![Madras High Court Directions on Darbar Release in Malaysia - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/7/Rajinikanth.jpg.webp?itok=-fJE2ToF)
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ‘దర్బార్’కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల థియేటర్లలో ఈ నెల 9న దర్బార్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మలేసియాలో ఈ సినిమా విడుదల విషయమై మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మలేసియాలో తమిళులు అధికం. అక్కడ రజనీకాంత్ సినిమాలు బాగా ఆడుతాయి. ఈ నేపథ్యంలో మలేసియాలో దర్బార్ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే, రజనీకాంత్ గత సినిమా 2.0కు సంబంధించి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్.. ఒక మలేషియా సంస్థకు రూ. 23 కోట్లు బకాయి పడింది. ఈ బకాయి చెల్లించకుండానే లైకా సంస్థ తాజాగా తన సినిమా ‘దర్బార్’ను మలేసియాలో విడుదల చేస్తుండటంతో సదరు సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మలేసియాలో దర్బార్ విడుదలపై స్టే విధించాలని కోరింది. దీనికి స్పందించిన హైకోర్టు మలేసియాలో దర్బార్ విడుదలకు రూ. 4.90 కోట్ల డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ డబ్బు డిపాజిట్ చేయనిపక్షంలో మలేసియాలో దర్బార్ సినిమా విడుదల ఉండబోదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment