'ఇదే నా చివరి పాట'
లెజెండరీ సింగర్ ఎస్ జానకీ తన రిటైర్మెంట్ను ప్రకటించారు. దాదాపు 60 సంవత్సరాలుగా 48 వేలకు పైగా పాటలతో సినీ సంగీత అభిమానులను అలరిస్తున్న జానకీ వయో భారం కారణంగా గాయనిగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా తెలియజేశారు. చివరగా అమ్మాపోవిను అనే మలయాళ పాటను రికార్డ్ చేసిన జానకీ, ఇకపై పాటలు పాడదలుచుకోలేదని, సినిమాలతో పాటు వేదిక మీద కూడా పాడేది లేదంటూ ప్రకటించారు.
సుదీర్ఘ సంగీత ప్రయాణంలో దాదాపు భారతీయ భాషలన్నింటిలో పాడిన జానకీ, 4 జాతీయ అవార్డులతో పాటు 32 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. అయితే ఆమె రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో పలు మీడియా సంస్థలు జానకి మరణించినట్టు ప్రచారం చేయటంపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, కేవలం గాయనిగా కొనసాగటం లేదని మాత్రమే తెలిపారు.