ఆ పాత్రలకు వాళ్లే స్ఫూర్తి
ఆ పాత్రలకు వాళ్లే స్ఫూర్తి అంటోంది నటి లక్ష్మీమీనన్. ఈ కుంకీ అమ్మడు ఎలాంటి పాత్రల్లో అయినా ఇట్టే ఇమిడిపోయి నటించి మంచి పేరు సంపాదించుకుంటోంది. ఇప్పటివరకూ నటించిన చిత్రాలన్నీ విజయం సాధించడంతో సక్సెస్‌ఫుల్ నాయకిగా ముద్ర పడింది. కుంకీ, సుందరపాండియన్, కుట్టిపులి, పాండియనాడు, మంజాపై, నాన్‌శివప్పుమనిదన్, కొంబన్, మిరుదన్ ఇలా లక్ష్మీమీనన్ నటించిన చిత్రాలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. వీటిలో అధిక శాతం గ్రామీణ పాత్రల్లోనే తను నటించిందన్నది గమనార్హం.
ప్రస్తుతం విజయ్‌సేతుపతికి జంటగా నటిస్తున్న రెక్క చిత్రంలోనూ పల్లెటూరి అమ్మాయిగానే కనిపించనుంది. దీంతో గ్రామీణ పాత్రలకు లక్ష్మీమీనన్ కేరాఫ్‌గా మారింది. దీనికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ఈ భామ బదులిస్తూ తను అలాంటి పాత్రల్లో ఒదిగిపోయి నటించడంతో అన్నీ ఆ తరహా పాత్రలే తనను వెతుక్కుంటూ వస్తున్నాయని అంది.
తాను నటించిన చిత్రాల షూటింగ్ అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుండడంతో ఆయా ప్రాంత ప్రజల వేష భాషలను, ప్రవర్తనలను క్షుణ్ణంగా గమనిస్తుంటానని తెలిపింది. అవన్నీ అలానే మనసులో పదిల పరచుకుని పాత్రల ద్వారా వ్యక్తం చేస్తుంటానని చెప్పింది. ఇక్కడ తనను ఆకట్టుకున్న నటీమణులు చాలా మంది ఉన్నా.. నా నటనకు మాత్రం స్ఫూర్తి ప్రజలేనని పేర్కొంది. మధ్యలో గ్రామీణ పాత్రలు చేసి బోర్ కొడుతోందని స్టేట్‌మెంట్స్ ఇచ్చిన లక్ష్మీమీనన్ తాజా చిత్రం రెక్క కోసం మళ్లీ పల్లె పడుచుగా మారడం గమనార్హం. అయితే తనకు అలాంటి పాత్రలే వస్తున్నాయి ఏం చేయను చెప్పండి అంటోంది ఈ కేరళ కుట్టి.