లింగా డిస్ట్రిబ్యూటర్ల నిరాహారదీక్షలు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కష్టాలు తప్పటం లేదు. కొచ్చడయాన్ నష్టాల నుంచి ఇంకా కోలుకోకముందే లింగా కష్టాలు పంపిణీదారులచే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. లింగా సినిమాను విడుదల చేసిన పంపిణీదారులు తాము నిండా మునిగిపోయామంటూ చెన్నైలో ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఏడుగురు పంపిణీదారులు 700 మంది థియేటర్ల యాజమానులు ఇందులో పాల్గొన్నారు. ఒక్కొక్క పంపిణీదారుడు దాదాపు 7- 10 కోట్ల రూపాయల మేరకు నష్టపోయామని వాపోతున్నారు.
నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తమిళుడు కాకపోవటం, ప్రదాన పంపిణీదారుడు వేందర్ సినిమా నష్టాలతో తనకు సంబంధం లేదనటం... పంపిణీదారులు, థియేటర్ యాజమానులను రోడ్డున పడేసేలా చేసింది. లింగా చిత్రం ఇప్పటి వరకు కనీసం 25శాతం కూడా వసూలు చేయలేదని, తాము 75శాతం నష్టపోయామని వారు కన్నీళ్లపర్యంతం అవుతున్నారు. ఈ విషయమై చిత్ర హీరో రజనీకాంత్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్ నుంచి హామీ రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.