
రెండు జడలు.. ఉంగరాల జుత్తు..
బొంబాయి లోకల్ ట్రైన్. ఓ సీట్లో రెండు జళ్లమ్మాయి కూర్చుని ఉంది. ఆ వెనక సీట్లోనే ఉంగరాల జుట్టున్న ఓ కుర్రాడు కూర్చున్నాడు. తుంటరి పిల్లాడికి చిరునామాలా ఉన్న అతని ముఖం చిలిపి నవ్వులు నవ్వుతూనే ఉంది. పద్ధతికి మారుపేరుగా ఉన్న ఆ రెండుజళ్లమ్మాయి ఇతగాడి చూపులను ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఎందుకొచ్చిన గొడవ అనుకుని మిన్నకుండిపోయింది. రైలు ఆగింది. ఆ అమ్మాయి దిగింది. ఆ అబ్బాయి దిగాడు. స్టేషన్ బయటకు వచ్చిన ఆ యువతి ఓ టాంగా ఎక్కింది. ఇతగాడూ మరో టాంగా ఎక్కాడు. సేమ్ సీన్... ఆ టాంగా వెనకాలే ఇదీ ఫాలో అవుతూ వెళ్తోంది. ఈసారి ఆ అమ్మాయి ముఖంలో కంగారు మొదలైంది. ఆవిడగారి టాంగా బాంబేటాకీస్ స్టూడియో గేట్‌దగ్గర ఆగింది.
వెనకాలే వచ్చిన టాంగా కూడా అక్కడే ఆగింది. అంతే అతగాడి వంక చురచుర చూసి చరచరా స్టూడియోలోకి వెళ్లిపోయింది ఆమె. ఇవేమీ పట్టనట్టు ఈయనగారు కూడా ఆమె బాటలోనే సాగిపోయాడు. కట్ చేస్తే.. ఇద్దరూ ఓ పెద్దాయన ఎదుట నిల్చున్నారు. అప్పటిదాకా అణుచుకున్న కోపాన్నంతా కూడదీసుకుని గయ్యిన లేచింది. ‘ఇతనెవరో.. అప్పట్నుంచి నన్ను ఫాలో అవుతున్నా’డ ని కంప్లైంట్ చేసింది. దానికా పెద్దాయన ఓ నవ్వు న వ్వాడు. మళ్లీ కట్ చేస్తే.. అక్కడున్నవాళ్లంతా నవ్వుకున్నారు.
అసలు విషయం ఏంటంటే.. ఆ రెండు జళ్లమ్మాయి గానకోకిల లతామంగేష్కర్, ఉంగరాల జుత్తువాడు గాయకుడు కిషోర్ కుమార్. ఇద్దరూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్త రోజులవి. ముఖపరిచయాలు కూడా లేవు. ఇద్దరూ ఓ పాట రికార్డింగ్ కోసం బాంబే టాకీస్ స్టూడియోకు వెళ్లాల్సివచ్చింది. దీంతో కి షోర్‌దా తనను ఫాలో అవుతున్నాడని లతాజీ భావించారు. లతా అనుమానానికి తెరదించిన వారు మ్యూజిక్ డెరైక్టర్ క్షేమ్‌చంద్‌రప్రసాద్. కిషోర్ కుమార్ అశోక్‌కుమార్ తమ్ముడనీ, మంచి గాయకుడనీ పరిచయం చేశారు. ఇలా డిఫరెంట్‌గా పరిచయమైన ఈ ద్విగళాలు.. తర్వాత ఎన్నో యుగళగీతాల్లో పోటాపోటీగా గాత్రదానం చేశాయి.