చెన్నై వరదలపై సీనియర్ నటి సినిమా
చెన్నై: సీనియర్ నటి, దర్శకురాలు లక్షీ రామకృష్ణన్ మరోసారి మెగాఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నారు. గతేడాది సంభవించిన చెన్నై వరదలపై తమిళ సినిమా రూపొందించేందుకు సిద్ధమతున్నారు. ఇప్పటికే ఆమె ప్రిప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. జూలై నుంచి షూటింగ్ ప్రారంభించే అవకాశముంది.
'ఈ ఏడాది ఆరంభం నుంచి స్క్రిప్ట్ పై పనిచేస్తున్నా. వరదల గురించి మాత్రమే సినిమాలో చూపించాలనుకోవడం లేదు. చెన్నై మహా నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ప్రజలకు ఎదురైన అనుభవాలు, భావోద్వేగాలు.. విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు స్పందించిన తీరును తెరకెక్కించనున్నామ'ని లక్ష్మీ రామకృష్ణన్ తెలిపారు.
ఒక వ్యక్తి లేదా హీరో గురించి ఈ సినిమా ఉండదని, మానవీయ కోణంలో చూపించనున్నామని చెప్పారు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. ప్రధాన పాత్రల కోసం అశోక్ సెల్వన్, ప్రియా ఆనంద్, నజర్ లను సంప్రదించామని అన్నారు. వర్షాకాలంలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు.