అందుకే బాలకృష్ణ సినిమాలో విలన్‌గా చేస్తున్నాను | Let us see what Jagapathi Babu has to say about this new role. | Sakshi
Sakshi News home page

అందుకే బాలకృష్ణ సినిమాలో విలన్‌గా చేస్తున్నాను

Published Tue, Aug 6 2013 1:11 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

అందుకే బాలకృష్ణ సినిమాలో విలన్‌గా చేస్తున్నాను - Sakshi

అందుకే బాలకృష్ణ సినిమాలో విలన్‌గా చేస్తున్నాను

‘‘నాకు ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం. అప్పట్లో ‘అంతఃపురం’ , ఆ తర్వాత ‘అనుకోకుండా ఒక రోజు’ తదితర చిత్రాల్లో నా ఇమేజ్‌కి భిన్నంగా వెళ్లి చేశాను. ఫ్యామిలీ హీరో, మాస్ హీరో, యాంటీ షేడ్స్ ఉన్న కేరక్టర్’.. ఇలా వేరియేషన్స్ చూపించుకుంటూ వచ్చాను’’ అన్నారు జగపతిబాబు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా  నటిస్తున్న చిత్రంలో విలన్‌గా యాక్ట్ చేయడానికి అంగీకరించారాయన. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోని పాత్రను సవాల్‌గా తీసుకున్నానంటున్న జగపతిబాబుతో మాటామంతీ.
 
 ***  సడన్‌గా విలన్ కేరక్టర్‌కి టర్న్ అయ్యారు.. కారణం ఏంటి?
 వాస్తవానికి నేనెలాంటి పాత్ర అయినా చేస్తానని మూడేళ్ల క్రితమే ప్రకటించాను. కానీ రాలేదు. ఇప్పుడీ సినిమాకి అడిగారు. విలన్ కేరక్టరే అయినా రొటీన్‌కి భిన్నంగా ఉంటుంది. పంచెలు కట్టుకుని, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని ఆ టైప్‌లో ఉండదు. చాలా స్టయిలిష్‌గా ఉంటుంది. ఇటాలియన్ స్టయిల్‌లో ఉంటుంది. బేసిక్‌గా నాకా స్టయిల్ ఇష్టం. బాలయ్య పాత్రతో ఢీ అంటే ఢీ అనే తరహా పాత్ర నాది. ఇలాంటి పాత్ర కోసమే ఎదురు చూస్తున్నాను.
 
 ***  ఈ మధ్యకాలంలో మంచి అవకాశాలు లేకపోవడం కూడా ఈ పాత్ర ఒప్పుకోవడానికి ఓ కారణం అనుకోవచ్చా?
 ప్రస్తుతం హీరోగా రెండు, మూడు సినిమాలున్నాయి. నేను హీరోగా పీక్‌లో ఉన్నప్పుడే ‘అంతఃపురం’లో యాంటి షేడ్స్ ఉన్న కేరక్టర్ చేశాను. ఆ తర్వాత ‘అనుకోకుండా ఒక రోజు’లో  మంచి పాత్ర చేశాను. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చేశాను. కొన్ని విడుదల కాలేదు. విడుదలైనవి ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో తెలియలేదు. కొన్ని పాత్రలు నచ్చకపోయినా డబ్బు కోసం చేశాను. నచ్చని పాత్రలను కష్టపడి చేశాను. ఈ పాత్రను ఇష్టపడి చేయబోతున్నాను. ఇలాంటి ఓ మంచి పాత్ర రావడం నటుడిగా నాకు రీ-బర్త్. అందుకే ఒప్పుకున్నాను.
 
 ***  నెరిసిన గడ్డంతో కనిపిస్తున్నారు.. సినిమాలో గెటప్పా?
 అవును. ఇందులో మూడు తరాలకు సంబంధించిన పాత్రల్లో కనిపిస్తాను. యంగ్, మిడిల్, ఓల్డ్ ఏజ్ గెటప్స్. ఈ కథ, కేరెక్టర్ విన్న తర్వాత బాడీ లాంగ్వేజ్‌ని ఎలా కావాలంటే అలా మార్చుకుని చేస్తానని బోయపాటితో అన్నాను. మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తున్న పాత్ర ఇది. 
 
 ***  బాలకృష్ణతో మీకున్న ఎటాచ్‌మెంట్ గురించి?
 తను నా మంచి ఫ్రెండ్. ఒకప్పుడు ఇద్దరం రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేవాళ్లం. ఆ తర్వాత ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉండటంవల్ల తరచుగా కలుసుకోలేకపోయాం. అలాంటిది ఇంత కాలానికి బాలయ్య కాంబినేషన్‌లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ముక్కుసూటిగా ఉంటారు. నేనూ అంతే. అందుకని మా ఇద్దరి కాంబినేషన్ బాగుంటుందని నా ఫీలింగ్.
 
