‘‘అమితాబ్ బచ్చన్‌గారు లెజెండ్. మేము సెట్స్‌లో కలిసినప్పుడు పరస్పరం నమస్కరించుకుంటాం. కానీ ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకలో నా కాళ్లకి అమితాబ్‌గారు నమస్కరించడంతో నాకు తల కొట్టేసినంత పని అయింది. ఆయన అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది.
ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో సి. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘నాగ్ అశ్విన్ ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడనే నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది. ఈ శతాబ్దంలో ఒక మంచి దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు (నవ్వుతూ). ‘కల్కి’ విషయంలో టెన్షన్ పడలేదు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే తీశాం... అది నెరవేరింది. ప్రభాస్ సహకారం లేకపోతే అసలు ఈ సినిమా బయటికి రాదు. రాజమౌళి–ప్రభాస్‌ల ఎపిసోడ్ ఫన్నీగా పెట్టిందే. అలాగే బ్రహ్మానందం, రామ్‌గోపాల్ వర్మ పాత్రలని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ కథ అనుకున్నప్పుడే రెండో భాగం ఆలోచన వచ్చింది. కమల్‌గారు ఎంటరైన తర్వాత పార్ట్ 2 డిసైడ్ అయిపోయాం. ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 2 వచ్చే ఏడాది జూన్‌లోనే విడుదల కావొచ్చు. 50 ఏళ్ల వైజయంతీ మూవీస్ ప్రయాణం అద్భుతం. ప్రస్తుతం శ్రీకాంత్‌గారి అబ్బాయి రోషన్‌తో ఓ సినిమా, దుల్కర్ సల్మాన్‌తో ఒక చిత్రం నిర్మిస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment