
లేటైనా లేటెస్ట్ ఛాన్స్
తాప్పీ ఇప్పటికి పదమూడు సినిమాల్లో నటించింది. అందులో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సూపర్‌హిట్. గుండెల్లో గోదారి, సాహసం ఏవరేజ్. మిగిలినవన్నీ పరాజయాలే. అయినా... క్షణం తీరిక లేకుండా ఉన్నారు తాప్సీ. జయాపజయాలకు అతీతంగా కెరీర్‌ను సాగిస్తున్నారామె. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘చష్మే బద్దూర్’ చిత్రం మంచి కామెడీ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు పోటెత్తుతాయి అనుకున్న తాప్సీకి అక్కడ కూడా నిరాశే మిగిలింది. అయితే... రీసెంట్‌గా ఈ ఢిల్లీభామకు ఓ మంచి బాలీవుడ్ ఆఫర్ తలుపుతట్టింది.
బాలీవుడ్ సూపర్‌హిట్ ‘విక్కీడోనర్’ దర్శకుడు సూజిత్ సర్కార్ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సీ కథానాయికగా ఎంపికయ్యారు. ‘కై పో చే’ ఫేం అమిత్ సద్ కథానాయకునిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఛాయాగ్రాహకుడు అమిత్ రాయ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో తాప్సీ పాత్ర విభిన్నంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. ఈ సినిమాతో పాటు తమిళంలో అజిత్‌కు జోడీగా ఓ చిత్రంలో నటిస్తున్నారు తాప్సీ. ఇక తెలుగు, తమిళ భాషల్లో లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ముని-3’ ఎలానో ఉంది.