‘ఎటువంటి మేకప్ లేకుండా 47వ ఏట ఇదీ నేను. మనం ఎలా కనిపిస్తున్నామో.. అచ్చంగా... అలాగే ప్రపంచం ముందుకు రావడానికి మనలో ఎంత మందికి ధైర్యం ఉంటుంది? యుక్త వయస్సులో ఉన్నపుడైతే నాకు ఆ ధైర్యం లేదు. ప్రతీ ఒక్కరు మన విలువను గుర్తించలేరు. అయితేనేం మీ చర్మాన్ని, అది చెప్పే కథలను ప్రేమించండి. ఓ మహిళా... నీ అనుభవాలు, నీ ప్రత్యేకతను, నీ విలువను నువ్వే గుర్తించాలి! అపుడే ప్రపంచం కూడా ఇదే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. లేనిపక్షంలో అటువంటి వాళ్ల గురించి వదిలేసెయ్’ అంటూ బాలీవుడ్ నటి, మోడల్ లీసా రే తన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు జత చేసిన సందేశాత్మక క్యాప్షన్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘క్యాన్సర్‌ని జయించి..జీవితంలో నిలదొక్కుకున్న మీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యమే గొప్పదని మరోసారి నిరూపించారు. ప్రతీ మహిళ మీలాగే ఆలోచించాలి. మేకప్ ఉన్నా లేకున్నా మీరెప్పుడూ పర్ఫెక్ట్‌గానే ఉంటారు మేడమ్’ అంటూ లీసారేపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా మోడలింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లీసారే క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. క్రమంగా వ్యాధి నుంచి కోలుకున్న ఆమె...2012లో తన ప్రియుడు జాసన్ డేహ్నిని పెళ్లాడారు. ఈ జంట గతేడాది సెప్టెంబరులో సరోగసీ విధానంలో కవలలకు జన్మనిచ్చారు. ఇక తాను క్యాన్సర్‌ను జయించిన తీరును..ఆ క్రమంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను..‘క్లోజ్ టూ ది బోన్’ పేరిట లీసారే పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ‘రోగాల బారిన పడినంత మాత్రాన.. జీవితం ముగిసిపోదు.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. వైద్యరంగంలో వచ్చిన మార్పుల వల్ల నేడు అన్నీ సాధ్యమే. అందుకు నేనే ఉదాహరణ. కాబట్టి ఎప్పుడూ నిరాశ చెందవద్దంటూ’ క్యాన్సర్ బాధితుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. అంతేకాకుండా అందంగా లేనంటూ ఆత్మన్యూనతతో బాధపడకూడదని.. యుక్త వయస్సులో తాను కూడా ఇలా అనుకునేదాన్నని..అది ఎంత పొరపాటో ఆలస్యంగా తెలుసుకున్నానని తన పుస్తకావిష్కరణ సందర్భంగా పలు విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు.‘ పదహారేళ్ల వయస్సులో ఎప్పుడూ ఎదుటివారికి ఎలా కనబడుతున్నానా అనే ఓ అభద్రతా భావంతో జీవించేదాన్ని. నేను అందంగా లేనని తెగ ఫీలైపోయేదాన్ని. అయితే ఇప్పుడే అర్థమైంది. టీనేజ్‌లో కంటే 47 ఏళ్ల వయస్సులో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నానని’ అంటూ లీసారే తన గురించి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment