
అమ్మ జయలలితకు 'మా' సంతాపం
అమ్మ జయలలిత నిష్కృమణం .. సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) సంతాపం తెలియజేసింది. ఈ సందర్భంగా `మా` అధ్యక్షులు డా.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ `అమ్మ జయలలిత మహానాయకురాలు .. అంతకుమించి గొప్ప నటి. వృత్తి ఏదైనా ప్రవృత్తిలో వీరోచితంగా పోరాడే ధీశాలి. తమిళనాడులో దిగువ తరగతి ప్రజలకు అమ్మ.. మధ్య తరగతి ప్రజలకు పురచ్చితలైవి. గొప్ప విప్లవనాయకురాలు..
తన జీవితమంతా .. స్కూలు రోజుల నుండి పోరాటమయమే! అయినా అంచెలంచెలుగా ఒక మహాశక్తిగా ఎదిగిన తీరు అందరికి ఇన్‌స్పిరేషన్. ఈ పయనంలో గెలుపోటముల్ని సమానంగా తీసుకున్న గొప్ప ధీశాలి. మహానటులు ఎంజీఆర్, నటసార్వభౌముడు, అన్నగారు ఎన్టీఆర్ సరసన నాయికగా నటించారు. ఏఎన్నార్ వంటి దిగ్గజం సరసన నటించారు. సినీ నాయికగా, రాజకీయ నాయకురాలిగా ఎన్నో మైలు రాళ్లు అందుకున్నారు. ఆరుసార్లు ఓ మహిళ ముఖ్యమంత్రి అవ్వడం అన్నది ఓ చరిత్ర. అది అమ్మకే చెల్లింది. అందుకే అమ్మ వెళుతున్నారు.. అంటే మనసు తట్టుకోలేకపోయింది. ఈ మరణం తీరని లోటు. అమ్మ ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాను`` అన్నారు.
`మా` ప్రధాన కార్యదర్శి శివాజీ రాజా మాట్లాడుతూ -``అమ్మ జయలలిత మహిళా శక్తి. పేద, మధ్యతరగతి ప్రజల పెన్నిధి. రాజకీయాల్లో ఓ ప్రభంజనం. అంతకుమించి గొప్ప నటిగానూ వెలిగిపోయారు. మహామహుల సరసన నాయికగా నటించారు. సినీ, రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మైలురాళ్లు అధిగమించారు. మనసున్న గొప్ప నాయకురాలిగా ప్రజల మన్ననలు అందుకున్నారు. తెలుగు, తమిళ సినీరంగంతో గొప్ప అనుబంధం ఉన్న అమ్మ నేడు లేరు అన్నది జీర్ణించుకోలేనిది. సినీ,రాజకీయ రంగాలకు ఇది తీరనిలోటు. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను`` అన్నారు.