాని కృష్ణమురళి చేసిన పాత్రలు ‘మజిలీ’లో కానీ, ‘చిత్రలహరి’లో కానీ ఎంతో అలరించాయి. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ఉదాహరణకు సక్సెస్‌ గురించి పోసాని – ఇదేమైనా స్విగ్గీలో పెట్టిన ఆర్డరా.. గంటలో రావటానికి... సక్సెస్‌... టైమ్‌ పడుతుంది అంటాడు. అలాగే హీరో చెప్పే డైలాగ్‌ ‘ఎప్పుడూ గెలిచేవాడు గెలిస్తే అది హెడ్‌లైన్స్, ఎప్పుడూ ఓడిపోతున్నవాడు గెలిస్తే అది హిస్టరీ’ ఇలాంటి ఎన్నో డైలాగ్స్‌ ఉన్నాయి.  దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌కు మంచి మార్కులు పడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement