అంతర్జాతీయ చిత్రం 'కోచడయాన్' | kochadaiyaan is international Cinema, says Deepika Padukone | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ చిత్రం 'కోచడయాన్'

Published Tue, Aug 6 2013 3:55 PM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

అంతర్జాతీయ చిత్రం  'కోచడయాన్' - Sakshi

అంతర్జాతీయ చిత్రం 'కోచడయాన్'

తన తదుపరి చిత్రం దక్షిణాది సూపర్స్టార్ రజినీకాంత్తో కలిసిన నటించిన  'కోచడయాన్‌' విడుదలకు సిద్దంగా ఉన్నట్లు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే చెప్పారు. ఈరోజు ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఇది తమిళ చిత్రం కాదని అంతర్జాతీయ చిత్రం అని తెలిపారు. ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, రష్యా, జపాన్, చైనా భాషలలో విడుదలవుతుందని చెప్పారు.  రజినీకాంత్ అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న నటుడని తెలిపారు. ఈ చిత్రాన్ని 3డిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో అద్భుతంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు  ఏ భారతీయ చిత్రంలో లేనటువంటి యానిమేషన్ దృశ్యాలు ఇందులో ఉంటాయని దీపిక వివరించారు.

భారీ బడ్జెట్, భారీ తారాగణం నటించిన  'కోచడయాన్‌' తొలికాపీ సిద్ధమైంది. అంతర్జాతీయంగా వివిధ భాషల్లో ఒకే రోజున  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  చారిత్రక నేపథ్యంలో ఆధ్యాత్మికతను మేళవించి కూతురు  సౌందర్య దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ నటవిశ్వరూపం చూపించారని వినికిడి. రజనీకాంత్, దీపికా పదుకొనే జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వ పర్యవేక్షణలో సౌందర్య దర్శకత్వం వహించారు.  ఈ చిత్రంలో ప్రతినాయకుడు పాత్రలో  జాకీ ష్రాఫ్‌, ప్రత్యేక పాత్రలో శోభన, ఇంకా శరత్‌ కుమార్‌, ఆది పినిశెట్టి,  నాసర్, రుక్మిణి, విజయకుమార్ నటించారు. ఈరోస్ ఇంటర్నేషనల్, మీడియా వన్ గ్లోబర్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి నిర్మాత  మురళీ మనోహర్‌.  రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.


తెలుగులో దీనిని‘విక్రమ సింహా' పేరుతో విడుదల చేస్తారని తెలుస్తోంది. రజనీకాంత్‌ విభిన్న తరహాలలో కనిపించే పోస్టర్లు ఇప్పటికే అభిమానులో  ఆసక్తి పెంచాయి. రజనీకాంత్ నటించిన చివరి చిత్రం ‘రోబో' 2010లో విడుదలైంది. ఆ తరువాత ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆశగా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.



ఏడాది క్రితమే ఈ సినిమా పోస్టర్‌ రిలీజ్‌ చేసినప్పటికీ   పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది.  చెన్నై, లండన్‌లలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగాయి. తొలి కాపీని తమిళ దర్శకుడు రవికుమార్‌తో కలిసి రజనీకాంత్‌ చూశారు. ఊహించినదానికంటే సినిమా చాలా రిచ్‌గా వచ్చిందని  రజనీకాంత్  రవికుమార్‌ను  ప్రశంసించారు. ‘‘నా జీవితంలో మరచిపోలేని రోజు ఇది. నాన్నగారు, రవికుమార్ అంకుల్, ఇతర టీమ్ సభ్యులు ఈ సినిమా మొదటి కాపీ చూసి, చాలా థ్రిల్ అయ్యారు’’ అని  సౌందర్య ట్విట్టర్‌లో పెట్టారు.  ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు లండన్ లోని పీనివుడ్స్ స్టూడియోలో జరిగినట్లు తెలిపారు.  ఈ చిత్రం నవంబర్లో విడుదలవుతుందని భావిస్తున్నారు.

ఈ సినిమా ప్రత్యేకతలు

'కోచడయాన్‌'కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ‘మోషన్ కాప్చరింగ్’ టెక్నాలజీతో   3డీలో రూపుదిద్దుకుంటున్న తొలి భారతీయ సినిమా.  ఆసియాలోనే తొలి మోషన్ క్యాప్చర్ సినిమా ఇది.  కోట్ల రూపాయలు ఖర్చుచేసి అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని నిర్మించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో  ఇప్పటి వరకు అవతార్‌, అడ్వెంచర్స్‌ ఆఫ్‌ టిన్‌ టిన్‌... రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి.   మొత్తం 48 కెమెరాలతో ఈ సినిమా షూటింగ్‌ జరిపారు.  అంటే ఒక్కో దృశ్యాన్ని  48 కోణాల్లో చిత్రీకరించారు. చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో నటించేందుకు చెన్నై ప్రభుత్వ ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి 42 మంది విద్యార్థులను, కుంభకోణం ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి 50 మంది విద్యార్థులను సౌందర్య ఎంపిక చేశారు.  ఈ సినిమాకు మరో విశేషం ఏంటంటే జీవితసారాన్ని తెలియజెప్పే ఓ అద్భుతమైన పాటను రజినీకాంత్‌ ఇందులో పాడారు.  ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్‌ సంగీతంలో రూపొందించిన ఈ పాటను  వైరముత్తు రాశారు. 1992లో తమిళ సినిమా మన్నన్‌ కోసం రజినీ మొదటిసారి పాటపాడారు. ఆయన పాడిన రెండో పాట ఇది. హిందీ వెర్షన్‌లోనూ  ఆయనే పాడారు. రజనీ జపాన్ అభిమానుల ముచ్చట తీర్చేవిధంగా కొన్ని ప్రత్యేక దృశ్యాలను కూడా చిత్రీకరించారు.  రజనీ కాంత్ స్థాయికి తగిన రీతిలో ఈ సినిమా అంతర్జాతీయంగా మార్కెట్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement