
తీయడం సులువు.. రిలీజ్ చేయడమే కష్టం!
ఇప్పటి పరిస్థితుల్లో సినిమాలు తీయడం కష్టం కాదు. కానీ, వాటిని విడుదల చేయడమే కషమైన పని.
- దాసరి నారాయణరావు
‘‘ఇప్పటి పరిస్థితుల్లో సినిమాలు తీయడం కష్టం కాదు. కానీ, వాటిని విడుదల చేయడమే కషమైన పని. ఒకవేళ విడుదలైనా సరైన ప్రమోషన్స్ లేక ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు. కొత్త వాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్‌కు వచ్చా. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి సినిమా తీయడమనే కథ నాకు బాగా నచ్చింది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. కృష్ణ, జనని, అఖిల్, భార్గవి, చరణ్, ప్రజ్ఞ ముఖ్య పాత్రల్లో, జాకీ అతిక్ దర్శకత్వంలో, కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో మేరువ సుబ్బారెడ్డి నిర్మించిన చిత్రం ‘లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి’.
శ్రీకోటి స్వరపరచిన పాటల సీడీలను దాసరి ఆవిష్కరించి... నటులు సీనియర్ నరేశ్, తనికెళ్ల భరణిలకు అందజేశారు. ‘‘డిస్ట్రిబ్యూటర్స్‌గా 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాం. ఈ చిత్రం నిర్మాణంలో సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డిలు చాలా సపోర్ట్ చేశారు. ఇందులోని 45 నిమిషాల విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని సహ నిర్మాత సిరాజ్ పేర్కొన్నారు. ఈ వేడుకలో శివాజీరాజా, గౌతంరాజు తదితరులు పాల్గొన్నారు.