
చెన్నై: కాలం బలీయమైనదని నమ్మక తప్పదు. అందుకే ముహూర్త బలం ఉండాలంటారు. తాజాగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రానికి సమస్యలు వెంటాడుతున్నాయనే టాక్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. మల్టీస్టారర్ చిత్రాలు చేయడంలో మణిరత్నం సిద్ధహస్తుడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాటి దళపతి, ఇరువర్ వంటి మల్టీస్టారర్ చిత్రాలను ఆయన సునాయాసంగా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. అంతేకాదు ఇటీవల అరవిందస్వామి, విజయ్‌సేతుపతి, శింబు, అరుణ్‌పాండియన్, జ్యోతిక, ఐశ్వర్యరాజేశ్, జయసుధ, ప్రకాశ్‌రాజ్ వంటి ప్రముఖ తారలతో సెక్క సివంద వానం చిత్రాన్ని చేసి విజయాన్ని అందుకున్నారు.
అయితే మరో మల్టీస్టారర్ చిత్ర నిర్మాణమే ఆయన్ని వెక్కిరిస్తోందనే చెప్పాలి. అదే పొన్నియిన్ సెల్వన్. నిజానికి ఈ చిత్రం ఎంజీఆర్, కమలహాసన్ వంటి వారినే ఊరించి వదిలేసింది. ఇక మణిరత్నం సెక్క సివంత వానం చిత్రానికి ముందే పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని చేయాలని సంకల్పించారు. అందులో ఇళయదళపతి విజయ్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, బాలీవుడ్ సౌందర్యవతి ఐశ్వర్యరాజేశ్ వంటి మల్టీ స్టారర్స్‌తో తెరకెక్కించే ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో ఆ ప్రయత్నం సఫలం కాలేదు. అయితే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్‌ను తెరకెక్కించడంపై తన పట్టును ఏ మాత్రం పడలించలేదు. సెక్క సివంద వానం చిత్ర విజయంతో మళ్లీ పొన్నియిన్ సెల్వన్ చిత్ర నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ సారి తన ప్రయత్నానికి ఎవరూ అడ్డుకోలేరని భావించారు. ఇందులోనూ జయంరవి, కార్తీ, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, అందాలరాశి ఐశ్వర్యరాయ్, కీర్తీసురేశ్, అమలాపాల్ వంటి మల్టీస్టార్స్‌తో పాటు అదనంగా నయనతారను కూడా నటింపజేయాలని భావించారు.
అయితే నయనతార కాల్‌షీట్స్ లేకపోవడంతో ఆమె పాత్రకు మరో అగ్రనటి అనుష్కను ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలను కట్టనున్నారు. ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి అనే ప్రచారం జరుగుతోంది. ఇక షూటింగ్ ప్రారంభించడమే తరువాయి అని, సెప్టెంబర్‌లో పొన్నియిన్ సెల్వన్ సెట్ పైకి వెళ్లనుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ చిత్రానికి మళ్లీ మరో సమస్య వచ్చి పడినట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ అత్యంత భారీ బడ్జెట్ చిత్రాన్ని మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థతో కలిసి లైకా సంస్థ నిర్మించడానికి ముందుకు వచ్చింది. కాగా ఇప్పుడా సంస్థ ఆ ప్రయత్నాన్ని విరమించుకుందనే ప్రచారం సాగుతోంది. కారణం చిత్ర బడ్జెటేనని టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉండగా, పొన్నియిన్ సెల్వన్ చిత్రం మాత్రం మణిరత్నంను బాగా ఇబ్బంది పెడుతోందని మాత్రం చెప్పవచ్చు. అయితే చిత్రం కాకపోయినా, మణిరత్నం తాజా చిత్రం మల్టీస్టారర్‌గానే ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment