అలా నటించడం సవాలే!
‘‘దర్శకుడు శ్రీను వైట్లగారు కథ చెబుతునప్పుడు... ఈ రోజుల్లో మొబైల్స్, కంప్యూటర్స్ గురించి ఏం తెలియని అమ్మాయి ఎలా ఉంటుందోనని ఆలోచించా. ఆ ఆలోచనే చంద్రముఖి పాత్ర అంగీకరించడానికి కారణమైంది. ఏమీ తెలియని అమ్మాయిలా నటించడమంటే సవాలే. ఆ సవాల్‌ను నేను స్వీకరించా’’ అన్నారు లావాణ్యా త్రిపాఠి. వరుణ్‌తేజ్ హీరోగా నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన సినిమా ‘మిస్టర్’లో లావణ్య ఓ హీరోయిన్‌గా, హెబ్బా పటేల్ మరో హీరోయిన్‌గా నటించారు.
శుక్రవారం విడుదలైన ఈ సినిమా గురించి లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులు సినిమా బాగుందని మెచ్చుకుంటుంటే సంతోషంగా ఉంది. వరుణ్‌తేజ్ మంచి నటుడు. ఇప్పటి వరకూ నేను చేయనటువంటి పాత్రను ‘మిస్టర్’లో చేశా. సినిమాలో ఎక్కువగా హాఫ్ శారీస్‌లో కనిపిస్తా. ఇందులో రాజ వంశానికి చెందిన అమ్మాయిని కాబట్టి... దుస్తులు, నగలు అందుకు తగ్గ సై్టల్‌లో డిజైన్ చేయించాం. నా దృష్టిలో గ్లామర్ అంటే ఎక్స్‌పోజింగ్ కాదు. పాత్రకు తగ్గట్టు నటించాలి. మిగతా సినిమాల విషయానికి వస్తే... పక్కా కమర్షియల్ సినిమా ‘రాధా’లో శర్వానంద్‌కి జోడీగా నటించా. నాగచైతన్య సరసన ఓ సినిమా చేస్తున్నా. ‘మాయవన్’ అనే తమిళ సినిమాలో సైక్రియాటిస్ట్‌గా చేశా’’ అన్నారు.