
ప్రేమలో తీపి... చేదు నాకు బాగా తెలుసు!
పాప్ ప్రపంచంలో రారాణిగా వెలుగుతున్న మడోన్నా త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దర్శకురాలిగా చేయడం ఆమెకిది తొలిసారి కాదు. ఇప్పటికే కొన్ని వాణిజ్య ప్రకటనలు, ఓ లఘు చిత్రం, రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం దర్శకత్వం వహించనున్న చిత్రానికి ఓ నవలను ఆధారంగా చేసుకుంటున్నారు. ఓ నల్లజాతి యువకుడు, తెల్లజాతి యువతి మధ్య సాగే ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుంది. సమాజం విధించిన కట్టుబాట్ల కారణంగా పెళ్లి చేసుకోవాలన్న ఈ ఇద్దరి ఆశయం ఎలా నీరుగారిపోయింది? అనే అంశంతో ఈ చిత్రం సాగుతుంది.
ఇలాంటి ఓ మంచి ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించడానికి అన్ని అర్హతలు కలిగిన డెరైక్టర్‌ని తానేనని మడోన్నా చెబుతూ - ‘‘ప్రేమలోని తీపి, చేదు రెండూ నాకు బాగా తెలుసు. వ్యక్తిగతంగా ఈ రెండూ నాకు అనుభవమే. అందుకే లవ్‌స్టోరీ తీయడానికి అర్హత ఉన్న డెరైక్టర్‌ని అని చెబుతున్నా’’ అని తెలిపారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందని, ఈ నవలా చిత్రాన్ని ఓ అందమైన పెయింటింగ్‌లా తీయాలనే సన్నాహాల్లో మడోన్నా ఉన్నారని సమాచారం.