హైదరాబాద్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితంపై వివాదస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఎవరు ఏమన్నా.. సినిమా తెరకెక్కించి తీరుతానని తేల్చిచెప్పారు రాం గోపాల్ వర్మ. తాజాగా విజయ దశమి రోజు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ప్రారంభించనున్నట్టు వర్మ ప్రకటించారు. కొత్త ఏడాది జనవరి చివరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. లక్ష్మి పార్వతి తన జీవితంలో ప్రవేశించడాని కంటే ముందే ఎన్టీఆర్ మరణించే వారని, కానీ ఆమె ఆయన జీవితంలోకి వచ్చాక, లక్ష్మీస్ ఎన్టీఆర్ జీవితం ప్రారంభమైందని తెలిపారు.
తిరుపతిలో అక్టోబర్ 19న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముంబైకు చెందిన వ్యాపారవేత్త బాల గిరితో పాటు మరికొంతమంది అతిథులు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా, తండ్రి ఎన్టీఆర్ జీవితం కథలోనే తాను ప్రధాన పాత్ర పోషిస్తూ బాలకృష్ణ.. ఎన్టీఆర్ సినిమాను చేస్తున్నారు. ఆ సినిమాకు డైరెక్టర్ క్రిష్. బాలకృష్ణ, ఎన్టీఆర్‌గా చేస్తున్న ఆ సినిమాకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పడికప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అప్‌డేట్లను పోస్టు చేస్తూ.. చిత్ర బృందం ఆ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా వర్మ ప్రకటించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్‌కు పోటీగా వస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో కోణాన్ని వర్మ స్పృశిస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment