మడోనా సెబాస్టియన్
తమిళసినిమా: ముద్దొద్దని మూడు పోగొట్టుకున్నానంటోంది నటి మడోనా సెబాస్టియన్. మలయాళ చిత్రం ప్రేమమ్ ద్వారా వికసించిన భామల్లో ఈ బ్యూటీ ఒకరు. కోలీవుడ్‌లో నటించింది తక్కువ చిత్రాలే అయినా సక్సెస్‌ఫుల్ నటిగా పేరు తెచ్చుకున్న మడోనా సెబాస్టియన్ నటుడు విజయ్‌సేతుపతితో మూడోసారి జుంగా చిత్రంలో జత కట్టింది. ఇందులో అతిథి పాత్రే అయినా గుర్తుండిపోతుంటుందంటున్న ఈ అమ్మతో చిన్న భేటీ..
ప్ర: విజయ్‌సేతుపతి చిత్రం జుంగాలో అతిథి పాత్రలో నటించడానికి కారణం?
జ: విజయ్‌సేతుపతికి నాపై అపార నమ్మకం. ఇదే మొదటి కారణం. ఇక కథ వినగానే నా పాత్ర చాలా ఆకట్టుకుంది. అందుకే నటించడానికి అంగీకరించాను. చిత్రంలో నేను 5 నిమిషాలు కనిపించినా పర్వాలేదు ఆ పాత్ర ప్రేక్షకుల్లో గుర్తుండిపోవాలి. అదే నాకు ముఖ్యం.
ప్ర:తమిళంతో పాటు కన్నడం, మలయాళం, తెలుగు భాషల్లోనూ నటిస్తున్నారు. ఆ అనుభవం గురించి?
జ: నేను కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటాను. అందువల్ల నాకు భాషా సమస్య లేదు. ఏ భాషలోనైనా నా పాత్ర సంభాషణలను ముందుగానే తీసుకుని బట్టీ పడతాను. తమిళ భాషను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.
ప్ర: మీరు కోలీవుడ్‌లో ఎక్కువ చిత్రాల్లో నటించడం లేదే?
జ: నిజమే. అందుకు కారణం ఉంది. నేను లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికిప్పుడు సిద్ధంగా లేను. అలా ముద్దు సన్నివేశాల్లో నటించనన్నందుకు మూడు చిత్రాలను కోల్పోయాను. తొలిసారిగా కౌగిలించుకునే సన్నివేశంలో నటించే ముందు అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేశాను. నాకు బిడియం ఎక్కువ. ఇతరులతో మాట్లాడడానికే భయపడతాను. నాకో చెల్లె ఉంది. తనతోనే నాకు టైమ్ పాస్.
ప్ర: నటన కాకుండా ఏదంటే ఆసక్తి?
జ: బేసిగ్గా నేను గాయనిని. సొంతంగా సంగీత టీమ్‌ను నడుపుతున్నాను. అయితే చిత్రానికి సంగీతాన్ని అందించేంత ఆత్మవిశ్వాసం లేదనుకోండవి.
ప్ర: నటీమణులకు పబ్లిక్‌లో సమస్యలు ఎదురవుతుంటాయిగా?
జ: నిజమే. అయితే నటీమణులు సాధారణ మనుషులే.ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. నేను స్త్రీ పక్షపాతిని కాదు. అయితే మగవారితో పాటు స్త్రీలను సమానంగా గౌరవించాలి. వ్యక్తిత్వ హక్కు చాలా అవసరం.
ప్ర: ప్రేమ అనుభవం గురించి?
జ: వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం నాకిష్టం ఉండదు. అయినా అలాంటిదేమైనా ఉంటే బహిరంగంగానే చెబుతాను.
ప్ర: మీరు కథలను ఎంపిక చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
జ: మొదట కథ కంటెంట్ ఏమిటన్నది చూస్తాను. తరువాత నా పాత్ర, దాని ప్రాముఖ్యత గురించి ఆలోచిస్తాను. దర్శకుడు ప్రతిభ గురించి కూడా చర్చిస్తాను. ఆ తరువాతనే పారితోషికం విషయాలు.
ప్ర: ప్రస్తుతం మలయాళ నటీనటుల సంఘం వివాదంగా మారిందే?
జ: ముందు ఒక విషయం గురించి చెప్పాలి. నేను ఏ సంఘంలోనూ సభ్యురాలిని కాదు. కాబట్టి మీ ప్రశ్నకు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేను.
Comments
Please login to add a commentAdd a comment