ఒకే రోజున రజనీ, కమల్ చిత్రాల రిలీజ్
సూపర్‌స్టార్ రజనీకాంత్, పద్మశ్రీ కమల్ హాసన్ చిత్రాలు ఒకే రోజున తెరపైకొస్తే ఎలా ఉంటుంది. రసవత్తరంగా ఉంటుందంటున్నారు పంపిణీదారులు. అయితే అలాంటి అవకాశం ఉందా? అంటే, సరైన సమాచారం ఎవ్వరికీ చిక్కడం లేదు. రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కోచ్చడయాన్’. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. త్రీడీ మోషన్ కాప్చరింగ్ పరిజ్ఞానంతో హాలివుడ్ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని రజనీ పుట్టిన రోజైన డిసెంబరు 12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చరిత్రాత్మక భారీ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాగా కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వరూపం-2’. ఆండ్రియా, పూజాకుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పాటలను వచ్చే నెలలోను, చిత్రాన్ని డిసెంబరులోనూ విడుదల చేయడానికి కమల్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే రెండు భారీ చిత్రాలను ఒకేసారి విడుదల చేయడం సరైన విధానమేనా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వస్తుంది.
ఇప్పుడు మాత్రం రజనీ, కమల్ చిత్రాలు ఒకే రోజునే విడుదల చేయాలనే ఆకాంక్షను పంపిణీదారులు వ్యక్తం చేస్తున్నారు. అందుకు వారు చెప్పే కారణం ఇతర స్టార్ హీరోల చిత్రాలకు, రజనీ, కమల్ చిత్రాలకు వ్యత్యాసం ఉంటుందన్నదే. ఇతర హీరోల చిత్రాలు ఒకేసారి విడుదలయితే వాటిలో బాగున్న చిత్రమే థియేటర్లలో నిలబడుతుందటున్నారు. రజనీ, కమల్ చిత్రాలు అలా కాదని, ఎన్నో అంచనాలతో కూడిన ఈ చిత్రాలు హౌస్‌ఫుల్‌గా ప్రదర్శితం కావడం ఖాయం అని అంటున్నారు. అదేవిధంగా తమిళనాడులోని 700 థియేటర్లలోనూ ఈ రెండు చిత్రాలనే ప్రదర్శించవచ్చునని పేర్కొంటున్నారు. ఇతర హీరోల చిత్రాలకు ఇది సాధ్యం కాదంటున్నారు. చూద్దాం... ఏం జరుగుతుందో!?