లవింగ్ విన్సెట్ దృశ్యం
లాస్ ఏంజిల్స్ : ఆస్కార్ బరిలో ఈసారి ఓ అద్భుత చిత్రం నిలిచింది. యానిమేషన్ చిత్రాల బరిలో నిలిచిన ‘లవింగ్ విన్సెట్’ అవార్డు దక్కించుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇది చిత్రం కాదు. పూర్తిగా చేత్తో గీసిన పెయిటింగ్‌లతో తెరకెక్కించింది.
సుమారు 65,000 ఫ్రేమ్‌లు, ప్రపంచవ్యాప్తంగా 125 మంది పెయింటర్లు ఈ చిత్రం కోసం పని చేశారు. పోలాండ్‌లోని గ్దాన్స్క్ పట్టణంలో వీరంతా ఒకచోట చేరి ఈ చిత్రాన్ని రూపొందించారు. విన్సెంట్ వాన్ ఘో హత్య.. విచారణ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి డోరోటా కోబైలా, హూ వెల్చ్‌మన్‌లు దర్శకులు.
నిజానికి కోబైలా.. 2008లో ఏడు నిమిషాలతో షార్ట్ ఫిలింగా దీనిని విడుదల చేశారు. తర్వాత దీనిని పూర్తి స్థాయి సినిమాగా రూపొందించాలన్న ఆలోచన వచ్చింది. పాత్రలకు డబ్బింగ్, మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా... అన్ని హంగులతో ఈ చిత్రాన్ని 90 నిమిషాల నిడివితో నిర్మించి 2017లో విడుదల చేశారు. 5.5 మిలియన్ డాలర్ల ఖర్చుతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు 30.5 మిలియన్ డాలర్లను వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. బెర్లిన్‌లో జరిగిన 30వ యూరోపియన్ ఫిల్మ్ అవార్డుల వేడుకల్లో ఉత్తమ యానిమేషన్ చిత్రంగా ఇది అవార్డు దక్కించుకుంది. ఇక ఇప్పుడు అకాడమీ అవార్డుల రేసులో నిలవటంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
Comments
Please login to add a commentAdd a comment