 ***  బోయపాటి శ్రీను గురించి మీ అభిప్రాయం?
 తన దర్శకత్వంలో బాలయ్య నటించిన ‘సింహా’ చూశాను. ఆ తర్వాత బోయపాటి శ్రీనుకి ఫోన్ చేసి, ‘‘ఈ మధ్యకాలంలో బాలయ్యను ఇంత స్టయిలిష్‌గా ఎవరూ చూపించలేదు. చాలా బాగుంది’’ అని చెప్పాను. హీరోతో పాటు విలన్ కేరక్టర్‌ని కూడా సమర్థవంతంగా తీయగల నేర్పు బోయపాటికి ఉంది. అందుకే ఈ సినిమా కమిట్ అవ్వగానే.. ‘‘నా స్టయిల్‌లో కాదు. నువ్వెలా చెబితే అలా స్టయిల్ మార్చుకుని చేస్తా’’ అన్నాను. 
 
 ***  లేడీస్‌లో మీకు మంచి ఫాలోయింగ్ ఉంది. మరి.. మీరు విలన్ అంటే వాళ్లు ఫీలవుతారేమో?
 కచ్చితంగా బాధ ఉంటుంది. అంతెందకు... లొకేషన్లో ‘‘ఇప్పుడు హీరోగారు వస్తారు.. మీరేమో..’’ అంటూ సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు నాకూ ఒకింత బాధగానే అనిపిస్తుంది. కానీ అది క్షణంసేపే. ఆ తర్వాత ఏమీ అనిపించదు. ఇక నా అభిమానులు ఈ వార్త వినగానే ముందు బాధపడతారు. అందుకే వాళ్లకి ‘సారీ’ చెబుతున్నా. కానీ నాకు నచ్చే కేరక్టర్లు చేయడం కూడా ముఖ్యమే కదా. అల్టిమేట్‌గా ఇది సినిమా. ఎప్పటికీ నేనే హీరోని అనుకోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్.
 
 ***  ఈ మార్పుని ఏ మేరకు ఆస్వాదిస్తున్నారు?
 ఇరవయ్యేళ్ల క్రితం నువ్వు హీరోగా పనికి రావన్నారు. అప్పుడు ఒక్క సినిమాలో యాక్ట్ చేసినా చాలని ఏడ్చిన రోజులున్నాయి. అలాంటిది ఏకంగా వంద సినిమాల్లో యాక్ట్ చేసేశాను. ఆశకు అంతు ఉండాలి. అది లేకపోతే కష్టం. హీరోలు విలన్లుగా చేయడం హాలీవుడ్‌లో ఎప్పుడో ఉంది. ఆ తర్వాత  బాలీవుడ్‌లో సంజయ్‌దత్, అజయ్‌దేవగన్‌లాంటి వాళ్లు హీరోలుగా, విలన్లుగా చేస్తున్నారు. మన దగ్గర కూడా ఆ ట్రెండ్ ప్రారంభమవ్వాలి. కళాకారులు అన్ని రకాల పాత్రలు చేయాలిలాంటివి చెప్పను. కానీ ఓ ఆర్టిస్ట్‌గా మాత్రం ఏ పాత్ర అయినా చేసి నిరూపించుకోవాలనేది నా తపన.
 
 ***  ఇకనుంచి మీ కోసం రచయితలు కథలు సిద్ధం చేయడం ఎక్కువ అవుతుందనుకుంటున్నారా?
 ఆ నమ్మకం ఉంది. నన్ను మంచోడిగానూ చూపించొచ్చు. చెడ్డోడిగానూ మలచవచ్చు. మంచి భర్త పాత్రలకు దూరం కాను. హీరోగా చేస్తాను. దమ్మున్న పాత్ర అయితే విలన్‌గా అంగీకరిస్తాను. కేరక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తాను. ఆ మధ్య ‘లక్ష్యం’లో నటించాను. అందులో నా పాత్రను రత్నంగారు చాలా బాగా  మలిచారు. ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మళ్లీ రత్నంగారి కాంబినేషన్‌లో ఈ సినిమా చేయడం హ్యాపీగా ఉంది.
 
 ***  ఇటీవల మీరు చేసిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. సరైన టైమ్‌కి విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సంస్థలో సినిమా చేయడం గురించి?
 ఈ సినిమా ఒప్పుకోవడానికి మరో ముఖ్య కారణం అనిల్, సాయి. మంచి కమిట్‌మెంట్ ఉన్న నిర్మాతలు. సినిమా సరిగ్గా వస్తుందా? అసలు విడుదలవుతుందా? లాంటి టెన్షన్లు ఉండవు. ఒక పేషన్‌తో సినిమా చేస్తారు కాబట్టి.. నా పాత్ర వరకు నేను కాన్‌సన్‌ట్రేట్ చేసుకుని, మిగతా టెన్షన్లను వదిలేయొచ్చు.
 
 ***  ఫైనల్‌గా ఈ సినిమాలో మీరు డ్యూయెట్లు పాడతారా?
 ఇందులో నాకో హీరోయిన్  ఉంది. డ్యూయెట్ల గురించి దర్శకుణ్ణే అడగాలి (నవ్వుతూ).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement