
తాగి రెస్టారెంట్‌లో ఆస్కార్ వదిలేసిన లియో!
23 ఏళ్ల సుదర్ఘ నిరీక్షణ అనంతరం ఆస్కార్ అవార్డు వరించడంతో ఇటు లియోనార్డో డికాప్రియో అటు ఆయన అభిమానులు పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. ఐదు నామినేషన్లు పొందినా రాని ఆస్కార్ పురస్కారం.. 'రెవెనంట్'లో నటనకుగాను ఆరో నామినేషన్‌తో డికాప్రియోను వరించింది. ఉదయం ఈ ఆనందంతో తబ్బిబ్బైన లియో రాత్రి మాత్రం పార్టీలో ఫుల్ జోష్‌తో గడిపాడు. టీఎంజెడ్ డాట్‌కామ్ వెల్లడించిన వీడియో ప్రకారం.. ఆస్కార్ వచ్చిన సందర్భంగా డికాప్రియో హాలీవుడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో తన స్నేహితులకు మస్త్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో ఆయన తాగడమే కాదు ఎలక్ట్రిక్ సిగార్‌తో ధూమపానం కూడా చేసినట్టు తెలుస్తోంది. ఎంతో కష్టం తర్వాత దక్కిన ఆస్కార్ కావడంతో సహజంగానే ఆయన తన స్నేహితులతో రెస్టారెంట్‌లో ఆనందంగా గడిపాడని సన్నిహితులు చెప్తున్నారు.
అయితే రెస్టారెంట్‌లో ఫుల్ మజా చేసిన లియో తన ఆస్కార్ పురస్కారాన్ని అక్కడే వదిలేసి వచ్చినట్టు కనిపిస్తోంది. రెస్టారెంట్‌లో నుంచి నిదానంగా నడుచుకుంటూ వచ్చి తన కారు ఎక్కిన ఆయనకు ఆ తర్వాత కాసేపటికి వచ్చిన ఓ వ్యక్తి బ్యాటిల్ అందించగా, మరో వ్యక్తి వచ్చి బంగారు ఆస్కార్ బొమ్మను అందించాడు. గతంలోనూ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం లియో గట్టిగా దమ్ము కొడుతూ కనిపించిన ఫొటోలు హల్‌చల్ చేశాయి.